kumaram bheem asifabad- ఆశావహుల్లో నైరాశ్యం
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:19 PM
స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ఆశావహుల్లో నైరాశ్యం నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా పిటిషన్ కొట్టి వేస్తూ పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని పేర్కొనడంతో ఆశావహుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఎన్నికల మాటమో కానీ, ఇది వరకు ఖరారైన రిజర్వేషన్లు ఉంటాయా
- గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణం
ఆసిఫాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ఆశావహుల్లో నైరాశ్యం నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా పిటిషన్ కొట్టి వేస్తూ పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని పేర్కొనడంతో ఆశావహుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఎన్నికల మాటమో కానీ, ఇది వరకు ఖరారైన రిజర్వేషన్లు ఉంటాయా..? లేక మారుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమైంది. జిల్లాలో 335 పంచాయతీలు, 15 జడ్పీటీసీ స్థానాలు,127 ఎంపీటీసీ స్థానాలు, 2874 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడం ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేయ డంతో స్థానిక ఎన్నికలు జరుగడం ఖాయమని అందరు భావించారు. కానీ ఊహించని విధంగా హైకోర్టు స్తానిక ఎన్నికలపై స్టే విధించడంతో అందరి అంచనాలు తారుమార య్యాయి. రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్ కొట్టి వేస్తూ పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని సూచించడంతో నేతల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తేగాని కచ్చితంగా చెప్పలేమంటూ అధికారులు పేర్కొనడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్న ఆశావహ నేతలు అయోమయానికి గురవుతున్నారు.
- కలిసి వచ్చిన వర్గాల్లో..
స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు కలిసి వచ్చిన వర్గాల్లో కొంత ఆనందం వ్యక్తమైనా అంతలోనే ఆవిరై పోయింది. షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికలకు సిద్ధమైన ఆశావహ నేతలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. తిరిగి ఎన్నికలను నిర్వహిస్తే రిజర్వేషన్లు మళ్లీ కలిసి వస్తాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లపై గ్రామాల్లో వివిధ రకాల ప్రచారం జరుగడంతో ఆశావహ నేతలు అయోమయానికి గురవుతున్నారు. ఏ నలుగురు కలిసినా రిజర్వేషన్లపైనే మాట్లాడుకోవడం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆశావహ నేతలంతా అధికారులకు ఫోన్లు చేస్తూ మరి రిజర్వేషన్లపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేంత వరకు రిజర్వేషన్లపై ఇప్పడే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు.
- మద్దతు ఉంటుందని..
స్థానిక ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల కావడంతో అధిష్ఠానం ఆశీస్సులు తమకు ఉంటాయని భావించిన గ్రామాల్లో ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ ఆశావహులు ప్రజలు మద్దతు కూడగట్టుకునేందుకు విందులు ప్రారంభించారు. ఈ క్రమంలోనే మందు, విందు పార్టీలను సైతం నిర్వహించారు. ప్రధానంగా దసరా పండగ రోజు ముఖ్య అనుచరులకు ప్రత్యేకంగా దావతలును ఏర్పాటు చేశారు. అప్పు చేసి ఎన్నికలకు అవసరమైన నిధులను సమకూర్చుకున్నారు. అలాగే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో హామిలను కూడా ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి నుంచి రిజర్వేషన్లపై అనుమానాలే వ్యక్తమైన చివరికి ఆనుకున్న విధంగానే ఎన్నికలు వాయి దా పడ్డాయి. దీంతో తొందర పడి రూ.లక్షలు ఖర్చు చేశామంటూ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మళ్లీ రిజర్వేషన్ కలిసి వస్తుందో రాదోనన్న ఆలోచనలో పడ్డారు. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలను నిర్వహిస్తే రిజర్వేషన్ల మార్పునకు అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.