Vikarabad Incident: వృద్ధ దంపతుల ఆత్మహత్య
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:37 AM
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోగా..
యాలాల, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోగా.. అది చూసి తల్లడిల్లిపోయిన అతని భార్య కూడా వెంటనే బలవన్మరణానికి పాల్పడింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన మంచన్‌పల్లి శ్రీనివా్‌సరెడ్డి(68), భాగ్యమ్మ(64) దంపతులు ఇలా ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. యాలాల ఎస్‌ఐ విఠల్, కుటుంబసభ్యులు, గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.. రాస్నంకు చెందిన మంచన్‌పల్లి శ్రీనివా్‌సరెడ్డి(68), భాగ్యమ్మ(64) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులు ఇద్దరూ అవివాహితులు. పెద్ద కుమారుడు వేరే ప్రాంతంలో ఉంటూ ఉద్యోగం చేస్తుండగా.. చిన్న కుమారుడు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. దాదాపు రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ రెడ్డి తన అవస్థను భరించలేక ఆదివారం తెల్లవారుజామున తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. భర్త ఆత్మహత్యను తట్టుకోలేకపోయిన భాగ్యమ్మ గ్రామ సమీపంలోని కాల్వలో దూకి ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.