Duddilla Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:20 AM
రాష్ట్ర పరిశ్రమల, సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ-2025’ జాబితాలో శ్రీధర్‌బాబుకు చోటు లభించింది.
ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ-2025 జాబితాలో చోటు
హైదరాబాద్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పరిశ్రమల, సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ-2025’ జాబితాలో శ్రీధర్‌బాబుకు చోటు లభించింది. తమ నాయకత్వంతో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ భారత్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తోన్న వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించామని ఆ సంస్థ బుధవారం ప్రకటించింది. ఇందులో విధాన రూపకర్తల విభాగంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కేంద్రమంత్రులు అశ్వినివైష్ణవ్, పీయూష్ గోయల్ తదితర ప్రముఖులకు చోటు కల్పించినట్టు తెలిపింది.
దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్‌చేంజ్‌ను ప్రారంభించడంతోపాటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో కీలకంగా వ్యవహరించినందుకు శ్రీధర్‌బాబును ఈ జాబితాలోకి ఎంపిక చేశామని అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ పేర్కొంది. అంతేకాక, తెలంగాణలో ఏర్పాటు కానున్న ఏఐ విశ్వవిద్యాలయం అంశంలో శ్రీధర్‌బాబు పాత్రను కూడా కొనియాడింది. కాగా, అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ జాబితాలో తనకు చోటు దక్కడంపై మంత్రి శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సా హం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు.