Narcotics Control Bureau: డ్రగ్స్ తయారీ గుట్టురట్టు
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:15 AM
అత్యవసర మందుల తయారీ మాటున చర్లపల్లి పారిశ్రామిక వాడలో ప్రమాదకరమైన మెఫెడ్రోన్(మ్యావ్‌మ్యావ్-ఎండీఎంఏ) మత్తుమందును తయారు చేస్తున్న ఫ్యాక్టరీ గుట్టును మహారాష్ట్ర పోలీసులు...
చర్లపల్లిలో 5.79 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం
నార్కోటిక్స్ బ్యూరో, మహారాష్ట్ర పోలీసుల ఆపరేషన్
బంగ్లాదేశీయురాలు సహా 12 మంది అరెస్టు
హైదరాబాద్, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): అత్యవసర మందుల తయారీ మాటున చర్లపల్లి పారిశ్రామిక వాడలో ప్రమాదకరమైన మెఫెడ్రోన్(మ్యావ్‌మ్యావ్-ఎండీఎంఏ) మత్తుమందును తయారు చేస్తున్న ఫ్యాక్టరీ గుట్టును మహారాష్ట్ర పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు రట్టుచేశారు. భారీఎత్తున మెఫెడ్రోన్ మత్తుమందును స్వాధీనం చేసుకుని.. వేర్వేరు ప్రాంతాల్లో ఒక బంగ్లాదేశీ యువతి సహా.. 12 మందిని అరెస్టు చేశారు. ఈ వివరాలను మహారాష్ట్రలోని మీరా భయాండర్-వాసాయ్ విహార్(ఎంబీవీవీ) పోలీసులు ఓ ప్రకటన ద్వారా విడుదల చేశారు. కాశీమీరా ఏరియాలో గత నెల 8న అనుమానాస్పదంగా కనిపించిన 23 ఏళ్ల యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద 105 గ్రాముల మెఫెడ్రోన్(విలువ రూ.23.97 లక్షలు) లభించింది. ఆమెను బంగ్లాదేశ్‌కు చెందిన ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లాగా గుర్తించారు. రెహ్మాన్ షేక్ ఆమెకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించి, అతణ్ని అరెస్టు చేశారు. రెహ్మాన్ షేక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మెఫెడ్రోన్ దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. దీంతో మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. మత్తుమందు క్రయవిక్రయాలతో సంబంధమున్న గ్యాంగులోకి తమ మనుషులను ప్రవేశపెట్టారు. రెహ్మాన్ షేక్‌తో కలిసి.. ఆ గ్యాంగు ద్వారా.. మహారాష్ట్రలోని 60 చోట్ల దాడులు చేసి, మత్తుమందుల రవాణాలో సంబంధం ఉన్న జావీద్, మహమ్మద్ ఫహీమ్, ఫిరోజ్, ముస్తఫా యూనస్ ఖాన్, ఇమ్రాన్, సలీంలను అరెస్టు చేసి, 178 గ్రాముల మెఫెడ్రోన్(విలువ రూ.23.97 లక్షలు) సీజ్ చేశారు. ఇదే ముఠాపై జరిపిన దాడిలో మరోచోట రూ.23.97 లక్షలు విలువ చేసే 178 గ్రాముల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చర్లపల్లి ప్రాంతంలో రెక్కీ నిర్వహించి, శుక్రవారం భారీ ఆపరేషన్ చేపట్టారు. స్థానిక నవోదయకాలనిలో ఉన్న వాగ్దేవి లాబ్స్‌పై దాడి, చేసి కంపెనీ యజమాని, ఐటీ నిపుణుడు శ్రీనివాస్ విజయ్ ఒలేటీతోపాటు తానాజీ పండరీనాఽథ్ పట్వారీని అరెస్టు చేశారు. వాగ్దేవి ల్యాబ్స్‌లో అత్యంత ఆధునిక యంత్ర పరికరాలను గుర్తించారు. చర్లపల్లిలో స్వాధీనం చేసుకున్న ముడిసరుకుతో సుమారు 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను తయారు చేయవచ్చని ఎన్డీటీవీ పేర్కొంది.