ED Investigation: సృష్టి ఫెర్టిలిటీ స్కామ్‌లో ఈడీ లోతైన విచారణ
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:42 AM
సృష్టి ఫెర్టిలిటీ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అఽధికారులు లోతైన విచారణ ప్రారంభించారు...
జైల్లో వారం పాటు నిందితుల విచారణకు ఈడీకి అనుమతి
తొలిరోజు డాక్టర్ నమ్రత సహా ఆరుగురిని ప్రశ్నించిన ఈడీ
హైదరాబాద్, సైదాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): సృష్టి ఫెర్టిలిటీ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అఽధికారులు లోతైన విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన 25మంది నిందితుల్లో కొందరిని ప్రశ్నించడానికి ఈడీ అధికారులు కోర్టు అనుమతి పొందారు. బుధవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులను విచారించడానికి ఈడీకి కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో ఈడీ అధికారులు బుధవారం చంచల్‌గూడ జైలుకు వెళ్లి డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణ, నందిని, సంతోషి, కల్యాణిలను వేర్వేరుగా ప్రశ్నించారు. ఇటీవల సృష్టి ఫెర్టిలిటీ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పది చోట్ల సోదాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర మెట్రో నగరాలైన కోల్‌కతా, బెంగళూరులో డాక్టర్ నమ్రత పటిష్టమైన నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. పదేళ్ల నుంచి డాక్టర్ నమ్రత పక్కా పథకం ప్రకారం ఫెర్టిలిటీ కేంద్రాలకు వచ్చిన వారిని నమ్మించి మోసాలకు పాల్పడుతోందని, శిశువుల క్రయవిక్రయాలకు సంబంధించిన ఆధారాలను ఈడీ అధికారులు సేకరించారు. డాక్టర్ నమ్రతతో పాటు మరికొందరిపై గోపాలపురం పోలీసులు నమోదు చేసిన కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సిట్‌కు అప్పగించారు. ఆ తర్వాత మనీలాండరింగ్ కోణంలో విచారణ ప్రారంభించిన అధికారులు పలుచోట్ల సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.