Abuzamad Encounter: అబూజ్‌మాడ్ ఎన్‌కౌంటర్ బూటకం
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:26 AM
అబూజ్‌మాడ్‌లో జరిగిన ఎదురు కాల్పుల ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆరోపిస్తూ ఎదురు కాల్పుల్లో అశువులు బాసిన కాత రామచంద్రారెడ్డి కొడుకు..
చత్తీ్‌సగఢ్ హైకోర్టులో కాత కుమారుడి పిటిషన్
డీజీపీ, కలెక్టర్ ప్రభృతులకు ఈ-మెయిల్ ఫిర్యాదు
పోలీసుల ఎన్‌కౌంటర్ కథ అబద్ధం
మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ
కోహెడ/చర్ల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): అబూజ్‌మాడ్‌లో జరిగిన ఎదురు కాల్పుల ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆరోపిస్తూ ఎదురు కాల్పుల్లో అశువులు బాసిన కాత రామచంద్రారెడ్డి కొడుకు.. ఛత్తీ్‌సగఢ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పోలీసులు చెబుతున్న అబూజ్‌మాడ్ ఎన్‌కౌంటర్ కథ అబద్ధమని మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. తమ కేంద్ర కమిటీ (సీసీ) సభ్యులు కాత రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డిలను అరెస్టు చేసి, తర్వాత హత్య చేశారని ఆరోపించింది. 10 నెలల క్రితమే బాధ్యతలు అప్పగించడంతో వారు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారన్న మావోయిస్టు పార్టీ.. వారిద్దరు కొంతకాలంగా గెరిల్లా దళాలకు దూరంగా ఉన్నారని పేర్కొంది. రాయ్‌పూర్‌లోని వివిధ ప్రాంతాల్లో నిరాయుధులుగా ఉండగా ఈ నెల 11-20 తేదీల మధ్య అరెస్టు చేసి, పార్టీ సమాచారం కోసం పోలీసులు హింసించారని తెలిపింది. చివరకు ఈ నెల 22న అబూజ్‌మాడ్‌కు తీసుకొచ్చి ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేశారని మావోయిస్టు పార్టీ ధ్వజమెత్తింది. ప్రభుత్వం ముందు లొంగిపోయి.. ప్రస్తుతం డీఆర్‌జీలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తులే.. తమ సీసీ సభ్యుల సమాచారం పోలీసులకు ఇచ్చారని ఆరోపించింది. కోసా దాదా కొరియర్ సంగతిని వారే పోలీసులకు తెలిపారని, ఇంటి వద్దే ఉంటున్న కొరియర్‌ను గత నెల 13న పోలీసులు అపహరించుకుపోయారని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. దీనివల్లే రాజుదాదాను పోలీసులు చేరుకోవడం తేలికైందన్నది. కొరియర్ గురించి ఈ నెల 9న తమకు రాసిన లేఖలో రాజుదాదా అన్ని విషయాలు తెలిపారని, లొంగుబాట్ల వల్ల ప్రమాదం పొంచి ఉందని సీసీ సభ్యులను హెచ్చరించారని పేర్కొంది. ఇదే చివరి లేఖ అని రాజు దాదా తన లేఖలో పేర్కొన్నారని గుర్తు చేసిన మావోయిస్టు పార్టీ.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు వెల్లడించింది.
ఎవరూ లేకుండానే కాత పోస్టుమార్టం
తన తండ్రి మృతదేహానికి నూతన చట్టం ప్రకారం కుటుంబసభ్యుల ముందు న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించాల్సిన పోస్టుమార్టం.. ఎవరూ లేకుండానే పూర్తి చేశారని కాత రామచంద్రారెడ్డి తనయుడు రాజా చంద్ర ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. తన తల్లి శాంతి, బంధువులతో కలిసి తన తండ్రి మృతదేహం తేవడానికి ఛత్తీ్‌సగఢ్ వెళ్లానన్నారు. ఎన్‌కౌంటర్ జరిగి 2 రోజులవుతున్నా తన తల్లి, బంధువులకు మృతదేహాన్ని చూడకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు ఉన్నాయని ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసినట్లు రాజాచంద్ర చెప్పారు. ఈ విషయమై ఆ రాష్ట్ర డీజీపీ, నారాయణపూర్ కలెక్టర్, ఎస్పీ, జిల్లా మేజిస్ట్రేట్‌లకు మంగళవారం మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. గతంలో ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు ఘటనాస్థలంలో మృతుల ఫొటోలను మీడియాకు చూపే పోలీసులు ఇప్పుడెందుకు గోప్యంగా ఉంచుతున్నారని రాజాచంద్ర ప్రశ్నించారు. కాగా, కాతా (కట్ట) రామచంద్రారెడ్డికి నివాళిగా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామస్తులు బుధవారం ర్యాలీ నిర్వహించారు.