Share News

Telangana Assembly Speaker: దసరా నాటికి ప్రత్యక్ష విచారణ!

ABN , Publish Date - Sep 20 , 2025 | 04:47 AM

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై విచారణను శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ వేగవంతం చేశారు. పార్టీ ఫిరాయించారంటూ ఫిర్యాదులు వచ్చిన ఎనిమిది మంది...

Telangana Assembly Speaker: దసరా నాటికి ప్రత్యక్ష విచారణ!

  • ఫిరాయింపు ఎమ్మెల్యేలకుమరోసారి స్పీకర్‌ నోటీసులు

  • వారంలోగా అఫిడవిట్‌ రూపంలోవివరణ ఇవ్వాలని ఆదేశం

  • ఇరువైపుల నుంచి అఫిడవిట్లు అందగానే విచారణ ప్రారంభించాలని నిర్ణయం

హైదరాబాద్‌,, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై విచారణను శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ వేగవంతం చేశారు. పార్టీ ఫిరాయించారంటూ ఫిర్యాదులు వచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. వారిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదులు, అందించిన ఆధారాలను కూడా ఈ నోటీసులకు జత చేశారు. వారం రోజుల్లో అఫిడవిట్ల రూపంలో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ ఇప్పటికే నోటీసులు జారీచేశారు. మూడు రోజుల్లో అఫిడవిట్‌ రూపంలో వాదనలు సమర్పించాలని సూచించారు. ఈ క్రమంలో ఇరువైపుల నుంచి అఫిడవిట్లు అందగానే ముఖాముఖి విచారణ ప్రారంభించాలని స్పీకర్‌ నిర్ణయించారని.. దసరా నాటికి ప్రత్యక్ష విచారణ చేపడతారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తాజాగా స్పీకర్‌ నోటీసులు పంపిన ఎనిమిది మందిలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు ఉన్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి తొలి నోటీసులపైనే ఇంకా స్పందించకపోవడంతో.. రెండో నోటీసులు ఇవ్వలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అక్టోబరు 30 నాటికి ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఆ లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పీకర్‌ భావిస్తున్నట్టు సమాచారం.

Updated Date - Sep 20 , 2025 | 04:47 AM