Hajj Committee: డీఎన్‌ఏ నమూనాల సేకరణ పూర్తి
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:47 AM
సాదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమైన వారికి సంబంధించి న కుటుంబసభ్యులు బుధవారం మదీనా చేరుకున్నారు. హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులామ్ అఫ్జల్....
మదీనా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన
హైదరాబాద్ నుంచి వచ్చిన 39 మంది శాంపిళ్ల సేకరణ
మదీనా చేరిన ఏపీ గవర్నర్ నజీర్ నేతృత్వంలోని బృందం
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి, న్యూఢిల్లీ, శంషాబాద్ రూరల్, నవంబరు 19 : సాదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమైన వారికి సంబంధించి న కుటుంబసభ్యులు బుధవారం మదీనా చేరుకున్నారు. హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులామ్ అఫ్జల్, ఎమ్మెల్సీ రహిమత్‌బేగ్, కమిటీ మెంబర్ మసూద్ అలీ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు చెందిన 39 మంది మంగళవారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియా వెళ్లారు. మదీనా చేరుకున్న వీరికి తెలంగాణ రాష్ట్ర మంత్రి మహ్మద్ అజారుద్దీన్ విమానాశ్రయంలోనే స్వాగతం పలికారు. అజారుద్దీన్ రెండు రోజుల క్రితమే మదీనా చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి మదీనా వచ్చిన 39 మందిని నేరుగా స్థానిక ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగానికి తీసుకెళ్లి డీఎన్‌ఏ పరీక్షలకు నమూనాలు తీసుకున్నారు. అనుకున్న దాని కంటే త్వరగానే డీఎన్‌ఏ శాంపిళ్ల సేకరణ పూర్తి కాగా.. ఫలితాలు కూడా త్వరగా వస్తాయని చెబుతున్నారు. ఇక, తమ వారి అంతిమ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆ 39 మంది తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన షోయెబ్ కుటుంబ సభ్యుడిని కలిసిన మంత్రి అజారుద్దీన్ అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా లాంఛనాలను పూర్తి చేయడానికి, స్థానిక విధానాలు, కుటుంబ ప్రాధాన్యతలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం సౌదీ అధికారులతో కలిసి పనిచేస్తోంది. మంత్రి అజారుద్దీన్ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా తెలియజేస్తున్నారు.
మదీనా చేరిన ఏపీ గవర్నర్ నజీర్ బృందం
మదీనాలో జరిగిన ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయ యాత్రికుల కుటుంబాలకు అందుతున్న సహాయక చర్యల పరిశీలనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పంపిన అత్యున్నత స్థాయి కమిటీ కూడా బుధవారం మదీనా చేరుకుంది. ఈ బృందంలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్ చటర్జీ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సౌదీ అరేబియాలో భారత రాయబారి సోహెల్ అహ్మద్ ఖాన్, కాన్సుల్ జనరల్ ఫహాద్ ఖాన్ సూరీ.. గవర్నర్ బృందానికి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మృతుల అంతిమ కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఏపీ గవర్నర్ నజీర్ మదీనాలోనే ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.