Child Trafficking: పిల్లల అక్రమ రవాణాకు వారే ఊతం
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:17 AM
పిల్లల అక్రమ రవాణా, విక్రయాల (చైల్డ్ ట్రాఫికింగ్) ముఠాల్లో రాష్ట్రంలోని కొందరు వైద్యులు, ఆర్‌ఎంపీలు, ఆశ వర్కర్లు కీలకంగా మారుతున్నారు..
చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలకువైద్యులు, ఆర్‌ఎంపీలు, ఆశా వర్కర్లతో లింకులు
ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారులను తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు లేని దంపతులకు విక్రయాలు
వరుస ఘటనలతో ఆందోళన
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పిల్లల అక్రమ రవాణా, విక్రయాల (చైల్డ్ ట్రాఫికింగ్) ముఠాల్లో రాష్ట్రంలోని కొందరు వైద్యులు, ఆర్‌ఎంపీలు, ఆశ వర్కర్లు కీలకంగా మారుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలిసి ఉండటం, విస్తృత పరిచయాలు, పిల్లలు లేని దంపతులు వారి వద్దకు వస్తుండటం వంటివి దీనికి ఊతమిస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన సృష్టి సంతాన సాఫల్య కేంద్రం మోసం కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వైద్యురాలు నమ్రత సరోగసి పేరిట 80 మంది శిశువుల అక్రమ రవాణాకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దీనితోడు ఇటీవల మరికొన్ని చోట్లా చిన్నారుల అక్రమ రవాణా, విక్రయం ఘటనలు బయటికి వచ్చాయి. ఇందులో చాలా వరకు క్లినిక్‌ల వైద్యులు, ఆర్‌ఎంపీలు, ఆశా వర్కర్లకు భాగస్వామ్యం ఉండటం ఆందోళన రేపుతోంది. కొద్దిరోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు.. ఇతర ప్రాంతాల నుంచి చిన్నారులను కొనుగోలు చేసి, ఇక్కడ పిల్లలు లేని దంపతులకు విక్రయించినట్లు గుర్తించి, అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో క్లినిక్ నడుపుతున్న ఓ సిద్దిపేట నర్సు ఇటీవల చిన్నారుల అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడుతూ పట్టుబడింది. హైదరాబాద్‌లోని చైతన్యపురికి చెందిన ఒక ఆశా వర్కర్.. చైల్డ్ మాఫియాతో కలసి పనిచేస్తోందని, పిల్లలు లేని దంపతులను గుర్తించి, విక్రయాలకు పాల్పడుతోందని తేల్చారు. అడ్డదారిలో డబ్బు సంపాదన కోసం ఇలాంటి అక్రమ దందాలకు తెరతీస్తున్నట్లు గుర్తించారు.