ED Conducts Raids: నకిలీ ఐటీసీ కేసు దర్యాప్తు...ఐదు రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:58 AM
నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీ సీ) కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీ సీ) కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో 10 చోట్ల సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. హరియాణా, అరుణాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో ఈడీ అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. భారీ స్థాయిలో సరుకు రవాణా చేసినట్లు ఇన్‌వాయి్‌సలు సృష్టించి, కోట్లాది రూపాయల వ్యాపారాన్ని కాగితాల మీద చూపించి, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను అక్రమంగా పొందినట్లు ఈడీ గుర్తించింది. పలు షెల్ కంపెనీల ఖాతాల ద్వారా దాదాపు రూ.650కోట్లు కొందరి వద్దకు చేరాయని భావిస్తున్న ఈడీ.. వారెవరో గుర్తించే పనిలో ఉంది. వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే అంతిమ లబ్ధిదారుడిగా భావిస్తున్న శివకుమార్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే మరికొందరు వ్యక్తులు, సంస్థలు నకిలీ ఐటీసీ కుంభకోణంలో భాగస్వాములైనట్లు గుర్తించి, దేశవ్యాప్తంగా దర్యాప్తు చేపట్టారు.