ED: ఈడీ ప్రాథమిక నివేదికపై ఏం చేశారు?
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:13 AM
నాగారంలో వివాదాస్పద భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని హైకోర్టు....
నాగారం భూములపై పోలీసుల వివరణ కోరిన హైకోర్టు
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): నాగారంలో వివాదాస్పద భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెంబర్ 181, 182లోని భూదాన్ భూములకు తప్పుడు రికార్డులు సృష్టించి అక్రమంగా బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపిన ఈడీ.. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని పోలీసులకు తెలిపింది. ఈడీ ఈ సమాచారం ఇచ్చి చాలా రోజులు అవుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ సర్వే నెంబర్ 181లోని భూమిలో యాజమాన్య హక్కులు క్లెయిం చేస్తున్న దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం సమాధానం చెప్పాలని డీజీపీ, మహేశ్వరం డీసీపీ, మహేశ్వరం ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీచేసింది. ఇందుకు వారం రోజుల సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది.