Drug Bust: డ్రగ్స్, హవాలా నెట్‌వర్క్‌ను ఛేదించిన ఈగల్
ABN , Publish Date - Oct 11 , 2025 | 03:14 AM
దేశవ్యాప్తంగా ఉన్న నైజీరియన్ డ్రగ్స్ ముఠా నగదు హవాలా నెట్‌వర్క్‌ను ఈగల్ బృందాలు ఛేదించాయి. ముంబై, ఢిల్లీ..
దేశవ్యాప్తంగా పలు చోట్ల సోదాలు
నెలరోజులుగా తప్పించుకు తిరుగుతున్న హవాలా ఆపరేటర్ ప్రజాపతి ముంబైలో అరెస్టు
హైదరాబాద్, అక్టోబర్ 10 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న నైజీరియన్ డ్రగ్స్ ముఠా నగదు హవాలా నెట్‌వర్క్‌ను ఈగల్ బృందాలు ఛేదించాయి. ముంబై, ఢిల్లీ, రాజస్థాన్, గోవాలో నైజీరియన్ డ్రగ్స్ స్మగ్లర్లకు సహకరిస్తున్న పలువురు హవాలా ఆపరేటర్ల ఇళ్లు, కార్యాలయాలపై ఈగల్ బృందాలు దాడులు నిర్వహించాయి. డ్రగ్స్, మనీ లాండరింగ్‌లో కీలకంగా వ్యవహరించిన హవాలా ఆపరేటర్ దగ్గారం ప్రజాపతిని ముంబైలో అదుపులోకి తీసుకుని, రూ.3 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నామని ఈగల్ డైరక్టర్ సందీప్ శాండిల్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో జరిగిన దాడుల్లో ప్రజాపతి తమ నుంచి తప్పించుకున్నాడని, అతడి స్నేహితుల కదలికలపై నిఘా ఉంచి తాజాగా అతడిని అరెస్టు చేయగలిగామని వివరించారు. ఈగల్ దాడుల నేపథ్యంలో దాదాపు నెలరోజుల నుంచి తప్పించుకుతిరుగుతున్నాడని, ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేసి, కొత్త నంబర్లను వాడుతున్నాడని తెలిపారు. నైజీరియాకు చెందిన మ్యాక్స్‌వెల్ అనే వ్యక్తితో పాటు అతడి బృందం నుంచి డ్రగ్స్ అమ్మగా వచ్చిన నగదును ప్రజాపతి హవాలా మార్గంలో సూరత్, ముంబై, ఢిల్లీలోని వస్త్ర వ్యాపారులకు పంపేవాడని తెలిపారు. నైజీరియన్లు భారత్‌లో డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుతో వస్త్రాలను కొనుగోలు చేసి తమ దేశానికి కంటైనర్ల ద్వారా పంపేవారని, ఇదంతా ఒక పెద్ద నెట్‌వర్క్‌గా గుర్తించామని ఆయన వివరించారు. ఈ కేసులో 25 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. విదేశీయులకు ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు ఇంటి యజమానులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించి ఏ సమాచారం ఉన్నా 1908 నంబర్‌కు ఫోన్‌చేసి తెలియచేయాలని సందీప్ శాండిల్య పేర్కొన్నారు.