Share News

Telangana Panchayat Elections: పంచాయతీ సిత్రాలెన్నో!

ABN , Publish Date - Dec 12 , 2025 | 04:48 AM

రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో సిత్రాలు కనిపించాయి. తల్లిపై బిడ్డ, అన్నపై చెల్లెలు గెలుపు.. ఒకటీ రెండు ఓట్లతో....

Telangana Panchayat Elections: పంచాయతీ సిత్రాలెన్నో!

  • సొంతవారిపైనే పోటీచేసి గెలిచిన కుటుంబసభ్యులు

  • ఒక్క ఓటుతోనే విజయాలు.. టాస్‌తో వరించిన గెలుపు.. రీకౌంటింగ్‌తో తారుమారైన ఫలితాలు

  • బ్యాలెట్‌ పేపర్లు చింపి, నమిలి మింగేయడాలు.. ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో ప్రతిపక్షాల విజయం!

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో సిత్రాలు కనిపించాయి. తల్లిపై బిడ్డ, అన్నపై చెల్లెలు గెలుపు.. ఒకటీ రెండు ఓట్లతో గెలిచిన అభ్యర్థులు, రీకౌంటింగ్‌తో తారుమారైన ఫలితాలు, లక్కీడ్రాతో వరించిన విజయాలు, బ్యాలెట్‌ పేపర్లు చించేయడం, నమిలి మింగేయడం వంటి ఆసక్తికర ఘటనలెన్నో చోటు చేసుకున్నాయి. పోలింగ్‌, కౌంటింగ్‌ సందర్భంగా పలుచోట్ల వివిధ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు, దాడులు, పోలీసుల లాఠీచార్జి వంటివి జరిగాయి. ఈ విశేషాలపై విహంగ వీక్షణం..

  • రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ స్వగ్రామం వీర్లపల్లిలో కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి శేఖర్‌గౌడ్‌పై బీఆర్‌ఎస్‌ మద్దతున్న చిందం పాండు 130 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

  • జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి కాటేపాగ శ్రీలత 31 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

  • ఖమ్మం జిల్లా బంజర గ్రామంలో 106 ఏళ్ల వయసున్న బానోతు పింప్లి స్వయంగా మూడు చక్రాల సైకిల్‌పై వచ్చి ఓటేశారు.

  • యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపూర్‌కు చెందిన కొండ సందీప్‌ (23) పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి.. రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని మృతిచెందారు.

  • జగిత్యాల జిల్లా సంగెం గ్రామానికి చెందిన చీటి స్వరూప సర్పంచ్‌ పదవికి పోటీ చేశారు. ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమె కుమారుడు అమరేందర్‌రావు తల్లి కోసం స్వగ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2.jpg


బ్యాలెట్‌ పేపర్‌ నమిలి మింగి.. చించి పడేసి..

  • జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌లో వెంకట్‌ అనే ఓటరు మద్యం మత్తులో బ్యాలెట్‌ పేపర్లను నమిలేశారు. వార్డు మెంబర్‌కు సంబంధించిన బ్యాలెట్‌ను మింగేయగా, సర్పంచ్‌ బ్యాలెట్‌ను మాత్రం పక్కనే ఉమ్మేశారు. అధికారులు వెంకట్‌ను పోలీసులకు అప్పగించారు.

  • రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్‌ తండాలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటేయడానికి వచ్చిన సత్యనారాయణ.. పొరపాటున వేరేవారికి ఓటేశానంటూ బ్యాలెట్‌ను చింపేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

‘కొసమెరుపు’ గెలుపులు..

  • రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల సర్పంచ్‌ పదవికోసం కాంగ్రె్‌సకు చెందిన నేతలు మరాటి రాజ్‌కుమార్‌, గోపు రాము పోటీపడ్డారు. ఇద్దరికీ 212 ఓట్ల చొప్పున పోలయ్యాయి. దీనితో రిటర్నింగ్‌ అధికారి టాస్‌ వేయగా.. మరాటి రాజ్‌కుమార్‌ను విజయం వరించింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం దాబా(బి)లో టాస్‌ ద్వారా నర్వాటె ఈశ్వర్‌ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

  • యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం లక్ష్మక్కపల్లిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు లక్కీడ్రా నిర్వహించగా.. బీఆర్‌ఎస్‌ మద్దతుదారు ఇండ్ల రాజయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

  • నిజామాబాద్‌ జిల్లా కల్దుర్కిలో న్యాలం శ్రీనివాస్‌.. కామారెడ్డి జిల్లా నడిమితండాలో లక్ష్మి షేర్‌సింగ్‌, సోమరిపేట తండాలో సునీత సత్యవతి.. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం జైత్రం తండాలో రాథోడ్‌ పరశురాం తదితరులు ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించారు.


‘లగచర్ల’ కారిడార్‌లో కాంగ్రె్‌సకే మద్దతు!

సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ పరిధిలోని ప్రతిపాదిత లగచర్ల పారిశ్రామిక కారిడార్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థులకే ప్రజల మద్దతు లభించింది. కొన్ని నెలల క్రితం ఇక్కడ భూసేకరణ సభలో అధికారులపై కొందరి దాడి, అనంతర పరిణామాలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దానితో ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకత ఉందనే ప్రచారం జరిగింది. కానీ తాజా పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని దుద్యాల్‌ మండలం లగచర్ల, హకీంపేట్‌, పోలేపల్లి తదితర గ్రామాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు రెండు చోట్ల గెలిచారు.

బోణీ కొట్టిన ‘జాగృతి’!

కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి పంచాయతీ ఎన్నికలతో బోణీ కొట్టింది. నిజామాబాద్‌ జిల్లాలో జాగృతి బలపర్చిన ఇద్దరు అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారు. రెంజల్‌ మండలం వీరన్నగుట్ట తండాలో పోటీచేసిన జాదవ్‌ సుమలత 5 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ మద్దతున్న అభ్యర్థి సంగీతపై విజయం సాధించారు. ఇదే మండలంలోని తాడ్‌బిలోలి సర్పంచ్‌గా జాగృతి బలపర్చిన అభ్యర్థి తెలంగాణ శంకర్‌ గెలుపొందారు.


ఒక్క పంచాయతీ.. 25 కోట్ల ఖర్చు!

  • సర్పంచ్‌ నుంచి వార్డు మెంబర్‌ దాకా పోటాపోటీ..

  • శంషాబాద్‌ మండలంలోని ఓ గ్రామంలో ధన ప్రవాహం

  • సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోనూ కోట్ల కొద్దీ ఖర్చు

గ్రేటర్‌ హైదరాబాద్‌ శివార్లలోని గ్రామాల్లో విపరీతంగా ధన ప్రవాహం జరిగింది. అందులోనూ శంషాబాద్‌ మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో మొత్తం ఖర్చు రూ.25 కోట్లు దాటేసినట్టు అంచనా. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులైన సదరు సర్పంచ్‌ అభ్యర్ధులు పోటీ పడి ఓట్లు కొనుగోలు చేశారు. ఒకరు రూ.20 వేలు ఇస్తే, మరొకరు రూ.25 వేలు ఇచ్చారు. దీనిని రూ.30 వేలకూ పెంచారు. తొలుత మూడు ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటీలో ఉన్నా.. బీఆర్‌ఎస్‌ మద్దతుదారు వైదొలగి, బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వడంతో పోటీ రసకందాయంలో పడింది. సవాలుగా తీసుకున్న మరో అభ్యర్థి.. పోలింగ్‌ ముందురోజు రాత్రి రూ.7 కోట్లు పంచారని, మొత్తం రూ.12 కోట్ల వరకు ఖర్చుపెట్టారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ పంచాయతీలో వార్డు మెంబర్‌ అభ్యర్థులు కూడా ఒక్కొక్కరు రూ.25 లక్షల వరకు ఖర్చుచేశారని, మొత్తంగా గ్రామంలో ఎన్నికల ఖర్చు రూ.25కోట్లు దాటిందని అంటున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని భానూరు, క్యాసారం, నందిగామ పంచాయతీల్లోనూ సర్పంచ్‌, వార్డు మెంబర్‌ అభ్యర్థులు కోట్లు ఖర్చుపెట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.30 వేల వరకు పంచారని.. మరికొందరు వెండి గ్లాసులు ఇస్తే, ఓ అభ్యర్థి రెండు, మూడు ఓట్లున్న ఇంటికి తులం బంగారం చొప్పున పంచారని అంటున్నారు. 8 ఓట్లున్న ఓ కుటుంబానికి మొత్తంగా రూ.12 లక్షల వరకు అందాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.


అదృష్టం.. అటూ, ఇటూ!

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్ననారాయణపురంలో కాంగ్రెస్‌ మద్దతుదారు మెరుగు అనిత, బీఆర్‌ఎస్‌ మద్దతుదారు జంగిలి అనిత ఇద్దరికీ సమానంగా 246 చొప్పున ఓట్లు వచ్చినట్టు తొలుత ఎన్నికల అధికారులు ప్రకటించారు. టాస్‌ వేసి బీఆర్‌ఎస్‌ మద్దతుదారు జంగిలి అనిత గెలిచినట్టు ప్రకటించారు. కానీ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆందోళన చేపట్టి, రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేశారు. తిరిగి ఓట్లను లెక్కించిన అధికారులు కాంగ్రెస్‌ మద్దతుదారు మెరుగు అనిత ఒక ఓటుతో గెలిచినట్టు ప్రకటించారు. దీనిని అంగీకరించని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకు దిగారు, ఎన్నికల అధికారుల వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. అయితే పోలీసులు లాఠీచార్జి చేసి, వారిని పక్కకు లాగేశారు.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బద్యా తండా సర్పంచ్‌గా కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి కోటేశ్‌ ఒక్క ఓటుతో గెలిచినట్టు ఎన్నికల సిబ్బంది ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ నేతల డిమాండ్‌ మేరకు అధికారులు రీకౌంటింగ్‌ నిర్వహించారు. కానీ ఫలితం ప్రకటించకుండా జాప్యం చేశారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనకు దిగడంతో.. చివరికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నూనావత్‌ పెంట్యానాయక్‌ ఒక్క ఓటుతో విజయం సాధించినట్టు ప్రకటించారు.

Updated Date - Dec 12 , 2025 | 04:48 AM