Share News

District Committees: త్వరలో జిల్లా స్థాయి అసైన్డ్‌ కమిటీలు

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:21 AM

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి అసైన్డ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది

District Committees: త్వరలో జిల్లా స్థాయి అసైన్డ్‌ కమిటీలు

  • చైర్మన్‌గా ఇన్‌చార్జి మంత్రి.. కోచైర్మన్‌గా కలెక్టర్‌

  • గతంలోని మండల, నియోజకవర్గ కమిటీల రద్దు

  • ప్రతిపాదనలు సిద్ధం చేసిన రెవెన్యూ అధికారులు

  • హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి అసైన్డ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటిదాకా ఉన్న మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను రద్దు చేసి, జిల్లా స్థాయిలో ఒకే కమిటీ ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల సరిహద్దులు రెండు జిల్లాల పరిధిలో ఉన్నందున.. కమిటీల సమావేశాల నిర్వహణకు ఇబ్బందిగా ఉంటుందని, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో జిల్లాకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం. అసైన్‌మెంట్‌ కమిటీకి చైర్మన్‌గా ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు కొనసాగుతారని, జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సభ్యులుగా ఉంటారని, కలెక్టర్‌ కోచైర్మన్‌గా లేదా కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ప్రతిపాదించారు. ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకునే పేదలకు పాస్‌పుస్తకాలు అందించడం, పీవోటీ చట్టం కింద కొనుగోలు చేసిన భూ ముల క్రమబద్ధీకరించే అంశంపైనా కమిటీలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం భూభారతి చట్టం ద్వారా వివాదాల్లేని భూములకు ఎలకా్ట్రనిక్‌ టైటిల్‌ డీడ్‌ కమ్‌ పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు జారీ చేస్తున్న యంత్రాంగం.. ఇది పూర్తి కాగానే వివాదస్పద భూములపై దృష్టి సారించనుంది. తెలంగాణలో అటవీ సరిహద్దు వివాదాలు న్న భూములు 2,18,980 ఎకరాలున్నాయి. ఇవన్నీ మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కొత్తగూడెం తదితర జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పేదలు సాగు చేసుకుంటున్న భూములను వారికే అసైన్‌ చేయాలని ఆయా జిల్లా ల కలెక్టర్లు సైతం గతంలో నివేదికలు ఇచ్చారు. ఈ వివాదాలకు అసైన్‌మెంట్‌ కమిటీల ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉందని సమాచారం. తాజా ప్రతిపాదనలను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించిన తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Aug 11 , 2025 | 05:21 AM