Share News

Congress Jubilee Hills By Election Victory: హస్తగతానికి అష్ట సూత్రాలు!

ABN , Publish Date - Nov 15 , 2025 | 05:37 AM

ఎన్నికల ప్రచారం జరిగినంత సేపూ నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా కనిపించిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌ ‘హస్త’గతం కావడం వెనుక ఎనిమిది అంశాలు కీలకంగా మారాయి......

Congress Jubilee Hills By Election Victory: హస్తగతానికి అష్ట సూత్రాలు!

  • సంక్షేమ, అభివృద్ధి పథకాల నుంచి బీసీ ఫ్యాక్టర్‌ దాకా..

  • కాంగ్రె్‌సకు ఆక్సిజన్‌లా మజ్లిస్‌ మద్దతు

  • ఏడు డివిజన్లలో మంత్రులకు బాధ్యతలు

  • మలుపు తిప్పిన సీఎం రేవంత్‌ ప్రచారం

  • నవీన్‌కు కలసివచ్చిన సానుభూతి ఓటింగ్‌

  • అధికార పార్టీగా ఉన్న అనుకూలతలు

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారం జరిగినంత సేపూ నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా కనిపించిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌ ‘హస్త’గతం కావడం వెనుక ఎనిమిది అంశాలు కీలకంగా మారాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీసీ ఫ్యాక్టర్‌, మజ్లిస్‌ మద్దతు, అధికార పార్టీ కావటం, అభివృద్ధి నినాదం, సీఎం రేవంత్‌రెడ్డి సుడిగాలి ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్‌, నవీన్‌ యాదవ్‌పై సానుభూతి వంటివి కాంగ్రెస్‌ విజయానికి మార్గం వేశాయి. అదీ మంచి మెజారిటీతో గెలవడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

తొలుత బీఆర్‌ఎ్‌సకు మొగ్గు కనిపించినా..

మాగంటి గోపీనాథ్‌ మృతితో వచ్చిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గోపీనాథ్‌ భార్య సునీతను బీఆర్‌ఎస్‌, స్థానిక యువనేత నవీన్‌ యాదవ్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దింపాయి. తొలుత బీఆర్‌ఎ్‌సకు అనుకూల వాతావరణం కనిపించినా పరిస్థితి మారింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు కాంగ్రెస్‌ వైపు మళ్లింది. ఇందులో సీఎం రేవంత్‌ ప్రచారం కీలకంగా మారింది. ఆయన వారంపాటు నాలుగు రోడ్డు షోలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను చుట్టేశారు.


అభివృద్ధి, సంక్షేమ నినాదంతో..

రేవంత్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఉప ఎన్నికను ముందునుంచే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. షెడ్యూల్‌ విడుదలకు ముందే మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజల్లోకి వెళ్లి.. అభివృద్ధి నినాదాన్ని బలంగా వినిపించారు. అదేక్రమంలో సన్నబియ్యం, గృహాలకు ఉచిత విద్యుత్‌, రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్‌కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలనూ ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రచారం సందర్భంగా జూబ్లీహిల్స్‌లో 4వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, మైనార్టీలకు ఖబరస్థాన్‌ సమస్యను పరిష్కారిస్తామని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపర్చడంతోపాటు ఇళ్లపై ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లను తొలగిస్తానని హామీ ఇవ్వడం కూడా ప్రభావం చూపింది. కాంగ్రెస్‌ అధికారంలో ఉండడంతో.. ఆ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. మరో మూడేళ్లు అభివృద్ధి పనులకు ఢోకా ఉండదన్న అభిప్రాయంతో ఓటర్లు నవీన్‌ యాదవ్‌ వైపు మొగ్గు చూపారు.

నవీన్‌ యాదవ్‌-రేవంత్‌రెడ్డి కాంబో!

కాంగ్రెస్‌ పార్టీకి నవీన్‌ యాదవ్‌ రూపంలో స్థానికంగా బలమైన అభ్యర్థి దొరికారు. యువకుడు, విద్యావంతుడు కావటంతోపాటు సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉండటం కలిసొచ్చింది. సీఎం రేవంత్‌ కూడా ఆయనను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. అదే సమయంలో 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన అజారుద్దీన్‌ను ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేసి, సర్దుబాటు చేశారు. తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు. తద్వారా నవీన్‌ యాదవ్‌కు మార్గం సుగమం చేశారు. మరోవైపు గత రెండు ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో పోటీ చేసి ఓడిపోయిన నవీన్‌యాదవ్‌కు ఆ సానుభూతి కూడా కలిసి వచ్చింది.


బీసీ అభ్యర్థి.. మజ్లిస్‌ మద్దతు

ఈ ఉప ఎన్నికలో మజ్లిస్‌ పోటీచేయలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థికే మద్దతు ప్రకటించింది. దీంతో ఎంఐఎం ఓట్లు సింహభాగం కాంగ్రె్‌సకు వచ్చాయి. అజారుద్దీన్‌కు మంత్రి పదవి నేపథ్యంలోనూ ముస్లింల ఓట్లు కాంగ్రెస్‌ వైపు మళ్లాయి. ఇక కాంగ్రెస్‌ తీసుకున్న ‘బీసీ నినాదం’ కూడా ఉపయోగపడింది. బీఆర్‌ఎస్‌ కమ్మ సామాజికవర్గానికి చెందిన మాగంటి సునీతను పోటీలో దింపగా, బీజేపీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన లంకల దీపక్‌రెడ్డిని బరిలో దింపింది. కాంగ్రెస్‌ తరఫున బీసీ అయిన నవీన్‌ యాదవ్‌ రంగంలో ఉండటం కలిసివచ్చింది.

పకడ్బందీ పోల్‌ మేనేజ్‌మెంట్‌తో..

కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలోనే కాదు పోల్‌ మేనేజ్‌మెంట్‌లోనూ పకడ్బందీగా వ్యవహరించింది. నిజానికి తొలి నుంచీ బీఆర్‌ఎస్‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌లో దిట్ట. గతంలో చాలా ఉప ఎన్నికల్లో అలాగే గెలిచింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్‌ పైచేయి సాధించింది. ఇంటింటి ప్రచారం, ఓటర్ల మ్యాపింగ్‌, దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించడం, బూత్‌ వారీగా కాంగ్రెస్‌ శ్రేణుల మోహరింపు ఫలితాన్ని ఇచ్చాయి.

Updated Date - Nov 15 , 2025 | 05:37 AM