Share News

Doctors Renting Out Medical Certificates: అద్దెకు వైద్య పట్టాలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 04:01 AM

చర్మ సంబంధ వ్యాధులకు సంబంధించి గచ్చిబౌలిలో ప్రైవేటు క్లినిక్‌ ఏర్పాటు చేసేందుకు ఓ డెర్మటాలజిస్టు పేరిట వైద్య, ఆరోగ్య శాఖకు దరఖాస్తు వచ్చింది...

Doctors Renting Out Medical Certificates: అద్దెకు వైద్య పట్టాలు

  • డాక్టర్‌ జేబులో కాసులు.. ‘యాక్టర్‌’ చేతిలో రోగులు

  • ప్రైవేటు ఆస్పత్రులకు సర్టిఫికెట్లు కిరాయికిస్తున్న వైద్యులు

  • వాటితో అనుమతులు, దవాఖానాల నిర్వహణ

  • అసలైన వైద్యుడి స్థానంలో రోగులకు మరొకరి సేవలు

  • వాళ్లలో ఎంబీబీఎస్‌ చదవని వారు, అనర్హులు కూడా..

  • ప్రజల ప్రాణాలతో చెలగాటంపట్టించుకోని వైద్యశాఖ అధికార్లు

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): చర్మ సంబంధ వ్యాధులకు సంబంధించి గచ్చిబౌలిలో ప్రైవేటు క్లినిక్‌ ఏర్పాటు చేసేందుకు ఓ డెర్మటాలజిస్టు పేరిట వైద్య, ఆరోగ్య శాఖకు దరఖాస్తు వచ్చింది. ఆ డెర్మటాలజిస్టు విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు అనుమతులు జారీ చేయగా.. ఆస్పత్రి కూడా ప్రారంభమైపోయింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఆ ఆస్పత్రి ఏ వైద్యుడి పేరు మీద ఉందో.. ఆ వైద్యుడు అక్కడ వైద్య సేవలు అందించరు. సరిగ్గా చెప్పాలంటే సదరు డాక్టరు గారు.. ఆ క్లినిక్‌ గుమ్మం కూడా తొక్కరు. ఎందుకంటే సదరు వైద్యుడు తన సర్టిఫికెట్లను ఆ ఆస్పత్రి యాజమాన్యానికి నెలకు రూ.50 వేలకు అద్దెకు ఇచ్చారు. అందువల్ల ఆ వైద్యుడి స్థానంలో ఇంకెవరో ఆ క్లినిక్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్‌ ఏంటీ తన సర్టిఫికెట్లు అద్దెకు ఇవ్వడం ఏంటీ ? అని విడ్డూరంగా అనిపిస్తున్నా.. ఇది నిజంగా నిజం. సాధారణంగా ఫార్మసీ పూర్తి చేసిన వారు తమ సర్టిఫికెట్లను మెడికల్‌ షాప్‌ నిర్వాహకులకు అద్దెకు ఇస్తుంటారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. కానీ, వైద్యులు కూడా తమ సర్టిఫికెట్లను అద్దెకు ఇవ్వడం ఇటీవల అధికమైంది. రాష్ట్రంలోని చాలా ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు ఇలా అద్దె సర్టిఫికెట్ల ఆధారంగా అనుమతి పొంది నడుస్తున్నాయి. ఎవరో వైద్యుడి పేరిట అనుమతి తీసుకొని ఆస్పత్రి పెట్టడం మరెవరితోనూ వైద్యం చేయించడం ఓ దం దాగా మారిపోయింది. కొన్ని ఆస్పత్రుల్లో అసలు వైద్యుడి స్థానంలో అర్హత లేని వారు, వైద్య విద్య పూర్తి చేయని వారు కూడా చికిత్సలు చేసేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌ ప్రాంతా ల్లో ఈ తరహా ప్రైవేటు ఆస్పత్రులు 30 దాకా ఉన్నాయి. ఇటీవల వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రవ్యాప్తంగా సంతాన సాఫల్య కేంద్రాల్లో తనిఖీలు చేపట్టగా.. ఒక డాక్టర్‌ పేరుతో అనుమతి తీసుకొని మరొకరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 50 వరకు ఫర్టిలిటీ కేంద్రాలను అధికారులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌ జిల్లాలో రాష్ట్ర వైద్యమండలి వంద ఆస్పత్రుల్లో తనిఖీలు చేయగా... మెజార్టీ వాటిలో అనుమతులు పొంది వైద్యం చేయాల్సిన డాక్టర్లకు బదులు, అర్హత లేని వారు, వైద్యం చదవని వారు ప్రాక్టీసు చేస్తున్నట్లు తేలింది. దీని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


నెలకు రూ.10 వేల నుంచి 40 వేలు

ప్రైవేటు ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధిత వైద్యుడి విద్యార్హత పత్రాలను వైద్య, ఆరోగ్య శాఖకు కచ్చితంగా సమర్పించాలి. వాటిని పరిశీలించి అధికారులు ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతులిస్తారు. అనుమంతి పొందిన వైద్యుడే ఆ ఆస్పత్రిలో సేవలు అం దించాలి. అయితే, వైద్యాన్ని వ్యాపారంగా భావిస్తోన్న కొందరు.. ఆస్పత్రుల ఏర్పాటు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఎంబీబీఎస్‌ ధృవపత్రాన్ని కిరాయికిచ్చే వారిని పట్టుకుని, వారి పట్టాతో దరఖాస్తు చేసి అనుమతి పొంది ఆస్పత్రులు పెట్టేస్తున్నారు. సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులకు ఎంత కొంత ముట్టజెబుతున్నారు. ఇందులో ఎంబీబీఎస్‌ పట్టాలకు ఒక రేటు, స్పెషాలిటీ వాటికైతే మరో రేటున నెలకు, ఏడాదికి ఇంత అని మాట్లాడుకుని చెల్లిస్తున్నారు. ఎంబీబీఎస్‌ డిగ్రీలకైతే నెలకు సుమారు రూ.10-20 వేల మధ్య, అదే స్పెషాలిటి అయితే నెలకు రూ.30-40 వేల మధ్య ఇస్తున్నారని సమాచారం. చాలామంది వైద్యులకు ఇదో ఆర్థిక వనరుగా మారిపోగా.. ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతులు జారీ చేసే డీఎంహెచ్‌వోల నిర్లక్ష్యం వారికి వరంగా మారింది. ఓ వైద్యుడి పట్టా చూసి ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్న డీఎంహెచ్‌వోలు.. ఆ తర్వాత సదరు వైద్యుడు ఆ ఆస్పత్రిలోనే ఉంటున్నారా? అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. డీఎంహెచ్‌వోలు ఇలా చూసీచూడనట్టుగా ఉండడానికి తప్పుడు తరహాలో అనుమతు లు పొందిన ఆస్పత్రుల యాజమాన్యాలు లక్షల్లో ఆమ్యామ్యాలు ముట్టజెబుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నకిలీ వైద్యుల ఆట కట్టించేందుకు తనిఖీలు చేపట్టే రాష్ట్ర వైద్య మండలి.. నకిలీ వైద్యులు, ఆర్‌ఎంపీలు, పీఎంపీల ఆధ్వర్యంలో నడిచే క్లినిక్‌లపైనే అధికంగా దృష్టి పెడుతోంది. ఎంబీబీఎస్‌ వైద్యుల పేరిట నిర్వహణలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లను మాత్రం పట్టించుకోవడం లేదు. ఎంబీబీఎస్‌ డాక్టర్లు సంబంధిత హాస్పిటల్‌/క్లినిక్‌ల్లో ప్రాక్టీస్‌ చేయనప్పటికీ, కేవలం వాటిఅనుమతి కో సం తమ సర్టిఫికెట్లను కిరాయికి ఇచ్చిన వైద్యులపై చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వైద్యమండలి తీరుపై అనేక విమర్శలు ఉన్నాయి.


తనిఖీలు చేపట్టి.. నోటీసులు పంపాం

ఆర్‌ఎంపీ క్లినిక్‌లతోపాటు ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌ల్లో కూడా తనిఖీలు చేపట్టాం. ఒక వైద్యుడి పట్టా పేరుతో అనుమతులు పొంది ఏర్పాటైన ఆస్పత్రుల్లో సంబంధిత వైద్యులు పనిచేయడం లేదనే విషయాన్ని చాలా చోట్ల గుర్తించాం. వాటిల్లోని కొన్ని ఆస్పత్రుల్లో అసలు వైద్యపట్టానే లేని వారు ప్రాక్టీసు చేయడాన్ని గమనించాం. ఇతర కోర్సులు చేసి వైద్యం చేస్తున్న విషయాన్ని కనుగొన్నాం. వారందరికీ నోటీసులు పంపాం. అలాగే కోడ్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎథిక్స్‌ పాటించని కొందరి వైద్యులపై చర్యలు కూడా తీసుకున్నాం. జాతీయ వైద్య కమిషన్‌ గుర్తించిన వైద్యపట్టాలుండి, అయా రాష్ట్రాల మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయిన వారే వైద్యాన్ని ప్రాక్టీసు చేయాలి. లేకపోతే నిబంధనల మేరకు చర్యలుంటాయి.

- డాక్టర్‌ గుండగాని శ్రీనివాస్‌,

వైస్‌ చైర్మన్‌, తెలంగాణ రాష్ట్ర వైద్యమండలి

Updated Date - Nov 03 , 2025 | 04:01 AM