Chief Commissioner of Land Administration: ప్రభుత్వ భూములకు జీఐఎస్ ఆధారిత డిజిటల్ రికార్డులు
ABN , Publish Date - Oct 29 , 2025 | 04:53 AM
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భూములకు మూడు నెలల్లో జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) ఆధారిత డిజిటల్ రికార్డులను సిద్ధం చేయాలని అధికారులను భూపరిపాలన ప్రధాన కమిషనర్...
ప్రభుత్వ భూములపై జీఐఎస్ ఫోకస్
కోటికిపైగా ఎకరాలకు డిజిటల్ రికార్డులు
శాటిలైట్, డ్రోన్ వినియోగంతో భూమి ఆకృతి, విస్తీర్ణంపై స్పష్టత
మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు సీసీఎల్‌ఏ లోకేశ్‌కుమార్ ఆదేశం
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భూములకు మూడు నెలల్లో జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) ఆధారిత డిజిటల్ రికార్డులను సిద్ధం చేయాలని అధికారులను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) డీఎస్ లోకేశ్‌కుమార్ ఆదేశించారు. అన్ని జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి.. వాటి సరిహద్దులు, కో-ఆర్డినేట్స్‌తో మ్యాప్‌లను రూపొందించి, డిజిటలైజ్ చేయాలని ఇటీవల అదనపు కలెక్టర్ల (రెవెన్యూ)తో జరిగిన సమీక్షలో సూచించారు. ఇప్పటికే యాదాద్రి జిల్లాలో దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించగా.. మిగతా జిల్లాల్లో కార్యచరణ ప్రారంభించారు. ప్రతి సోమవారం ఈ అంశంపై రెవెన్యూ కార్యదర్శి సమీక్షించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ, వక్ఫ్, అటవీ భూములను విభాగాల వారీగా గుర్తించి.. వాటికి సంబంధించిన రికార్డులన్నీ డిజిటలైజ్ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,39,485 భాగాలుగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. మొత్తంగా 1.09 కోట్ల ఎకరాల మేర భూమి ఉన్నట్టు రెవెన్యూ శాఖ గుర్తించింది. జీఐఎస్ ఆధారిత రికార్డులలో భూమి వివరాలు, సర్వే నంబర్లు, సరిహద్దుల వివరాలు, వాటి యాజమాన్య వివరాలన్నీ డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. శాటిలైట్, డ్రోన్లతో ప్రతి ఎకరానికి సంబంధించి సర్వే మ్యాప్‌లను డిజిటలైజ్ చేయడం, ప్రతి సర్వే నంబరు హద్దుల కో-ఆర్డినేట్స్‌ను సేకరించి డిజిటలైజ్ చేయనున్నారు. దీనితో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య, రైతులకు, అటవీ శాఖకు ఉండే వివాదాలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్ వివరాలను వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ భూములు 1,52,95,077 ఎకరాలు, పాస్ పుస్తకం లేని సాగు భూము లు 18,29,133ఎకరాలు, నాలా భూములు 2,75,392 ఎకరాలు, ప్రభుత్వ భూములు 1.09కోట్ల ఎకరాలు ఉన్నాయి.