Share News

Be Alert:: బీ అలర్ట్‌.. జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయండి

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:04 AM

చలికాలంలో దట్టమైన పొగ మంచు కురుస్తున్నందున వాహనాలను జాగ్రత్తగా నడపాలని వాహన దారులకు పోలీసు శాఖ హితవు పలికింది...

Be Alert:: బీ అలర్ట్‌.. జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయండి

  • చలికాలంలో రోడ్లపై దట్టమైన పొగ మంచుతో ప్రమాదం సుమా

  • వాహనదారులకు పోలీసుల సూచనలు

హైదరాబాద్‌, నవంబరు23 (ఆంధ్రజ్యోతి): చలికాలంలో దట్టమైన పొగ మంచు కురుస్తున్నందున వాహనాలను జాగ్రత్తగా నడపాలని వాహన దారులకు పోలీసు శాఖ హితవు పలికింది. పొగ మంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో రహదారి భద్రతను పెంపొందించేందుకు అరైవ్‌-అలైవ్‌ పథకం చేపట్టింది. పొగ మంచుతో రోడ్డుపై ఎదురుగా వస్తున్న వాహనాలు, జంతువులు, సిగ్నల్స్‌ కన్పించవని, ముందు ఉన్న వాహనం, ఆగి ఉన్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనా వేయడం కష్టమని పోలీసుశాఖ పేర్కొంది. చలికాలంలో నిర్ణీత సమయానికి ముందుగానే బయలు దేరాలని, తొందరపాటు లేకుంటే డ్రైవింగ్‌పై ఏకాగ్రత పెరుగుతుందని వివరించింది. అతి వేగం, ఓవర్‌ టేకింగ్‌కు దూరంగా ఉండాలన్న పోలీసుశాఖ.. హైబీమ్‌ లైట్లతో కాంతి విచ్చిన్నమై ఎదురుగా చూడటం కష్టమవుతుందని తెలిపింది. కనుక లో బీమ్‌ లైట్లతోపాటు ఫాగ్‌ లైట్లనూ తప్పక వాడాలని సూచించింది. వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించడంతోపాటు నిర్దేశిత వరుసల్లోనే వాటిని నడపాలని తెలిపింది. కిటికి అద్దాలు కొద్దిగా కిందకు దించాలని, ఎక్కువ పొగ మంచు కురుస్తుంటే.. సురక్షిత ప్రదేశంలో కొద్దిసేపు వాహనాన్ని నిలిపేయాలని కోరిన పోలీసుశాఖ.. సడన్‌ బ్రేక్‌ నివారించి, తప్పనిసరిగా ఇండికేటర్లను వాడుకోవాలని సూచించింది.

Updated Date - Nov 24 , 2025 | 04:04 AM