kumaram bheem asifabad- కలుపు మందులు అతిగా వాడొద్దు
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:18 PM
రైతులు కలుపు మందు అతిగా వాడొద్దని అధికారులు చెబుతున్నారు. సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో పాటు జిల్లాలోని సాగునీటి జలాశయాలు చెరువులు నిండడంతో ఆయకట్టు సాగులో సందడి కనిపిస్తోంది. బోర్లు, బావుల కింద నాట్లు ముగిశాయి. పంటల సాగులో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు మొక్కల నివారణ. ఎంత తొలగించినప్పటికీ ప్రతి 15నుంచి 20రోజుల్లో పంట కంటే ఎక్కువగా ఈ కలుపు మొక్కలే పీల్చేస్తాయి
- రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు
బెజ్జూరు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రైతులు కలుపు మందు అతిగా వాడొద్దని అధికారులు చెబుతున్నారు. సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో పాటు జిల్లాలోని సాగునీటి జలాశయాలు చెరువులు నిండడంతో ఆయకట్టు సాగులో సందడి కనిపిస్తోంది. బోర్లు, బావుల కింద నాట్లు ముగిశాయి. పంటల సాగులో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు మొక్కల నివారణ. ఎంత తొలగించినప్పటికీ ప్రతి 15నుంచి 20రోజుల్లో పంట కంటే ఎక్కువగా ఈ కలుపు మొక్కలే పీల్చేస్తాయి. అందుకే కలుపును సమూలంగా నివారించేందుకు దశాబ్దాల క్రితమే రసాయన మందులు వచ్చాయి. అయితే వీటిని ఎంత మేరకు వినియోగించాలి, వాడాలి అనే విషయమై రైతులు అవగాహన కలిగి ఉంటే మేలు. కలుపు మందులను ఎంత మోతాదులో వాడాలో, ఏకాలంలో పిచికారి చేయాలో తెలియక రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ రైతులు కలుపు నివారణ మందులు వినియోగించాలి. వీటిని నిర్ణీత పరిమాణం మేరకే వాడాలి. మోతాదు మించితే పంట మొక్కలకు, విత్తనాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. నేల సైతం తన సహజత్వాన్ని కోల్పోతుంది. వ్యవసాయ అధికారుల సిఫారసు మేరకు కలుపు మందులు వాడాలి. జాగ్రత్తలు తీసుకొని మందులు పిచికారి చేయాలి.
ఫ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- పురుగు మందులు, కలుపు మందులు వేర్వేరుగా నిల్వ చేసుకోవాలి. కలుపు మందులు వాడేటప్పుడు అంటే పిచికారి చేసేటప్పుడు ఇతర రైతుల పంట మొక్కలపై పడకుండా చూసుకోవాలి.
- ఈ మందు మనుషులు, పశువులు, పక్షులు తినే ఆహార పదార్థాలపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని పిచికారి చేయాలి.
- వరిలో కలుపు మొక్కల నివారణకు వరి నాటిన 2నుంచి 5రోజుల వ్యవదిలో బ్యూటోక్లోర్ అనే మందు ఒక ఎకరానికి లీటరు గానీ లీటరున్నర లేదా అనిలోఫాస్ మందు 500మి.లీ. నుంచి 600మిల్లీ లీటర్లు లేదా ప్రిటిలాక్లోర్ మందు 500మి.లీటర్ల ఇసుకలో కలిపి చల్లుకోవాలి.
- వరి నాటిన 20నుంచి 25రోజుల తర్వాత పొలంలో ఇంకా వెడల్పాకు గడ్డి, మొండిజాతి గడ్డి వంటి కలుపు మొక్కలు గుర్తిస్తే 2.4డీ సోడియం సాల్ట్ పొడి మందును ఎకరానికి 600నుంచి 800గ్రాముల మందును 200లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారి చేయాలి. లేదా ఒక ఎకరానికి బిస్‌పైరిబాక్ సోడియం అనే మందును 100మిల్లీలీటర్లు పిచికారి చేయాలి.
- మోతాదుకు మించి వినియోగిస్తే పంటలకు నష్టం వాటిల్లుతుంది. ఈ మందు పత్తి, మినుము, పెసరు పంటలపై వాడొద్దు.
- కొన్ని రకాల కలుపు మందులు కలుపు మొక్కలతో పాటు పంటను కూడా ఒకేసారి నిర్మూలిస్తాయి.
- మొండిజాతి కలుపు మొక్కలు గర్క, తుంగ, దర్బ మొక్కలపై గ్లైపోసెట్ మందు పిచికారి చేయాలి. కలుపు మొక్కలు నాలుగు ఆకుల నుంచి ఆరు ఆకుల దశలో మందు కొట్టాలి. నీటిలో కరిగే పొడి కలుపు మందులను ఇసుకలో గానీ యూరియాలో గానీ కలిపి చల్లరాదు.
- హ్యాండ్ స్ర్పేయర్లతోనే పిచికారి చేయాలి. పవర్ స్ర్పేలు వాడొద్దు.
కలుపు నివారణ మందును పంట కాలంలో ఒకసారే పిచికారి చేయాలి. పొలంలో వెనుకకు నడుస్తూ స్ర్పే చేయాలి.
- పత్తి పంటలో కలుపు నియంత్రణ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కలుపు మొక్కలు పత్తికి పోటీగా నీరు , ఎరువులు, వెలుతురు, పోషకాలు వాడేపుకుంటాయి. దాంతో పత్తి పంట దిగుబడి 30-40శాతం వరకు తగ్గిపోవచ్చు.
- పత్తిలో విత్తనాలు వేసిన 20-25రోజులకు మొదటి కలుపు తీయాలి. 40-45రోజులకు రెండవ కలుపు తీయాలి. కలుపు యంత్రాలు వాడితే శ్రమ తక్కువ అవుతుంది. నాటిన తర్వాత మొదటి 45రోజులు పంట కలుపు లేకుండా ఉంచితే బాగుంటుంది.
వ్యవసాయ అధికారుల సూచన మేరకు వాడాలి..
- నాగరాజు, వ్యవసాయ అధికారి, బెజ్జూరు
వరిలో కలుపు మొక్కల నివారణకు రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన సిఫారసు మేరకు కలుపు మందులు వినియోగించాలి. ఎక్కువ మోతాదులో వాడితే పంటకు కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. మందులను ఎక్కువగా వాడి పంటను నాశనం చేసుకోవద్దు. కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.