Share News

Legal Heirs of Late MLA Maganti Gopinath: కుటుంబ కథా చిత్రమ్‌!

ABN , Publish Date - Nov 07 , 2025 | 02:35 AM

ఇటీవల కన్నుమూసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ వారసత్వానికి సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది....

Legal Heirs of Late MLA Maganti Gopinath: కుటుంబ కథా చిత్రమ్‌!

  • మాగంటి గోపీనాథ్‌ వారసత్వంపై వివాదం.. శేరిలింగంపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో విచారణ

  • నాన్న అంతిమ సంస్కారాలకు రావద్దని నన్ను బెదిరించారు

  • వాళ్లెవరో తర్వాత చెప్తా.. నా వద్ద కాల్‌లాగ్స్‌ ఉన్నాయి: ప్రద్యుమ్న

  • నా కుమారుడు ఆస్పత్రిలో ఉన్నప్పుడు నన్ను చూడనివ్వలేదు

  • కేటీఆర్‌కు చెప్పినా పట్టించుకోలేదు

  • ఆయన వచ్చేవరకూ గోపీ మరణాన్ని ధ్రువీకరించలేదు: తల్లి మహానందకుమారి

హైదరాబాద్‌ సిటీ/గచ్చిబౌలి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కన్నుమూసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ వారసత్వానికి సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు అసలైన వారసులం తామేనని.. గోపీనాథ్‌ మొదటి భార్య మాలినిదేవి, కుమారుడు తారక్‌ ప్రద్యుమ్న తెలిపారు. గతంలోనే దీనిపై రంగారెడ్డి కలెక్టర్‌కు గోపీనాథ్‌ తల్లి మహానందకుమారి ఫిర్యాదు చేయగా.. మాలినిదేవి శేరిలింగంపల్లి తహశీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తహశీల్దార్‌ వెంకారెడ్డి.. గతంలో మాగంటి సునీత, కూతుర్లు అక్షర, దిశిర, కొడుకు వాత్సల్యకు ఇచ్చిన లీగర్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌ను పక్కనపెట్టినట్టు తెలిపారు. విచారణకు హాజరు కావాలని ఇరుపక్షాలకూ నోటిసులిచ్చారు. ఈ మేరకు గురువారం జరిగిన విచారణకు మొదటి భార్య మాలినిదేవి, తారక్‌.. రెండో భార్య సునీత కుమార్తె దిశిర తమ న్యాయవాదితో కలిసి తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. గోపీనాథ్‌ తల్లి మహానందకుమారి కూడా మాలినీదేవికి మద్దతుగా విచారణలో పాల్గొన్నారు. గోపీనాథ్‌, మాలినీదేవి పెళ్లిఫొటోలను ఆమె తీసుకువచ్చినట్టు సమాచారం. ఇరుపక్షాల వద్ద ఉన్న ఆధారాలను వెంకారెడ్డి తీసుకున్నారు. ఆయన అడిగిన మరిన్న పత్రాలను సమర్పించడానికి మరికొంత సమయం కావాలని ఇరు పక్షాలూ కోరాయి. దీంతో.. తదుపరి విచారణను తహశీల్దార్‌ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. మరిన్ని ఆధారాలను 19వ తేదీలోగా సమర్పించాలని ఇరువర్గాలనూ ఆదేశించారు. ఆ పత్రాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రద్యుమ్నకూ హక్కులు దక్కాలి..

1998లో మాలినితో గోపీనాథ్‌కు వివాహమైందని.. ఆయన తల్లి మహానందకుమారి స్పష్టం చేశారు. గోపీనాథ్‌ చావే ఒక మిస్టరీ అని.. ఆయన ఎప్పుడు చనిపోయారో తమకు తెలియదని.. కేటీఆర్‌ వచ్చేవరకూ ఆయన మరణాన్ని ధ్రువీకరించలేదని.. అలా ఎందుకు చేశారో కేటీఆరే జవాబు చెప్పాలని ఆమె సంచలనవ్యాఖ్యలు చేశారు. ‘‘గోపీనాథ్‌ మొదటి భార్య మాలినిదేవే. సునీతతో పెళ్లి నేను చేయలేదు. ఆమె వచ్చాక రెండేళ్లు మాతో కలిసి ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లారు. మాలినితో విడాకులకు దరఖాస్తు చేసుకుంటే రద్దయ్యాయి. అందరూ గోపీనాథ్‌ పిల్లలే. కొడుకుగా ప్రద్యుమ్నకూ హక్కులు దక్కాలి. కుటుంబమంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఆమె పోటీచేస్తున్న విషయం గురించి పార్టీ వాళ్లుగానీ, సునీతగానీ నాకు చెప్పలేదు. గోపీనాథ్‌ ఆస్పత్రిలో ఉన్నప్పుడు.. వెంటిలేటర్‌పై ఉన్నాడంటూ నన్ను చూడనివ్వలేదు. కేటీఆర్‌ అక్కడకు వస్తే.. ‘నన్ను చూడనివ్వట్లేదు. నువ్వయినా చెప్పయ్యా’ అంటే.. మాట్లాడి వస్తా అని వెళ్లిపోయాడు.’’ అని ఆమె పేర్కొన్నారు.


రావొద్దని నన్ను బెదిరించారు: తారక్‌ ప్రద్యుమ్న

తన తండ్రి (మాగంటి గోపీనాథ్‌) తనతో టచ్‌లో ఉండేవారని.. తరచుగా ఫోన్‌లో మాట్లాడేవారని ప్రద్యుమ్న వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 1న ఆయనను తాను కలిశానని.. ఇద్దరం కలిసి తన భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చించామని ఆయన తెలిపారు.. ఆయన మరణించినప్పుడు నేను అమెరికా నుంచి రావాలసుకున్నా. అక్కడి నుంచి రావడానికి 24 గంటలు పడుతుందని.. అప్పటి వరకూ వేచి చూడడం కుదరదని కొందరు చెప్పారు. ‘నువ్వు వస్తే గొడవలు జరుగుతాయి.. రాకుండా ఉండడమే మంచిద’ని ఇంకొందరు చెప్పారు. ఇప్పుడు ఇండియాకు రావొద్దని వాళ్ల పార్టీ వాళ్లు (బీఆర్‌ఎస్‌) బెదిరించారు. ఆ వ్యక్తులు ఎవరన్నది తరువాత చెప్తా. వాళ్లు నాకు ఫోన్‌ చేసిన కాల్‌ లాగ్‌ డీటెయిల్స్‌ ఉన్నాయి. ఆ సమయంలో వచ్చి గొడవ చేయడం బాగోదని.. గౌరవప్రదంగా నా తండ్రి అంతిమ సంస్కారాలు జరగాలని భావించా. నా జనన ధ్రువీకరణ పత్రంలో తారక్‌ ప్రద్యుమ్న కొసరాజు అని ఉంది. అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతోంది. పాస్‌పోర్ట్‌, ఇతర డాక్యుమెంట్లలో నా తండ్రిగా గోపీనాథ్‌ పేరు ఉంటుంది. మేం ఈ రోజు కొన్ని పత్రాలు తహసీల్దార్‌కు ఇచ్చాం. మరిన్ని పత్రాలు కావాలని అడిగారు. తదుపరి విచారణకు పూర్తి ఆధారాలతో హాజరవుతాం. 3, 4 నెలలుగా మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు. భయపెడుతున్నారు. కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని వచ్చాం. గోపీనాథ్‌ అఫిడవిట్‌లో మా పేర్లు లేవన్న విషయం నాకు తెలియదు.’’ అని స్పష్టం చేశారు. కాగా.. వ్యక్తిగత సమస్యలతో గోపీనాథ్‌, తాను దూరంగా ఉన్నామని, చట్టపరంగా విడాకులు తీసుకోలేదని మాలినిదేవి చెప్పారు.

ఇన్నేళ్లుగా ఎందుకు రాలేదు?

మాగంటి గోపీనాథ్‌కు, సునీతకు 2000 సంవత్సరం జూలైలో వివాహమైంది. 25 ఏళ్లుగా వాళ్లు కలిసి ఉన్నారు. అక్షర, దిశిర, వాత్సల్య వారి పిల్లలు. ఇన్ని రోజులూ తాము వారసులమంటూ ఎవరూ రాలేదు. సరిగ్గా ఎన్నికల ముందు ఇది జరుగుతోంది. ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నాం. భర్త చనిపోయి సునీత బాధలో ఉన్నారు. గోపీనాథ్‌ మరణించిన అనంతరం సీఎంలు చంద్రబాబు, రేవంత్‌, మంత్రి లోకేశ్‌ తదితరులంతా సునీత కుటుంబాన్ని పరామర్శించారు. పెళ్లి ఫొటోలు, పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డులు, ఇతర డాక్యుమెంట్లు తహసీల్దార్‌కు ఇచ్చాం. వాళ్లు ఏ ఆధారాలూ సమర్పించలేదు. వారి వద్ద ఉన్న కార్డుల్లో గోపీనాథ్‌ పేరు లేదు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లూ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన భార్యగా సునీత పేరు, పిల్లలుగా అక్షర, దిశిర, వాత్సల్య పేర్లు ఉన్నాయి. అసెంబ్లీ కార్యదర్శి ఎమ్మెల్యేల భాగస్వాములకు ఇచ్చే కార్డు కూడా సునీత పేరిట ఉంది. బ్యాంకు ఖాతాలు, పాలసీల్లోనూ నామినీగా సునిత పేరే ఉంది. ఈ వివాదంతో ఎన్నికల్లో పోటీకి ఇబ్బంది ఉండదు. తదుపరి విచారణ సమయంలో వాళ్లు ఏ ఆధారాలు సమర్పిస్తారో చూడాలి. దాన్ని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుంది.

Updated Date - Nov 07 , 2025 | 02:35 AM