Share News

Telangana crime: వృద్ధ దంపతులకు మత్తిచ్చి బంగారం దోపిడీ

ABN , Publish Date - Oct 14 , 2025 | 02:30 AM

వృద్ధ దంపతులకు నమ్మకస్తుడిగా ఉండే యువకుడే వారిపాలిట యముడయ్యాడు. వారికి మత్తుమందు ఇచ్చి చోరీకి పాల్పడ్డాడు...

Telangana crime: వృద్ధ దంపతులకు మత్తిచ్చి బంగారం దోపిడీ

  • ఆస్పత్రిలో భర్త మృతి, భార్య పరిస్థితి విషమం

  • నమ్మకస్తుడైన యువకుడి పనే.. కరీంనగర్‌ జిల్లాలో ఘటన

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): వృద్ధ దంపతులకు నమ్మకస్తుడిగా ఉండే యువకుడే వారిపాలిట యముడయ్యాడు. వారికి మత్తుమందు ఇచ్చి చోరీకి పాల్పడ్డాడు. మందు తీవ్రతకు వృద్ధుడు మృతిచెందగా, వృద్ధురాలు చావుబతుకల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కరీంనగర్‌ జిల్లాలోని గంగారం మండలం గర్షకుర్తికి చెందిన గజ్జల శంకరయ్య (76), లక్ష్మి(70) దంపతులు. వీరికి ఇంటికి దగ్గర్లోనే ఉండే కత్తి శివ అనే యువకుడు.. వారికి మందులు, కిరాణా సరుకులు తెచ్చి ఇచ్చేవాడు. శివ జల్సాలకు మరగడంతో బాగా అప్పులు పెరిగిపోయాయి. వృద్ధ దంపతులను చంపేసి లక్ష్మి మెడలోని బంగారు పుస్తెల తాడును ఎత్తుకెళ్లాలని శివ పథకం వేశాడు. శివ గతంలో ముంబైలో ఓ కల్లు దుకాణంలో పనిచేసి మానేశాడు. అక్కడ కల్లులో మత్తు కోసం కలిపే టాబ్లెట్లలో కొన్నింటిని దాచుకున్నాడు. శంకరయ్య, లక్ష్మి.. జ్వరం, జలుబు, దగ్గు ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని తెలుసుకున్న శివ, ఈనెల 7న ఉదయం.. ఆరోగ్య సమస్యలన్నీ పోతాయని వారిని నమ్మించి.. ఆరుమాత్రల చొప్పున వారితో మింగించి వెళ్లిపోయాడు. వృద్ధ దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్లాక లక్ష్మి మెడలోని పుస్తెల తాడును తీసుకొని వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి ఇరుగుపొరుగు చూసి.. వృద్ధ దంపతులను కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ మరుసటి రోజు శంకరయ్య మృతిచెందగా, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. కాగా శివ.. ఆ పుస్తెల తాడు ను అదేగ్రామంలోని బంగారు వ్యాపారి కట్ల శ్రీనివాసాచారికి విక్రయించి రూ.1.85 లక్షలు తీసుకున్నాడు. సోమవారం శివను అదుపులోకి తీసు కున్న పోలీసులు.. రూ.25వేల నగదు, ఫోన్‌, సిమ్‌కార్డును స్వాధీనం చేసుకున్నాడు. శివపై హత్య, దోపిడీ, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలం తెలిపారు.

Updated Date - Oct 14 , 2025 | 02:30 AM