Former Minister T Harish Rao: ఆడబిడ్డ ఆవేదనను అవమానిస్తారా?
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:17 AM
భర్తను కోల్పోయిన బాధలో కన్నీటిపర్యంతమైన మాగంటి గోపినాథ్ భార్య, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆవేదనను అవమానించేలా...
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): భర్తను కోల్పోయిన బాధలో కన్నీటిపర్యంతమైన మాగంటి గోపినాథ్ భార్య, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆవేదనను అవమానించేలా మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆమె తన భర్తను తలుచుకొని.. కన్నీళ్లు పెట్టుకుంటే.. దాన్ని కూడా రాజకీయం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. విజ్ఞత మరచి విచక్షణలేకుండా కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని, విజ్ఞులైన ప్రజలు మంచి, చెడును ఆలోచించి తగినతీర్పును ఇస్తారన్నారు. బీజేపీ మహిళా నాయకులు కళావతి, బి.లక్ష్మి, శైలజ, ఆర్కే లక్ష్మీ తదితరులు హరీశ్ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారికి గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో భర్తను కోల్పోయిన సునీతను ఉప ఎన్నికలో ఓడగొట్టేందుకు కాంగ్రెస్ 20 వేల దొంగఓట్లను కూడగట్టుకొందని, బిహార్‌లో ఓటు చోరీ అంటున్న రాహుల్ గాంధీ.. జూబ్ల్లీహిల్స్‌లో ఓటు చోరీపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా ఉండమని రేవంత్‌కు ఆయనే బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రజలను అడుగడుగునా మోసగిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ నిధులు ఇవ్వకుండా.. అభివృద్ధిని అడ్డుకొంటున్నదని ఆయన విమర్శించారు.