Share News

Drug and injection abuse: మత్తులో జీవితాలు చిత్తు

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:28 AM

హైదరాబాద్‌ నగరంలో మాదక ద్రవ్యాల ఓవర్‌ డోస్‌ మరణాలు పెరుగుతున్నాయి. డ్రగ్స్‌ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా..

Drug and injection abuse: మత్తులో జీవితాలు చిత్తు

  • డ్రగ్స్‌, మత్తు ఇంజక్షన్లకు బానిసలవుతున్న యువత.. హైదరాబాద్‌లో ఇటీవల పెరిగిన ఓవర్‌ డోస్‌ మరణాలు

  • పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేస్తున్నా.. ఆగని మత్తు దందా

  • డ్రగ్స్‌పై కలిసికట్టుగా పోరాడుదాం: వి.సి. సజ్జనార్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలో మాదక ద్రవ్యాల ఓవర్‌ డోస్‌ మరణాలు పెరుగుతున్నాయి. డ్రగ్స్‌ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక రూపంలో చాపకింద నీరులా అవి సరఫరా అవుతూనే ఉన్నాయి. వాటిని వాడుతున్నవారు.. ఓవర్‌ డోస్‌తో మర ణిస్తున్నవారిలో యువత.. అందునా విద్యార్థులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. డ్రగ్స్‌కు బానిసైకొందరు యువకులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు.. చివరకు వాటిని సరఫరా చేసే పెడ్లర్లుగా మారుతున్నారు. మంచి ఆదాయం వస్తుండటంతో దాన్నే దందాగా మార్చుకొని ఘరానా స్మగ్లర్‌గా మారుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు జైలుకెళ్లినా పద్ధతి మార్చుకోకుండా అక్కడ కొత్త స్మగ్లర్స్‌తో పరిచయాలు పెంచుకుంటున్నారు.

ఇష్టానుసారంగా మత్తు ఇంజక్షన్‌లు..

నగరంలో ఇష్టానుసారంగా మత్తు ఇంజక్షన్‌లు విక్రయిస్తున్నారు. వైద్యుల ప్రిస్ర్కిప్షిన్‌ లేకుండా అక్రమంగా మెఫెంటర్మైన్‌ సల్ఫేట్‌ మత్తు ఇంజక్షన్‌లు వినియోగిస్తున్న నలుగురిని ఇటీవల హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌న్యూ) పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.28 లక్షల విలువైన 74 బాటిళ్ల మెఫెంటర్మైన్‌ ఇంజక్షన్‌లు, 4 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌, లా అండ్‌ ఆర్డర్‌, ఎస్‌వోటీ పోలీసులు సైతం మత్తు ఇంజక్షన్‌లు విక్రయిస్తున్న ముఠాలను పట్టుకుంటున్నా.. ఈ దందాకు పూర్తిగా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దాంతో ఆ మత్తుకు అలవాటుపడిన కొందరు ఓవర్‌ డోస్‌తో మరణిస్తున్నారు.


ఇటీవల వెలుగుచూసిన కొన్ని ఓవర్‌ డోస్‌ ఘటనలు

  • బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ ఇంటర్‌ విద్యార్థి మత్తు ఇంజక్షన్‌ తీసుకొని ఓవర్‌ డోస్‌తో మృతి చెందాడు. ముగ్గరు స్నేహితులు నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి మత్తు ఇంజక్షన్‌లు తీసుకున్నారు. ఒక విద్యార్థి మత్తు ఎక్కలేదని ఎక్కవ డోస్‌ తీసుకున్నాడు. కొద్దిసేపటికే ముగ్గురూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా ఓవర్‌ డోస్‌ తీసుకున్న విద్యార్థి మృతిచెందాడు. మిగతా ఇద్దరు చాలా రోజుల చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డారు.

  • రాజేంద్రగనగర్‌ పరిధిలోని శివరాంపల్లిలో మహ్మద్‌ అహ్మద్‌ అనే యువకుడు గత నెలలో డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌తో మృతి చెందినట్లు పోలీసులు తేల్చారు.

  • చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు ఆటోలో అనుమాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో వారు మత్తు ఇంజక్షన్‌లకు బానిసలై ఓవర్‌ డోస్‌తో మృతి చెందినట్లు పోలీసులు తేల్చారు.

  • నాలుగు రోజుల క్రితం ఛత్రినాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అంబికానగర్‌కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మత్తు ఇంజక్షన్‌లకు బానిసై ఓవర్‌ డోస్‌తో మృత్యువాత పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం పక్కనే ఇంజక్షన్‌ నీడిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • ఒక టాలీవుడ్‌ యువ నిర్మాత ఇటీవల దుబాయ్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌తోనే అతడు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.


1.jpg

పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలి

డ్రగ్స్‌ వాడకం స్కూలు పిల్లల స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. గంజాయి చాక్లెట్స్‌ రూపంలో పిల్లలను ఆ మహమ్మారి ఆవహిస్తోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆరా తీయాలి. ప్రారంభంలోనే గుర్తించి పిల్లలను మార్చే ప్రయత్నం చేయాలి. లేదంటే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ నగరంగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని డ్రగ్స్‌ నిర్మూలనకు పోరాడాలి.

- వి.సి. సజ్జనార్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌.

Updated Date - Dec 18 , 2025 | 03:28 AM