Son Assaults Father Over Questioning: ఆస్తులు పంచుకున్నారు కానీ..తల్లిదండ్రులకు తిండి పెట్టడంలేదు
ABN , Publish Date - Nov 12 , 2025 | 03:13 AM
వృద్ధాప్యంలో ఆదరవుగా ఉంటారని నమ్మి ఆస్తి పంచి ఇస్తే, నేడు తమ బిడ్డలు కనీసం పట్టించుకోవడంలేదని సిద్దిపేట జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు వాపోయారు...
ఇదేమిటని అడిగితే తండ్రిపై కొడుకుల దాడి
న్యాయం చేయాలని వృద్ధ దంపతుల వేడుకోలు
అక్కన్నపేట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): వృద్ధాప్యంలో ఆదరవుగా ఉంటారని నమ్మి ఆస్తి పంచి ఇస్తే, నేడు తమ బిడ్డలు కనీసం పట్టించుకోవడంలేదని సిద్దిపేట జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు వాపోయారు. తిండిపెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తూ, ఇదేంటని ప్రశ్నిస్తే తండ్రిపైనే దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. మండల కేంద్రానికి చెందిన మిట్టపల్లి లక్ష్మి-వెంకటయ్య దంపతులకు సత్యనారాయణ, సదయ్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎంతో కష్టపడి వారిని ప్రయోజకుల్ని చేసి పెళ్లిళ్లు జరిపించిన తండ్రి, తను సంపాదించిన 8 ఎకరాల వ్యవసాయ భూమిని ఇద్దరికీ మూడు ఎకరాల చొప్పున పంచాడు. మిగతా రెండు ఎకరాలు తన పేరు మీద ఉంచుకున్నప్పటికీ, ఆ భూమిని సైతం కుమారులు అమ్మేశారు. తనకు తుంటి విరిగి అనారోగ్యం బారిన పడినా పట్టించుకోలేదని, చివరకు చేసేది లేక భార్య మెడలో బంగారం తాకట్టు పెట్టి ఆపరేషన్ చేయించాల్సిన దుస్థితి వచ్చిందని వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్న కుమారుడు పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తుండడంతో ప్రభుత్వం నుంచి పింఛను కూడా రావడం లేదన్నాడు. కొడుకులు పంచుకున్న భూమిని తిరిగి తమ పేర్ల మీదకు మార్చాలని హుస్నాబాద్ ఆర్డీవో నుంచి నోటీసులు అందించినా పట్టించుకోవలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించిన్యాయం చేయాలని వృద్ధ దంపతులు కోరుతున్నారు.