Speaker Prasad Kumar: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రేపటి నుంచి విచారణ
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:21 AM
బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై విచారణకు ముహుర్తం కుదిరింది. విచారణ తేదీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఖరారు చేశారు....
29, 1 తేదీల్లో నలుగురిపై విచారణ
పండుగ తర్వాత మరో నలుగురిపై..
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై విచారణకు ముహుర్తం కుదిరింది. విచారణ తేదీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం శాసనసభ కార్యదర్శి షెడ్యూల్‌ను విడుదల చేశారు. సెప్టెంబరు 29, అక్టోబరు 1 తేదీల్లో నలుగురు ఎమ్మెల్యేలను విచారిస్తారు. రెండు రోజుల సమయం కాలెయాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌లకు కేటాయించారు. మిగతా నలుగురిని దసరా పండుగ తర్వాత అక్టోబరు ఐదో తేదీలోపు విచారించే అవకాశం ఉందని స్పీకర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఇరు వర్గాల వాదనలు స్పీకర్ వింటారు. ఒక్కో ఎమ్మెల్యేకు గంట సమయం కేటాయించారు. పిటిషనర్లుగా కోరుట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిలు ఉండగా, ప్రతివాదులుగా ఆ నలుగురు ఎమ్మెల్యేలున్నారు. మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా, 8 మంది వివరణ ఇచ్చారు. వారిలో నలుగురిని సోమ, బుధవారాల్లో విచారించనున్నారు. దసరా తర్వాత మూడు, నాలుగు తేదీల్లో మిగిలిన నలుగురిని విచారిస్తారు. బార్పొడో్‌సలో జరుగుతున్న కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో పాల్గొనేందుకు అక్టోబరు ఆరున స్పీకర్ ప్రసాద్ కుమార్ బయల్దేరి వెళ్లనున్నారు. అకోబరు23 వరకూ విదేశాల్లోనే ఉంటారు. ఈ నేపథ్యంలో అక్టోబరు ఐదులోపు అనర్హత పిటిషన్‌కు వివరణ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేయాలని స్పీకర్ భావిస్తున్నారు. విచారణలో వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను నియమించుకోవాలని ఇరువర్గాలను స్పీకర్ కార్యాలయం కోరింది. న్యాయవాదులను నియమించుకున్నట్లుగా టీఆర్‌ఎ్‌సఎల్పీ ప్రతినిధి శుక్రవారం స్పీకర్ కార్యాలయానికి లేఖ కూడా ఇచ్చినట్లు సమాచారం. సోమవారం విచారణ ప్రారంభం కానుంది. బీఆర్‌ఎస్ టిక్కెట్టుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకా్‌షగౌడ్, కృష్ణమోహన్‌రెడ్డి, సంజయ్ కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డిలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు బీఆర్‌ఎస్ పార్టీ పిటిషన్ ఇచ్చింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ సుప్రీంకోర్టునూ ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు విచారణ ప్రక్రియను ప్రారంభించిన స్పీకర్ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మందీ తాము పార్టీ మారలేదంటూ అఫిడవిట్ల పూర్వకంగా వివరణ ఇచ్చారు. ఫిర్యాదుదారులు కూడా వారికి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించారు. ఈ నాలుగు రోజులు కేవలం విచారణ నడుస్తుదని, నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.