Drug Busts: పబ్‌లో డ్రగ్స్ గబ్బు
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:27 AM
న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో తనిఖీలు
8 మందికి పాజిటివ్.. కేసు నమోదు
మరో ఘటనలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు.. చరస్, ఎండీఎంఏ సీజ్
రాయదుర్గం, అమీర్‌పేట, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ పబ్‌పై దాడి చేసి మాదకద్రవ్యాల మత్తులో ఉన్న ఎనిమిది మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. మరో ఘటనలో మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో ఉన్న క్వేక్ ఎరీనా పబ్‌లో శనివారం అర్ధరాత్రి తర్వాత ఈగల్ టీం ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఇక్కడ 14 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు. మరో ఘటనలో బల్కంపేట స్మశానవాటిక వద్ద మాదక ద్రవ్యాల విక్రయానికి పాల్పడుతున్న ముగ్గురిని ఎస్సార్ నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 95 గ్రామలు చరస్, 1.5 గ్రామలు ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో బాలానగర్‌కు చెందిన కుముదుకుమార్ శ్రీవాస్తవ(27), జడ్చర్లకు చెందిన కేతావత్ అరవింద్ కుమార్(21), ఏపీలోని గుంటూరుకు చెందిన షేక్ సల్మాన్ హరీష్ అలియాస్ సల్మాన్(25) ఉన్నారు. యూకేకు చెందిన శశాంక్ కొరియర్ ద్వారా సుజిత్ రావు అనే వ్యక్తికి డ్రగ్స్ పంపేవాడని, వాటిని షేక్ సల్మాన్.. శ్రీవాస్తవ ద్వారా విక్రయిస్తుంటాడని విచారణలో తేలింది. అరవింద్ కుమార్ మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసేందుకు వచ్చి పోలీసులకు చిక్కాడు. శశాంక్, సుజిత్‌లపై కూడా పోలీసులు కేసు పెట్టారు. కాగా, ఈగల్ టీం గత పది రోజుల్లో డ్రగ్స్ కేసుల్లో 27మందిని అరెస్టు చేసింది. వారిలో ఐదుగురు విదేశీ మహిళలు ఉన్నారు. ఆయా కేసుల్లో కలిపి 68గ్రాముల కొకైన్, 50.5గ్రాముల ఎండీఎంఏ, 382కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.