Share News

ED Raids on Medical Colleges: వైద్య కళాశాలల్లో ఈడీ సోదాలు

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:57 AM

తెలంగాణ, ఏపీ సహా పది రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల తనిఖీలకు వెళ్లిన జాతీయ వైద్య కమిషన్‌ ఎన్‌ఎంసీ అధికారులకు కోట్లాది రూపాయల ముడుపులు అందిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌...

ED Raids on Medical Colleges: వైద్య కళాశాలల్లో ఈడీ సోదాలు

  • తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో తనిఖీలు

  • జాతీయ వైద్య కమిషన్‌ తనిఖీ అధికారులకు భారీగా ముడుపుల కేసులో రంగంలోకి ఈడీ

  • హవాలా మార్గంలో ముడుపుల చెల్లింపు

  • 66 లక్షలు చెల్లించిన వరంగల్‌ జిల్లాలోని ఫాదర్‌ కొలంబో కాలేజీ యాజమాన్యం

  • ముగ్గురు మధ్యవర్తుల ఇళ్లలోనూ సోదాలు

హైదరాబాద్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఏపీ సహా పది రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల తనిఖీలకు వెళ్లిన జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అధికారులకు కోట్లాది రూపాయల ముడుపులు అందిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. సీబీఐ నమోదు చేసిన ఈ కేసులో మనీ లాండరింగ్‌ కోణం ఉన్నట్లు గుర్తించిన ఈడీ.. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీలో 15చోట్ల సోదాలు నిర్వహించింది. ఇందులో ఏడు వైద్య కళాశాలలతో పాటు అధికారులు, మధ్యవర్తుల ఇళ్లు, కార్యాలయాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి వరంగల్‌ జిల్లాలోని ఫాదర్‌ కొలంబో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సలో, మధ్యవర్తులుగా వ్యవహరించిన ముగ్గురు వైద్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ కాలేజీ యాజమాన్యానికి చెందిన ఫాదర్‌ కొమ్మారెడ్డి రెండు విడతల్లో రూ.66 లక్షలను మధ్యవర్తుల ద్వారా ఎన్‌ఎంసీ పెద్దలకు పంపించారని ఇప్పటికే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ముగ్గురు డాక్టర్లు అంకం రాంబాబు, హరిప్రసాద్‌, కృష్ణ కిషోర్‌ పలు వైద్య కళాశాలలకు మధ్యవర్తులుగా వ్యవహరించిన క్రమంలో వారి ఇళ్లల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏపీకి సంబంధించి.. విశాఖలోని గాయత్రి మెడికల్‌ కాలేజీ డైరెక్టర్‌ వెంకట్‌ నుంచి మధ్యవర్తి కృష్ణ కిషోర్‌కు రూ.50 లక్షలు అందగా.. ఆయన ఆ మొత్తాన్ని హవాలా మార్గంలో ఢిల్లీలోని ఎన్‌ఎంసీ పెద్దలకు పంపించిన క్రమంలో హవాలా చెల్లింపులపై ఈడీ అధికారులు ఆరా తీశారు. ముడుపుల చెల్లింపులు చాలావరకు హవాలా మార్గంలో జరిగినట్లు గుర్తించి, సాక్ష్యాధారాలను సేకరించినట్లు సమాచారం. ముడుపులతో పాటు ఎన్‌ఎంసీ నుంచి తనిఖీలకు సంబంధించి కీలక సమాచారం లీక్‌ అవుతున్న వ్యవహారంపై జూన్‌ 30న సీబీఐ కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా మనీ లాండరింగ్‌ కోణంలో ఈడీ తాజాగా దర్యాప్తు చేపట్టింది.


కేంద్ర ఆరోగ్య శాఖ, ఎన్‌ఎంసీ అధికారులు, మధ్యవర్తులు, ప్రైవేటు వైద్య కళాశాలల ప్రతినిధులు ఒక సిండికేట్‌గా ఏర్పడి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని సీబీఐ అభియోగం. ఎన్‌ఎంసీ, ప్రభుత్వ అధికారులు వైద్య కళాశాలల తనిఖీలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని వైద్య కళాశాలల యాజమాన్యాలకు, మధ్యవర్తులకు లీక్‌ చేశారని, దాంతో వారికి భారీగా ముడుపులు అందాయని సీబీఐ గుర్తించింది. తనిఖీల సమాచారం ముందుగానే అందడంతో కళాశాలల యాజమాన్యాలు జాగ్రత్తపడి.. ప్రమాణాల విషయంలో మసిపూసి మారేడుకాయ చేసి, అనుమతులు సాధిస్తున్నాయి. ఎన్‌ఎంసీ అధికారుల బృందం వైద్య కళాశాలల తనిఖీకి ఎప్పుడు వచ్చేదీ, బృందంలోని సభ్యుల వివరాలు, వారు ఏ అంశాలను పరిశీలిస్తారనే సమాచారం చాలా ముందుగానే బ్రోకర్ల ద్వారా కొన్ని వైద్య కళాశాలలకు అందిందని, దానికి ప్రతిఫలంగా మధ్యవర్తుల ద్వారా పలు వైద్య కళాశాలలు ఎన్‌ఎంసీ అధికారులకు కోట్ల రూపాయలు చెల్లించాయని సీబీఐ కేసు నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో 34 మంది పేర్లను చేర్చింది. వీరిలో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు 8 మంది, జాతీయ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు, ఎన్‌ఎంసీ తనిఖీ బృందం సభ్యులైన ఐదుగురు డాక్టర్లు కూడా ఉన్నారు. కాగా, ఛత్తీ్‌సగఢ్‌లోని ఓ వైద్య కళాశాలకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు రూ.55 లక్షలు లంచం తీసుకున్న అభియోగంపై ముగ్గురు ఎన్‌ఎంసీ తనిఖీ బృందం సభ్యులను, మరో ఐదుగుర్ని సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది.

Updated Date - Nov 28 , 2025 | 04:57 AM