Drug Manufacturing Busted: రోజు కూలీగా వెళ్లి.. గుట్టురట్టు చేసి..
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:21 AM
చర్లపల్లి పారిశ్రామిక వాడలో వాగ్దేవీ ల్యాబ్ పేరిట మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై దాడులు చేసిన మహారాష్ట్ర...
చర్లపల్లి డ్రగ్స్ కేసులో కానిస్టేబుల్ డెకాయ్ ఆపరేషన్
నెల రోజులు కష్టపడ్డ మహారాష్ట్ర పోలీసులు
డ్రగ్స్ తయారీపై నిర్ధారణ జరిగాకే దాడులు
మెఫిడ్రిన్ తయారీలో శ్రీనివాస్ జాగ్రత్తలెన్నో!
రవాణా లింకుపై ముంబై పోలీసుల ఆరా
అరెస్టయిన తానాజీ ఓ కెమికల్ ఎక్స్‌పర్ట్
వెల్లడించిన వాసాయ్ విరార్ పోలీసులు
హైదరాబాద్/సిటీ/కుషాయిగూడ/రాంనగర్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లి పారిశ్రామిక వాడలో వాగ్దేవీ ల్యాబ్ పేరిట మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై దాడులు చేసిన మహారాష్ట్ర పోలీసులు.. మాదకద్రవ్యాల దందా గుట్టు రట్టు చేయడానికి నెల రోజులపాటు శ్రమించారు. డెకాయ్ ఆపరేషన్‌లో భాగంగా ఓ కానిస్టేబుల్‌ను ఆ కంపెనీలో కూలీగా పంపి.. డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు పక్కాగా నిర్ధారణ అయ్యాకే, దాడులు జరిపి.. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటీ, అతని వద్ద కెమికల్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న తానాజీ పండరీనాథ్ పట్వారీని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ వివరాలను మహారాష్ట్ర వాసాయ్ విరార్ పోలీసు కమిషనర్ నికేత్ కౌశిక్ స్థానిక మీడియాకు వెల్లడించారు. ఈ నెట్‌వర్క్ అత్యంత క్లిష్టంగా ఉందని, దాంతో ఒక్కో దశ సరఫరాదారులను దాటుకుంటూ.. చర్లపల్లికి చేరామని తెలిపారు.
బంగ్లాదేశీ అరెస్టు నుంచి..
గత నెల 8న వాసాయ్ విరార్ పోలీసులు అనుమానాస్పదనంగా తిరుగుతున్న ఫాతిమా మురాద్ షేక్ అనే 23 ఏళ్ల యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద రూ.23.97 లక్షలు విలువ చేసే 105 గ్రాముల మెఫిడ్రిన్ లభించడం.. ఆ యువతి బంగ్లాదేశ్ పౌరురాలని నిర్ధారణ కావడంతో కేసును సీరియ్‌సగా తీసుకున్నారు. డ్రగ్స్ మూలాలను గుర్తించేందుకు ఒక్కో దశను దాటుకుని వెళ్లారు. దర్యాప్తునకు శాంతిభద్రతల ఏసీపీ దత్తాత్రేయ శిందే, క్రైమ్ బ్రాంచ్(డివిజన్-4) ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ నేతృత్వం వహించారు. తమ బృందాలను రంగంలోకి దింపారు. ‘‘ఈ నెట్‌వర్క్‌లో దశల వారీగా డ్రగ్స్ సరఫరా అయ్యేది. ఒకటో దశలో ఉండే వ్యక్తులు ఎవరో.. మూడో దశలో ఉండేవారికి తెలియకుండా ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫాతిమా ద్వారా రెహ్మాన్ షేక్‌ను అరెస్టు చేశాం. ఆ తర్వాత వేర్వేరు దశల్లో మరో 8 మందిని అరెస్టు చేసి, 178 గ్రాముల మెఫిడ్రిన్(విలువ రూ.23.97 లక్షలు)ను సీజ్ చేశాం. ఆ తర్వాత చర్లపల్లిలోని కంపెనీ గుట్టు తెలిసింది’’ అని సీపీ వెల్లడించారు..

నెట్‌వర్క్ ఛేదన దిశగా..
మెఫిడ్రిన్ తయారీకి శ్రీనివాస్ విజయ్ గురుగ్రామ్‌లోని కిమియా బయోసైన్స్ అనే కంపెనీ నుంచి ముడిపదార్థాలు తెప్పించినట్లు మహారాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. ముడిపదార్థాలను అసలు పేర్లను కాకుండా.. ఇతర లేబుళ్లను అంటించి, హైదరాబాద్‌కు తరలించేవారు. ‘‘ఈ నెట్‌వర్క్‌లో ఫాతిమా లాంటి వారు ఎంద రో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నాం. డ్రగ్స్ వినియోగదారుల వివరాలను గుర్తించే పనిలో ఉన్నాం. మరిన్ని వివరాల కోసం శ్రీనివాస్ విజయ్‌ని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంటాం’’ అని వాసాయ్ విరార్ పోలీసులు వివరించారు. మార్కెట్లో కిలో మెఫిడ్రిన్ విలువ రూ.1.25 కోట్లుగా ఉండగా.. శ్రీనివాస్ విజయ్ మాత్రం తన నెట్‌వర్క్‌కు రూ.50 లక్షలకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. మొదట్లో ఇతను హైదరాబాద్‌లో టెకీలకు మాత్రమే మెఫిడ్రిన్ అందజేసేవాడని.. క్రమం గా ఇతర రాష్ట్రాలకు సరఫరాను ప్రారంభించాడని తెలిపారు. గతంలోనూ హైదరాబాద్ టెకీలు మెఫిడ్రిన్‌తో పట్టుబడ్డ విషయం తెలిసిందే..! నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) గణాంకాల ప్రకారం.. గత ఏడాది తెలంగాణలో 107 కిలోల మెఫిడ్రిన్ పట్టుబడింది. అటు హైదరాబాద్ పోలీసులు కూడా శ్రీనివాస్ విజయ్ నెట్‌వర్క్‌పై దృష్టి సారించారు. ఇతను ముంబై, గోవా, బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. రాచకొండ పోలీసులు సైతం తాజా ఘటనతో అప్రమత్తమయ్యారు. చర్లపల్లితోపాటు.. నాచారం, మల్లాపూర్ పారిశ్రామిక వాడల్లో ఉన్న కంపెనీలు ఏయే ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి? ఖాళీగా ఉన్న కంపెనీల వివరాలతో ఓ చిట్టాను తయారు చేస్తున్నారు.
శ్రీనివాస్ విజయ్ మోసాల చిట్టా..
శ్రీనివాస్ విజయ్ అరెస్టుతో.. రాంనగర్ పరిసరాల్లో ఆయన చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అతనిది మోసంచేసే తత్వమని, నమ్మిన వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేవాడని స్థానికులు చెబుతున్నారు. శ్రీనివాస్ విజయ్ తొలుత రాంనగర్ గుండు వద్ద కొసైన్ సాఫ్ట్‌వేర్ సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత గేమింగ్, సాఫ్ట్‌వేర్ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేశారు. వాటిల్లో నష్టాలు రావడంతో.. ఓలేటి సూపర్ మార్కెట్, డెయిరీ ఫామ్‌లను ప్రారంభించారు. అవి కూడా లాభదాయకం కాకపోవడంతో.. వాగ్దేవి ల్యాబ్స్ ను ప్రారంభించి, డ్రగ్స్ తయారీని మొదలు పెట్టారు. సాఫ్ట్‌వేర్ సంస్థ ఏర్పాటుకు ఇంటిని అద్దెకిచ్చిన యజమానికి డబ్బులు చెల్లించలేదని, ఇప్పటికీ ఆ ఇల్లు శ్రీనివాస్ విజయ్ ఆధీనంలోనే ఉందని సమాచారం. ఓలేటి సూపర్ మార్కెట్‌కు అద్దెకు ఇచ్చిన యజమాని కోర్టును ఆశ్రయించి, అతణ్ని ఖాళీ చేయించారు. కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అద్దెకు తీసుకున్న ఓ ఇంటిని ఖాళీ చేయడానికి.. యజమాని వద్ద భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. అతనుండే అపార్ట్‌మెంట్ కార్ పార్కింగ్ విషయంలోనూ గొడవలు జరగ్గా.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రాబ్యాంక్ (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్) రాంనగర్ బ్రాంచ్ నుంచి ఘట్‌కేసర్‌లో ఇంటి కొనుగోలుకు రుణం, నాచారం బ్రాంచ్ నుంచి రూ.50 లక్షల రుణం తీసుకుని, సరిగ్గా చెల్లించలేదని తెలుస్తోంది. కాగా.. శ్రీనివాస్ విజయ్ భార్య శిరీష, తల్లి రాధ, సమీప బంధుమిత్రులు ఆదివారం రహస్యంగా భేటీఅయినట్లు తెలిసింది. శ్రీనివాస్ విజయ్‌కి అప్పులున్న విషయం అందరికీ తెలుసని, అలాంటప్పుడు డ్రగ్స్ తయారీకి రూ.లక్షలు విలువ చేసే ముడిపదార్థాలను ఎలా కొం టాడని ప్రశ్నించినట్లు సమాచారం. ముంబైకి చెందిన ఓ వ్యక్తికి శ్రీనివాస్ విజయ్ బాకీ ఉన్నారని, అతను కక్షగట్టి డ్రగ్స్ కేసులో ఇరికించారని ఆరోపించారు.
డెకాయ్ ఆపరేషన్ ఇలా..
చర్లపల్లిలో శ్రీనివాస్ విజయ్ నిర్వహించే మత్తుపదార్థాల తయారీ కంపెనీ(బోర్డు ఉండదు) ని గుర్తించిన మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్.. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీల రూపంలో తమ సిబ్బందితో రెండ్రోజులు అక్కడ రెక్కీ వేయించింది. ఈ క్రమంలో.. రోజు కూలీలతో ఆ కంపెనీలో పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు. ఏరోజుకారోజు కూలీ లు మారుతుంటారు. పనికి వచ్చిన కంపెనీలో ఏం తయారవుతోందో తెలియదు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు శ్రీనివాస్ విజయ్ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కంపెనీలో పనులు చేయించేందుకు కూలీలను ఎక్కడి నుంచి తరలిస్తున్నారో గుర్తించిన మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్.. ఈనెల 5న తమ కానిస్టేబుల్‌ని ఆ గుం పులో చేర్చి, డెకాయ్ ఆపరేషన్‌ను నిర్వహించింది. అక్కడ డ్రగ్స్ తయారీ జరుగుతోందని నిర్ధారించుకున్న తర్వాత.. వాసాయ్ విరార్ శాంతిభద్రతలు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మూకుమ్మడి దాడులు చేశారు. శ్రీనివాస్ విజయ్ ఓలేటి, అతని కెమిస్ట్ తానాజీ పండరీనాథ్ పట్వారీని అరెస్టు చేశారు.
సీజ్ చేసిన డ్రగ్స్ రసాయనాల తరలింపు
చర్లపల్లి కంపెనీలో మెఫిడ్రిన్ తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలు, రసాయనాల డ్రమ్ములను మహారాష్ట్ర పోలీసులు ఆదివారం తరలించారు. సుమారు 20 డ్రమ్ములను కర్ణాటక రిజిస్ట్రేషన్ ట్రక్కు (కేఏ39ఏ-3155)లో తీసుకెళ్లారు. ఆ కంపెనీ వద్ద స్థానిక పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు