Doctors Prescriptions Must Be Clear and Legible: మందుల చీటి.. అర్థమయ్యేలా రాయాల్సిందే!
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:48 AM
వైద్యులు రాసే మందుల చీటి.. ఆ మందులు అమ్మే మెడికల్ షాపుల వాళ్లకు తప్ప ఇంకొకరికి అర్థం కాదు. ఇది ఒక్కోసారి పేషెంట్ల ప్రాణాల మీదకు వస్తోంది....
వైద్యుల ప్రిస్ర్కిప్షన్ స్పష్టంగా, చదవగలిగేలా ఉండాలి
ప్రభుత్వ, ప్రైవేటు వైద్యసంస్థలకు ఎంఎన్‌సీ నిర్దేశం
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వైద్యులు రాసే మందుల చీటి.. ఆ మందులు అమ్మే మెడికల్ షాపుల వాళ్లకు తప్ప ఇంకొకరికి అర్థం కాదు. ఇది ఒక్కోసారి పేషెంట్ల ప్రాణాల మీదకు వస్తోంది. చాలాకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యకు చెక్ పెట్టాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. ఇక నుంచి డాక్టర్లు రాసే ప్రిస్ర్కిప్షన్లు తప్పనిసరిగా స్పష్టంగా, చదవడానికి వీలుగా ఉండాలని నిర్దేశించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రతి వైద్యుడు ఔషధాలను సాధారణ (జెనరిక్) పేర్లతో, చదవగలిగేలా, ఆంగ్లంలోని పెద్ద అక్షరాలలో (క్యాపిటల్ లెటర్స్‌లో) రాయాలి. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో పాటు మెడికల్ కాలేజీలు, వైద్య సంస్థలకు ఎన్‌ఎంసీ లేఖ రాసింది. పకడ్బందీగా అమలు చేయటానికి వీలుగా తక్షణమే డ్రగ్స్ అండ్ థెరప్యూటిక్స్ కమిటీ(డీటీసీ) ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ‘పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు’ తరఫున ఎన్‌ఎంసీ ఒక పబ్లిక్ నోటీసును కూడా తాజాగా తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. పంజాబ్-హరియాణా హైకోర్టు ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన ఇచ్చిన తీర్పు ఆధారంగా ఎన్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలకు అనుగుణంగా పని చేసే బోధనాసుపత్రుల్లో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రిస్ర్కిప్షన్ పద్ధతులను క్షుణ్ణంగా పర్యవేక్షించాల్సిన అవసరంఉందని ఎన్‌ఎంసీ భావిస్తోంది. ప్రిస్ర్కిప్షన్ నమూనాలను సంబంధిత ఉపకమిటీలు విశ్లేషించి, ఏమైనా లోపాలుంటే గుర్తించి, మెరుగుదల కోసం దిద్దుబాటు చర్యలను సిఫార్సు చేయాలని ఎంఎన్‌సీ పేర్కొంది. అన్ని వైద్య సంస్థలు తక్షణమే ఉప-కమిటీలను ఏర్పాటు చేసి నిబంధనలను అమలు చేయాలని ఎంఎన్‌సీ ఆదేశించింది.