GST Scam Exposed: జీఎస్టీ స్కామ్ గుట్టు రట్టు
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:52 AM
వస్తు సేవల పన్ను జీఎస్టీకు సంబంధించి కోట్లాది రూపాయల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను పొందిన పలు బహుళ జాతి కంపెనీల..
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు
కోట్లాది రూపాయల ఐటీసీని క్లెయిమ్ చేసిన ఎంఎన్‌సీలు
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి కోట్లాది రూపాయల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను పొందిన పలు బహుళ జాతి కంపెనీల(ఎంఎన్‌సీ) గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రట్టు చేసింది. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఈ కుంభకోణాన్ని అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్ కార్యాలయ అధికారులు బయటపెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లోని 10 ప్రదేశాలతో పాటు ఢిల్లీ, హరియాణ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సోదాలు నిర్వహించగా.. కోట్లాది రూపాయల వరకు అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఈమేరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం(పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేశారు. అసోంలోని గువాహటిలో గల అమిత్ ట్రేడర్స్ సంస్థ పాల్పడిన అక్రమాలపై శోధించగా.. ఇలాంటి బాగోతాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నట్లు గుర్తించారు. అసలు గువాహటిలో ఆ సంస్థ పేర్కొన్న అడ్ర్‌సలో లేదని, తప్పుడు అడ్రస్ పేర అక్రమానికి పాల్పడినట్లు తేలిందని ఈడీ వివరించింది. ఈ కంపెనీ తప్పుడు కొనుగోళ్లను చూపించి, శ్రీరామ్ ఎంటర్‌ప్రైజెస్ అనే మరో సంస్థకు ఐటీసీని పాస్ చేసిందని తెలిపింది. శ్రీరామ్ ఎంటర్‌ప్రైజెస్ రూ.700 కోట్ల విలువైన బోగస్ ఇన్వాయి్‌సలను చూపి రూ.116 కోట్ల ఐటీసీని క్లెయిమ్ చేసిందని పేర్కొంది. ఈ కేసులో ఈడీ అధికారులు బ్యాంకు బ్యాలెన్స్‌లను ఫ్రీజ్ చేసి, స్థిరాసులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని వినర్ధ్ ఆటోమొబైల్ అనే కంపెనీ 2022-23, 2023-24లలో వాహనాలను తయారు చేసి, విక్రయించినట్లు రూ.110 కోట్ల టర్నోవర్‌ను చూపి మోసానికి పాల్పడింది. బోగస్ ఇన్వాయి్‌సలతో వాహనాలను సరఫరా చేసినట్లు చూపి, జీఎస్టీ రీఫండ్‌ను క్లెయిమ్ చేసింది.