Share News

Nigerian Drug Racket: పక్కా ప్లాన్‌తో మత్తు వదిలించారు

ABN , Publish Date - Nov 29 , 2025 | 03:42 AM

రాష్ట్రంలోని మల్నాడు రెస్టారెంట్‌లో డ్రగ్స్‌ తీగ దొరికింది.. అదేమిటని లాగుతూ వెళితే ఢిల్లీలో ఓ నైజీరియన్‌ వరకు వెళ్లింది. అదేదో పెద్ద వ్యవహారంలా ఉందని గట్టిగా ప్రయత్నిస్తే ఏకంగా భారీ నైజీరియన్‌ డ్రగ్స్‌ కార్టెల్‌...

Nigerian Drug Racket: పక్కా ప్లాన్‌తో మత్తు  వదిలించారు

  • క్షేత్రస్థాయిలో నిఘా పెట్టి నైజీరియా డ్రగ్స్‌ రాకెట్‌ను చిత్తుచేసిన ఈగిల్‌ బృందం

  • మల్నాడు రెస్టారెంట్‌ నుంచి ఢిల్లీ వరకు.. ‘మత్తు’ నెట్‌వర్క్‌ గుట్టు విప్పిన కొరియర్‌ పార్సిల్‌

  • వస్త్రాలు, పాదరక్షల పార్సిళ్లలో మత్తు మందులు

  • దేశవ్యాప్తంగా 2 వేల మందికి డ్రగ్స్‌ సరఫరా

  • సూత్రధారితో పాటు 50 మంది అరెస్ట్‌

  • రూ.3.5 కోట్ల విలువైన మత్తుమందులు స్వాధీనం

  • హైదరాబాద్‌కు చెందిన 11మందికి డ్రగ్స్‌ రవాణా

  • మీడియాకు వివరాలు వెల్లడించిన ఢిల్లీ, తెలంగాణ పోలీసులు

హైదరాబాద్‌/ న్యూఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మల్నాడు రెస్టారెంట్‌లో డ్రగ్స్‌ తీగ దొరికింది.. అదేమిటని లాగుతూ వెళితే ఢిల్లీలో ఓ నైజీరియన్‌ వరకు వెళ్లింది. అదేదో పెద్ద వ్యవహారంలా ఉందని గట్టిగా ప్రయత్నిస్తే ఏకంగా భారీ నైజీరియన్‌ డ్రగ్స్‌ కార్టెల్‌ డొంక కదిలింది. వినూత్నంగా వస్త్రాలు, బూట్లు, సౌం దర్య ఉత్పత్తుల పార్సిళ్లలో వాటితోపాటు డ్రగ్స్‌ పెట్టి సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌ గుట్టు బయటపడింది. మల్నాడు రెస్టారెంట్‌ కేసులో ఢిల్లీ నుంచి వచ్చిన పార్సిల్‌ను స్వాధీనం చేసుకున్న ఈగిల్‌ అధికారులు.. అందులోని చెప్పుల్లో డ్రగ్స్‌ను గుర్తించారు. ఆ పార్సిల్‌ను ఢిల్లీ నుంచి పంపిన నైజీరియన్‌ను గుర్తించి, నాలుగు నెలల క్రితం ఆపరేషన్‌ ప్రారంభించారు. సుమారు 15 రోజులు పూర్తిగా ఢిల్లీలోనే మకాం వేశారు. డ్రగ్స్‌ ముఠా అడ్డాల్లో మఫ్టీలో తిరుగుతూ వివరాలన్నీ సేకరించారు. గురువారం అక్కడి పోలీసులతో కలసి సంయుక్త ఆపరేషన్‌ చేపట్టి.. భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. శుక్రవారం న్యూఢిల్లీ పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ఈగిల్‌ బృందం ఎస్పీ సీతారాం, ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ జాయింట్‌ కమిషనర్‌ సురేంద్రకుమార్‌ ఈ ఆపరేషన్‌ వివరాలను వెల్లడించారు. ఢిల్లీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ‘ఆపరేషన్‌ ఈగిల్‌ ఫోర్స్‌’ చేపట్టినట్టు తెలిపారు. మెహ్రౌలీ, సంత్‌ఘర్‌, నిలోథి, ప్రతాప్‌ ఎన్‌క్లేవ్‌, గ్రేటర్‌ నోయిడా, మునిర్కా తదితర 18 ప్రాంతాల్లో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో తెలంగాణ నుంచి 180 మంది పోలీసులు పాల్గొన్నారని చెప్పారు. గ్రేటర్‌ నోయిడాలో డ్రగ్స్‌ ముఠా ఆర్థిక వ్యవహారాలు చూసే కీలక వ్యక్తి బద్రుద్దీన్‌ను అరెస్టు చేశామని, ఆయన భార్య కూడా ఈ దందాలో పాలుపంచుకుంటున్నట్టు గుర్తించామని తెలిపారు. తెలంగాణ పోలీసులు ఏడుగురిని, ఢిల్లీ పోలీసులు ముగ్గురిని కలిపి మొత్తం కలిపి 10 మంది కీలక సూత్రధారులను, మరో 30 మంది నైజీరియన్లను అరెస్టు చేశామని తెలిపారు. కాగా, డ్రగ్స్‌ను అరికట్టడంలో తెలంగాణ ఈగిల్‌ బృందం కృషిని సురేంద్రకుమార్‌ అభినందించారు.


హైదరాబాద్‌లో 11 మందికి డ్రగ్స్‌

కాగా, ఆపరేషన్‌ ఈగిల్‌ ఫోర్స్‌లో 5,340 ఎక్స్‌స్టసీ పిల్స్‌, 250 గ్రాముల కొకైన్‌, 109 గ్రాముల హెరాయిన్‌, 250 గ్రాముల మెథామ్‌ఫిటమిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఈగిల్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. ఈ డ్రగ్స్‌ విలువ రూ.3.5 కోట్లు ఉంటుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2 వేల మందికిపైగా వినియోగదారులు, పెడ్లర్లకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. 16 కార్టెల్స్‌ ద్వారా ఈ మత్తుమందుల రవాణా జరిగిందని.. డబ్బు స్వీకరించేందుకు 59 మ్యూల్‌ ఖాతాలను వినియోగించారని, మొత్తం 107 బ్యాంకు ఖాతాల్లో డ్రగ్స్‌ కొనుగోళ్లకు సంబంధించిన డబ్బు జమైందని వివరించారు. మత్తుమందులు కావాల్సినవారు నైజీరియన్లు సూచించిన బ్యాంకు ఖాతాలకు డబ్బు పంపించి.. ఆ స్ర్కీన్‌షాట్‌ను వాట్సా్‌పలో పంపాక, ఢిల్లీ నుంచి కొరియర్‌ కంపెనీల ద్వారా పార్సిళ్లలో డ్రగ్స్‌ పంపుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన 11 మంది డ్రగ్స్‌ వినియోగదారులు ఉన్నట్టు ఇప్పటివరకు గుర్తించామని తెలిపారు.

Updated Date - Nov 29 , 2025 | 03:42 AM