Share News

FutureCity to Amaravati: ఫ్యూచర్‌సిటీ టు అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం డీపీఆర్‌ కన్సల్టెన్సీ!

ABN , Publish Date - Oct 01 , 2025 | 03:15 AM

హైదరాబాద్‌లోని ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం బందరు వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్‌ప్రెస్‌ మార్గంలో కీలక ముందడుగు పడింది...

FutureCity to Amaravati: ఫ్యూచర్‌సిటీ టు అమరావతి  గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం డీపీఆర్‌ కన్సల్టెన్సీ!

  • నెలలో నియమించేలా పనులు మొదలుపెట్టిన ఎన్‌హెచ్‌ఏఐ

  • ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలో పనులు చేస్తున్న ఓ కంపెనీకే బాధ్యతలు

  • తెలంగాణ రూపొందించిన అలైన్‌మెంట్‌పై ఏపీ ప్రభుత్వం అభిప్రాయ సేకరణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం (బందరు) వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్‌ప్రెస్‌ మార్గంలో కీలక ముందడుగు పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమికంగా ఒక అలైన్‌మెంట్‌ను సిద్ధం చేయగా దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించేందుకు కన్సల్టెన్సీ నియామకం దిశగా అడుగులు పడ్డాయి. అక్టోబరు మూడో వారంలోగా డీపీఆర్‌ రూపకల్పన కోసం ఒక కంపెనీకి బాధ్యతలు అప్పగించేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం టెండర్లకు వెళ్లకుండా.. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలో పలు రోడ్ల కోసం డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్న కొన్ని కంపెనీల్లో ఒకదానికి ఈ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఫ్యూచర్‌సిటీ నుంచి మచిలీపట్నం వరకు 12 వరుసలతో రహదారిని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలో 4/6 వరుసల రహదారి నిర్మాణానికి వీలుగా అలైన్‌మెంట్‌ను రూపొందించేలా కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. 12 వరుసలుగా నిర్మించేందుకు ఎంతమేర భూమి కావాలి? ఇందులో 4/6 వరుసలకు ఎంత అవసరమవుతోంది? మొత్తం రహదారి కోసం ఎంత భూమి అవసరమవుతుంది? అన్న వివరాలను కన్సల్టెన్సీ సంస్థ తేల్చనుంది. మార్గంమధ్యలో ఎన్ని వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నాయి? అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటలు, నీటి వనరులు ఎన్ని ఉన్నాయి? అనే వివరాలను పేర్కొంటూ ఒక నివేదికను రూపొందించనున్నారు. ప్రస్తుత ప్రతిపాదిత మార్గానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వమే ప్రాధమికంగా ఒక అలైన్‌మెంట్‌ను రూపొందించింది. దీనిపై ఇంకా ఏపీ ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ క్రమంలో అలైన్‌మెంట్‌ కోసం నియమించే కన్సల్టెన్సీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అలైన్‌మెంట్‌ను ఏపీ సర్కారుకు కూడా అందించి, అభిప్రాయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఏపీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏమైనా మార్పులు సూచిస్తే మళ్లీ ఆ మార్పుల వివరాలను తెలంగాణ ప్రభుత్వానికి తెలుపుతారు. మొత్తంగా రెండు రాష్ట్రాల ఏకాభిప్రాయంతో కూడిన అలైన్‌మెంట్‌ను ఫైనల్‌ చేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ, ఏపీలోని ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్‌ కార్యాలయాలు సంయుక్తంగా పనిచేయనున్నాయి.

Updated Date - Oct 01 , 2025 | 03:15 AM