Supreme Court Declines: గ్రూప్ 1పై జోక్యం చేసుకోలేం
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:53 AM
గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ తోపాటు రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది...
అభ్యంతరాలుంటే హైకోర్టునే ఆశ్రయించండి
నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ, హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 పరీక్షలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)తోపాటు రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన అప్పీళ్లపై హైకోర్టులో ఈ నెల 15వ తేదీనే విచారణ ఉన్నదని.. ఈ స్థితిలో జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగానే నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించలేదని, సమగ్రతను పాటించలేదని, మూల్యాంకనంలో తప్పులు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా... హైకోర్టు సింగిల్ జడ్జి వారికి అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. టీజీపీఎస్సీ ఆ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధిస్తూ.. సెప్టెంబరు 24న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి, తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అదేరోజు రాత్రి టీజీపీఎస్సీ తుది ఫలితాలు విడుదల చేసింది. మరుసటి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 562 మంది గ్రూప్-1 అధికారులకు నియమాక పత్రాలు అందించారు. అయితే.. డివిజన్ బెంచ్ ఉత్తర్వులను చింతలపాటి ఉపేందర్ సహా మరికొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కె.పరమేశ్వర్, పీఎస్ పట్వాలియా, తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ దేవిన సెహగల్, న్యాయవాది శ్రీకాంత్ వర్మ హాజరయ్యారు. ఇరువర్గాల వాదనల విన్న ధర్మాసనం.. ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేస్తూ పిటిషన్లను కొట్టివేసింది. ఈ అప్పీళ్లకు ప్రాధాన్యమిచ్చి, వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని హైకోర్టుకు సూచించింది. హైకోర్టులో వీటిపై త్వరగా విచారణ పూర్తయ్యేందుకు ఇరుపక్షాలూ పూర్తి సహకారం అందించాలని ఆదేశించింది. కాగా.. సుప్రీం తీర్పుపై టీజీపీఎస్సీ హర్షం వ్యక్తం చేసింది. గ్రూప్-1తోపాటు అన్ని పరీక్షలూ అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర్వులు అందుకుని శిక్షణలో ఉన్న గ్రూప్-1 అధికారులు సైతం ఈ తీర్పు పట్ల హర్షం వెలిబుచ్చారు.