Language Concerns: తెలుగంటే తక్కువ.. ఆంగ్లంపై మక్కువ
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:25 AM
మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్చార్డీ)లో సివిల్ సర్వీసెస్ అధికారులకు శిక్షణనిచ్చే సీనియర్ అధికారి ఒకరు ఇటీవల గ్రూప్-1కు...
మాతృభాషలో మాట్లాడేందుకూ ఇష్టపడని గ్రూప్-1 అధికారులు
శిక్షణ అంతా ఇంగ్లిషులోనే.. మచ్చుకైనా కనిపించని తెలుగు
ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో ఇంగ్లిషులో శిక్షణ ప్రణాళిక
గ్రూప్-1కు ఎంపికైన 563 మందిలో 90శాతం ఆంగ్ల మాధ్యమమే
పాలన వ్యవహారాల్లో తెలుగు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం
సివిల్ సర్వీస్ తరహాలో తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలంటున్న నిపుణులు
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్చార్డీ)లో సివిల్ సర్వీసెస్ అధికారులకు శిక్షణనిచ్చే సీనియర్ అధికారి ఒకరు ఇటీవల గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన తెలుగులో తన శిక్షణ ప్రారంభించగానే.. అభ్యర్థులంతా అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగులో వద్దని, ఇంగ్లిషులో చెప్పాలని కోరారు. దీనితో ఆయన ఇంగ్లిషులోనే కొనసాగించారు. తెలుగు రాష్ట్రంలో అత్యున్నత సర్వీసులకు ఎంపికైన గ్రూప్-1 అధికారులు మాతృభాషకు ఇస్తున్న విలువ ఇది. ఇటీవల ఎంపికైన అధికారులు కనీసం తెలుగు మాట్లాడేందుకు కూడా సిద్ధంగా లేరని, తెలుగులో ప్రశ్నిస్తే ఇంగ్లిషులో సమాధానం ఇస్తున్నారని ఆ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రూప్-1 శిక్షణ అంతా స్థానిక భాషలోనే జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. తెలంగాణలో దాదాపు 11 ఏళ్ల అనంతరం గ్రూప్-1 పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఎంపికైన 562 మందికి సెప్టెంబరు 27న సీఎం రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందించారు. వారికి కేటాయించిన శాఖలకు సంబంధించిన శిక్షణ కూడా ప్రారంభమైంది. ఎక్సైజ్ శాఖకు కేటాయించినవారికి ఎక్సైజ్ అకాడమీలో, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు ఎంపికైనవారికి మాసబ్‌ట్యాంక్‌లోని ఎంఏయూడీ కార్యాలయంలో, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ తదితర శాఖల వారికి ఆయా అకాడమీల్లో శిక్షణ కొనసాగుతోంది.
అయితే గతానికి భిన్నంగా అధికారులు ఈసారి శిక్షణ ప్రణాళిక అంతా ఇంగ్లిషులోనే రూపొందించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి శిక్షణలు అంతా తెలుగులోనే జరిగేవి. కానీ ఇప్పుడు శిక్షణ ఇంగ్లిషులోనే కొనసాగుతోంది. శిక్షణ ఇస్తున్న నిపుణులు తెలుగులో మాట్లాడితే.. అలా వద్దని, ఇంగ్లిషులోనే కొనసాగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. తరగతుల్లో ప్రశ్నలు తెలుగులో అడిగినా సమాధానం ఇంగ్లిషులో ఇస్తున్నారని శిక్షకులు చెబుతున్నారు. చాలా మంది ఇంగ్లిషు మీడియం వారే కావడంతో.. కనీసం తెలుగులో మాట్లాడేందుకూ ఇష్టపడటం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వారు అధికారులుగా బాధ్యతలు చేపట్టాక.. పాలన వ్యవహారాల్లో తెలుగుకు ఎలా న్యాయం చేస్తారు? ప్రజల నుంచి తెలుగులో దరఖాస్తు వస్తే వారు కనీసం చదివి సరిగా అర్థం చేసుకుంటారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలుగుకు ఎందుకీ దుస్థితి?
గతంలో ప్రిలిమ్స్, మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి గ్రూప్-1 పోస్టుల భర్తీ చేపట్టేవారు. ఇంటర్వ్యూలో అభ్యర్థిని తెలుగులో ప్రశ్నలు అడిగి, వారి భాష నైపుణ్యాలను కూడా గుర్తించేవారు. కానీ ఈసారి ఇంటర్వ్యూ రద్దు చేశారు. మెయిన్స్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు. ఆంగ్ల మాధ్యమం వారు 12,381 మంది, తెలుగు మాధ్యమం వారు 8,694 మెయిన్స్ రాయగా.. ఆంగ్ల మాధ్యమం వారికి 506 ఉద్యోగాలు (90శాతం), తెలుగు మాధ్యమం వారికి 56 ఉద్యోగాలు (10ఽఽశాతం) వచ్చాయి. ఈ క్రమంలో గ్రూప్-1 ఎంపికలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందనే ఆందోళన వ్యక్తమైంది. అలాంటిది ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఇస్తున్న శిక్షణలోనూ తెలుగు దూరమవుతోంది.
తెలుగు ప్రావీణ్యం తప్పనిసరి చేయాలి..
గ్రూప్-1 శిక్షణ పొందుతున్న మొత్తం 563 మంది అధికారుల్లో.. ఎంత మందికి మాతృభాషలో ప్రావీణ్యం ఉందన్న విషయంపై ఉన్నతాధికారులకే స్పష్టత లేదు. ఆ విషయాన్ని గుర్తించే ప్రయత్నమూ జరగలేదు. నిజానికి గ్రూప్-1 అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వారికి తెలుగు రావడం చాలా అవసరం. కానీ తెలుగు మాధ్యమంలో చదవని, తెలుగులో మాట్లాడటానికి ఇష్టపడని అధికారులు.. ప్రజలకు ఎలా న్యాయం చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశంలో నిపుణులు ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు. ఏదైనా రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్, ఐిపీఎస్, ఐఎ్‌ఫఎస్ వంటి సివిల్ సర్వీస్ అధికారులు.. ఆ రాష్ట్ర స్థానిక భాష నేర్చుకోవడం తప్పనిసరి. అంటే తెలంగాణ, ఏపీలకు వచ్చే ఇతర రాష్ట్రాలు, భాషల అధికారులు.. రెండేళ్లలో తెలుగు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్చుకోవాల్సిందే. దీనిపై వారికి పరీక్ష కూడా నిర్వహిస్తారు. అందులో విఫలమైతే పదోన్నతులు నిలిపేస్తారు. దీనితో ఆయా అధికారులు తెలుగు నేర్చుకుంటారు. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు జయేశ్ రంజన్ (ఉత్తరప్రదేశ్), యోగితారాణా (జమ్మూకశ్మీర్), నవీన్ మిట్టల్ (పంజాబ్) ఇతర భాషలకు చెందినవారైనా.. తెలుగుపై పట్టు సాధించారు. పాలనలో తెలుగు వినియోగం పెంచేందుకు జయేశ్ రంజన్ తెలుగు సాఫ్ట్‌వేర్, తెలుగు వికీపీడియా వంటి నిర్ణయాలు అమలుచేశారు. ఇలా ఇతర రాష్ట్రాల సివిల్ సర్వెంట్లు తెలుగుపై మక్కువ చూపిస్తుంటే.. తెలుగు రాష్ట్రంలో పుట్టి, పెరిగిన గ్రూప్-1 అధికారులు తెలుగుపై అనాసక్తి చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల తరహాలో గ్రూప్-1 శిక్షణలో ఉన్నవారికీ తెలుగులో శిక్షణ ఇవ్వాలని, తప్పనిసరి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.