kumaram bheem asifabad- జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:18 PM
రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు అధికారుల సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని శాసనమం డలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా బండ ప్రకాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
- ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు పెద్దపీట
- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు అధికారుల సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని శాసనమం డలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా బండ ప్రకాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో స్వయం పాలన అవశ్యకతను ప్రపంచానికి చాటిన జిల్లా ముద్దుబిడ్డ కుమరంభీంలాంటి ఎందరో మహనీయులను స్మరించుకోవడం మన విధి అన్నారు. ప్రభుత్వం పేద ప్రజల ఆహార భద్రతకు భరోసాను ఇస్తున్నదని అన్నారు. ఉగాది నుంచి సన్న బియ్యం ప్రారంభించి రూ. 13వేల కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తుందన్నారు. జిల్లాలో 48వేల మందికి రేషన్ కార్డులను పంపిణీ చేశామని అన్నారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద 51,523 మంది రైతులకు రూ. 465 కోట్లు అందించామని అన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద జిల్లాలో 1,33,306 మంది రైతుల ఖాతాల్లో రూ. 251 కోట్లు జమ చేశామని అన్నారు. రైతుభీమా పథకం కింద 501 మంది రైతు కుటుంబాలకు రూ.25 కోట్లను వారి నామినీల ఖాతాలో జమయ్యాయని అన్నారు. యాసంగి సీజన్‌లో 1218 మంది రైతులకు రూ. 2.84 కోట్ల సన్న బియ్యం బోనస్ చెల్లించామని వివరిం చారు. జిల్లాకు 7,398 ఇందిరమ్మ ఇళ్లు మంజూర య్యాయని అన్నారు. ప్రస్తుతం వివిద దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. స్థానిక సంస్థలో, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లును మార్చి 17న రాష్ట్ర శాస నసభలో ఆమోదించిందని చెప్పారు. మహలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 1.68 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నా రన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా జిల్లాలో అర్హులైన 72,817 కుటుంబాలకు రూ.31.58 కోట్లు రాయితీ అందిస్తున్నామని వివరిం చారు. జిల్లాలో ఇప్పటి వరకు ఐదు మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేశామని అన్నారు. సంక్షేమ వసతి గృహాలలోని, పాఠశాలలోని విద్యార్థులకు 40 శాతం డైట్ 200 శాతం కాస్మోటిక్ చార్జీలను పెంచి నూతన మెనూ అమలు చేస్తున్నామని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నా మన్నారు. రెవెన్యూ సదస్సుల్లో 4356 దరఖాస్తులు రాగా అందులో 148 దరఖాస్తులు అధికారులు పరిష్కరించారని చెప్పారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయ న్నారు. జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమం కింద 51 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పె ట్టుకున్నామని అన్నారు. అస్పిరేషన్ బ్లాక్‌లో తిర్యాణి మండలం దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం, భారత దేశంలో 4వ స్థానంలో నిలిచిందన్నారు. ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్, సబ్‌కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఎఫ్‌డీవో సుశాంత్ సుఖ్‌దేవ్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
- ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పట్టణంలోని పాఠ శాలలతో పాటు వాంకిడి, కెరమెరి కేజీబీవీ పాఠశాలల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి. విద్యార్థులు దేశభక్తి ఉట్టిపడేలా చేపట్టిన గ్రూపు డ్యాన్సులు అందరిని అలరించాయి. భారతమాత వేషధారణలో విద్యార్థిని ప్రత్యేక అకర్షణగా నిలిచింది.
- స్టాళ్ల పరిశీలన
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టరేట్‌లో అయా శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. గ్రామీణాభివృద్ది శాఖ, ఉద్యాన పట్టు పరిశ్రమశాఖ, గిరిజన సంక్షేమశాఖ, పాఠశాల విద్యాశాఖ, అటవీ శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన, వైద్య ఆరోగ్యశాఖ, మత్స్యశాఖ, జిల్లా పశుసంవర్థకశాఖలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్, సబ్‌కలెక్టర్ శ్రద్ద శుక్లా, ఎఫ్‌డీవో సుశాంత్ సుఖ్‌దేవ్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు స్టాళ్లను పరిశీలించారు.
- విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేత
జిల్లాలో పదో తరగతి, ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన ఎనిమిది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు. తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల ఆసిఫాబాద్‌కు చెందిన గుండేటి వర్షీత్, సయ్యద్ ఉమేజ్‌నాజ్, మోహర్లే రా ము, అదిబా తహరీం, జడ్పీహెచ్‌ఎస్ కౌటాలకు చెందిన కె సాయికృష్ణ, జడ్పీహెచ్‌ఎస్ పెట్రోల్‌బంక్ కాగజ్‌నగర్‌కు చెందిన రీంసా తబసుం, తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాల సిర్పూర్(యూ)కు చెందిన ఎన్ రాజేష్, కేజీబీవీ రెబ్బెనకు చెందిన టి వర్షలకు ప్రకాష్ నగదు పురస్కారాలు అందుకున్నారు.