DNA Confirmation: ఏడ్చిఏడ్చి.. ఇంకిన కన్నీళ్లు!
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:50 AM
కర్నూలు బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వారి కుటుంబీకులు ఏడ్చిఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. 48 గంటలకుపైగా నిరీక్షణ అనంతరం....
మృతదేహాల కోసం 48 గంటలకు పైగా నిరీక్షణ.. డీఎన్‌ఏ రిపోర్టు రావడంతో అప్పగింత
ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలాలకు పంపిన ప్రభుత్వం
19వ మృతదేహం చిత్తూరు జిల్లా వాసిదిగా గుర్తింపు
కర్నూలు/కర్నూలు హాస్పిటల్, కుప్పం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కర్నూలు బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వారి కుటుంబీకులు ఏడ్చిఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. 48 గంటలకుపైగా నిరీక్షణ అనంతరం అధికారులు వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం అందుతాయనుకున్న డీఎన్‌ఏ ఫలితాలు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ మేరకు ఆదివారం ఉదయానికే రావడంతో.. వెంటనే మృతుల రక్త సంబంధీకులకు సమాచారం ఇచ్చారు. డీఎన్‌ఏ సరిపోల్చిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం నుంచి మృతదేహాల అప్పగింత ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చురీ పరిసరాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామన ప్రమాదానికి గురైన బస్సు మంటల్లో సజీవదహనమైన వాళ్లను తలుచుకుంటూ విషాదంలో మునిగిపోయిన కుటుంబీకులు.. ఆ మృతదేహాలను చూసుకుని బిగ్గరగా రోదించారు. ‘అన్నా.. నాన్న మృతదేహం తీసుకొని మేము బయలుదేరాం..’ అంటూ ఒకరు... ‘ఇప్పుడే అమ్మ, చెల్లి బాడీలను ఇచ్చారు. బయల్దేరి వచ్చేస్తున్నాం.. అంత్యక్రియలకు సిద్ధం చేయండి..’ అంటూ మరొకరు ఫోన్లలో తమవాళ్లకు సమాచారం ఇ చ్చుకున్నారు. ప్రభుత్వం సమకూర్చిన ప్రత్యేక అంబులెన్స్‌ల్లో మృతదేహాలను తీసుకుని కుటుంబీకులు, రక్త సంబంధీకులు స్వస్థలాలకు బయలుదేరారు. మృతదేహాల అప్పగింత ప్రక్రియను కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. కాగా తమిళనాడుకు చెందిన ప్రశాంత్ అనే యువకుడి మృతదేహాన్ని సోమవారం అప్పగించే అవకాశం ఉంది.
ఏపీ వాసులు వీరే..
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్, ఆయన భార్య అనుషా, కూతురు, కుమారుడు మాన్విత, శశాంక్‌ల మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పావులపాలెంకు చెందిన కొవ్వూరు శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని అప్పగించారు. ఆ తర్వాత బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి మృతదేహం అప్పగించారు. సాయంత్రం చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం యామగానిపల్లికి చెందిన పి.త్రిమూర్తి మృతదేహం అప్పగించారు. ఈ మృతదేహాలను కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనాల్లో స్వగ్రామాలకు తరలించారు.
ఆ వ్యక్తిది చిత్తూరు జిల్లాగా గుర్తింపు
ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు రిజర్వేషన్ ప్రకారం 18 మంది మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నగర శివారులోని ఆరాంఘర్ చౌరస్తా దగ్గర బస్సు ఎక్కిన వ్యక్తి కూడా ఈ ఘటనలో మృతి చెందారు. ఆ వ్యక్తి ఎవరనేది పోలీసులకు సమాచారం రాలేదు. దీంతో పోస్టుమార్టం చేసి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. అయితే చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం యామగానిపల్లెకి చెందిన పీటీ కల్యాణ్ భరత్... ఆ మృతదేహం తన తండ్రి త్రిమూర్తి (58)దే కావొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ శనివారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. ‘‘హైదరాబాద్‌లో బంధువుల పెళ్లికి మా నాన్న త్రిమూర్తి (58) ఈ నెల 22న కుప్పం నుంచి వెళ్లారు. 23న రాత్రి హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ బస్సులో బయలుదేరినట్టు చెప్పారు. కానీ ఇంటికి చేరలేదు. ఫోన్ చేస్తే పని చేయడం లేదు.. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మా నాన్నదే అయి ఉంటుందేమో..’’ అని పోలీసులకు తెలిపారు. డీఎన్‌ఏ సరిపోవడంతో త్రిమూర్తి మృతదేహాన్ని కల్యాణ్ భరత్‌కు అప్పగించారు.
బిహార్ వాసికి కర్నూలులో అంత్యక్రియలు
ప్రమాదంలో మరణించిన బిహార్ రాష్ట్రానికి చెందిన అమ్రిత్‌కుమార్ అలియాస్ అమరజిత్ కుమార్ (45) రక్త సంబంధీకుల రక్తనమూనాలు సేకరించి డీఎన్‌ఏ సరిపోల్చి కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. అయితే కర్నూలు నుంచి బిహార్‌లోని వారి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. దీంతో ఇక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని మృతుడి బంధువులు విన్నవించడంతో కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
డీఎన్‌ఏ సరిపోల్చి.. అప్పగింత
బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన 19 మందిలో ఏపీలోని నెల్లూరు, అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల, చిత్తూరు జిల్లాలకు చెందిన ఆరుగురు, తెలంగాణకు చెందిన ఆరుగురు, కర్ణాటకకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన ఇద్దరు, ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. పూర్తిగా కాలిపోయి మాంసపు ముద్దగా మారడంతో ఏ మృతదేహం ఎవరిదో గుర్తుపట్టలేనట్టు తయారయ్యాయి. దీంతో డీఎన్‌ఏ పరీక్షల అనంతరమే మృతదేహాలను అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మృతులు, వారి కుటుంబ సభ్యుల నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. డీఎన్‌ఏ పరీక్షా ఫలితాలు ఆదివారం ఉదయం 8 గంటలకే కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు చేరాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఫోరెన్సిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బ్రహ్మజీ మాస్టర్ ఆధ్వర్యంలో డీఎన్‌ఏ సరిపోల్చి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ప్రత్యేక అంబులెన్స్‌ల్లో స్వస్థలాలకు పంపించారు. ఈ ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం 1:45 నుంచి రాత్రి 8:30 గంటల వరకూ సాగింది.