kumaram bheem asifabad-జిల్లాలో మాదకద్రవ్యాలను అరికట్టాలి
ABN , Publish Date - Oct 29 , 2025 | 10:54 PM
జిల్లాలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి జిల్లాలో మాదకద్రవ్యాల నివారణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి జిల్లాలో మాదకద్రవ్యాల నివారణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుమరం భీం జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా, విక్రయించినా వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధిని నిలిపివేస్తామని అన్నారు. గంజాయికి అలవాటు పడిన వారిని గుర్తించి పునరావాస కేంద్రానికి తరలించాలని సూచించారు. పత్తి కొనుగోలులో ప్రభుత్వం చేపట్టిన కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకు వివరించే సమయంలో గంజాయి సాగు వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. వాహనదారులు, డ్రైవర్లు గంజాయి రవాణా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాలయాలు ఉన్న ప్రాంతాలలో పాన్ టేలాలు ఉండకుండా పర్యవేక్షించాలని తెలిపారు. వసతి గృహాలు, కళాశాలల వద్ద ప్రత్యేకంగా నిఘా నిర్వహించాలని సూచించారు. టోల్ ప్లాజాల వద్ద తనిఖీలు చేపట్టాలని, బస్టాండు ప్రాంతాలలో అనుమానస్పదన వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. గ్రామాలలో, విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకు 69 కేసులు నమోదు చేసి 120 మందిని జైలుకు పంపించామని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వాహిదుద్దీన్, జిల్లా రవాణా శాఖ అధికారి రాంచందర్, జిల్లా వైద్యాధికారి సీతారాం, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, డీఐఈవో రాందాస్, డిపో మేనేజర్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర సమాచారం అందించాలి
ఆసిఫాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అమృత్ 2.0 పథకం కింద ఎంపికైన కాగజ్‌నగర్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ తయారీకి సంబంధిత శాఖాధికారులు సమగ్ర సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో కాగజ్‌నగర్ సబ్ కలెక్టర శ్రద్ధశుక్లా, వరంగల్ ప్రాంతీయ ఉప సంచాకులు ప్లానింగ్ మహిపాల్‌లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో మాస్టర్ ప్రాణాళిక రూపొందించడంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాగజ్‌నగర్ మున్సిపాలిటీని అమృత్ 2.0 పథకం కింద ఎంపిక చేసినందున సమగ్ర అభివృద్ధికి సంబంధిత అధికారులు పూర్తి సమాచారాన్ని మున్సిపాలిటీకి అందించాలని తెలిపారు. గత పది సంవత్సరాల క్రితం నుంచి గల వివరాలను ఇంకో 50 సంవత్సరాల ముందు వరకు అవసరమైన రహదారులు, తాగునీరు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, చెరువుల అభివృద్ధి, బీపీఎల్ కుటుంబాలు, మురికి ప్రాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వంటి అన్ని అంశాలపై సమగ్ర వివరాలు అందించాలని తెలిపారు. తద్వారా మున్సిపాలిటీ అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రసుతత స్థితిని అర్థం చేసుకోవడానికి భవిష్యత్ అవసరాలు అంచనా వేయడానికి ప్రాదేశిక వివరాలను సేకరించాలని చెప్పారు. డిజిటల్ మ్యాపింగ్‌లో భూ వినియోగ మ్యాప్‌లు రూపొందించవచ్చని, నూతన డేటాను ప్రతిబింబించేలా జీఐఎస్ ఆధారిత ప్రణాళికలను నవీకరించవచ్చని, తద్వారా అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. తరగదుల వారీగా జనాభా ప్రాతిపదికన ప్రజల అవసాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాస్ రూపొందించాలని, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా రూపకల్పన చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ రాజేందర్, పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.