Share News

Digital Bomb in Children: చిన్నారుల చేతిలో డిజిటల్‌ బాంబు

ABN , Publish Date - Dec 29 , 2025 | 01:25 AM

స్మార్ట్‌ఫోన్‌ మన పిల్లల భవిష్యత్తును బుగ్గిపాలు చేసే ‘డిజిటల్‌ బాంబు’లా మారిందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

Digital Bomb in Children: చిన్నారుల చేతిలో డిజిటల్‌ బాంబు

  • పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్‌ బానిసత్వం.. ప్రతి ఇద్దరిలో ఒకరు ఫోన్‌ వ్యసనపరులే

  • 49ు పిల్లలు రోజుకు 3 గంటలు ఇంటర్నెట్‌లోనే

  • ‘లోకల్‌ సర్కిల్స్‌’ షాకింగ్‌ సర్వే

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌ఫోన్‌ మన పిల్లల భవిష్యత్తును బుగ్గిపాలు చేసే ‘డిజిటల్‌ బాంబు’లా మారిందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. విద్యార్థి దశలోని బాలబాలికలు డిజిటల్‌ పరికరాలపై గంటలకొద్దీ గడుపుతున్నారు. ఫోన్‌ లేనిదే ముద్ద దిగని పరిస్థితి నుంచి, ఏకంగా రోజుకు 6గంటలు స్ర్కీన్లకే అతుక్కుపోయే ప్రమాదకరస్థాయికి ఈ వ్యసనం చేరుకుంది. తాజా అధ్యయనం ప్రకారం, ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు డిజిటల్‌ స్ర్కీన్‌కు బానిసగా మారిపోయినట్లు వెల్లడైంది. లోకల్‌ సర్కిల్స్‌ దేశవ్యాప్తంగా 302 జిల్లాల్లోని సుమారు 57వేల మంది తల్లిదండ్రులపై నిర్వహించిన సర్వేలో ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 47 శాతం మంది టైర్‌-1 పట్టణాలకు చెందిన వారు కాగా, 31 శాతం మంది టైర్‌-2, మిగిలిన 22 శాతం మంది టైర్‌3, 4 ప్రాంతాలకు చెందిన వారున్నారు. వీరందరికీ పాఠశాలకు వెళ్లే పిల్లలున్నారు. లోకల్‌ సర్కిల్స్‌ అధ్యయనం ప్రకారం 9 నుంచి 17 ఏళ్ల పిల్లల్లో దాదాపు 49 శాతం మంది కనీసం 3 గంటలకు పైగా ఇంటర్నెట్‌లోనే గడుపుతున్నారు. ఇందులో ఇంకా విస్తుగొలిపే విషయం ఏంటంటే.. 22 శాతం మంది ఏకంగా 6 గంటలకుపైగా ఫోన్లకే అతుక్కుపోతున్నారు. మరో 22 శాతం మంది పిల్లలు రోజుకు సగటున 1-3 గంటల పాటు, ఇంకో 6 శాతం మంది కనీసం గంట పాటు సోషల్‌ మీడియాను చూస్తున్నారు. 70ు మంది యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు, 64ు మంది సోషల్‌ మీడియా, హింసాత్మక ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలయ్యారు.

పిల్లల ప్రవర్తనలో పెను మార్పులు

ఫోన్ల వాడకం వల్ల తమ పిల్లల్లో వస్తున్న మార్పులను చూసి 61ు మంది తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 58ు మంది పిల్లల్లో విపరీతమైన కోపం, అరుపులు, వస్తువులు విసిరేయడం వంటి లక్షణాలను గుర్తించారు. 61ు మందిలో.. దేనికి ఓపిక ఉండకపోవడం, చిన్న విషయాలకే చిరాకు పడటం, చదువుపై ఏకాగ్రత కుదరకపోవడం గమనించారు. కదలకుండా ఒకేచోట కూర్చోవడం వల్ల 47ుపిల్లలు బద్ధకస్తులుగా మారుతున్నారు. మానసిక ఆందోళన, ఒంటరిగా ఉండాలని కోరుకోవడం, నిరాశకు లోనవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. కేవలం 21 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలకు ఇలాంటి వ్యసనాలు లేవని ధీమా వ్యక్తం చేశారు. పిల్లలను ఈ డిజిటల్‌ ఊబి నుంచి ఎలా బయటపడేయాలంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ మాత్రమే సరిపోదని, టెక్నాలజీ కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని మెజార్టీ తల్లిదండ్రులు కోరుతున్నారు. కొత్తగా వస్తున్న డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌(డీపీడీపీ) చట్టం ద్వారా పిల్లల సోషల్‌ మీడియా ఖాతాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని, వయస్సు నిర్థారణ ప్రక్రియను కఠినతరం చేయాలని భావిస్తున్నారు. పిల్లలు సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఖాతాలను తెరిచేటప్పుడు వయసు నిర్ధారించే ప్రక్రియను అత్యంత కఠినతరం చేయాలని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.


నిపుణులేమంటున్నారంటే..

డిజిటల్‌ గ్యాడ్జెట్స్‌కు తీవ్ర బానిసలైతే.. దాన్నుంచి బయటపడలేక పిల్లలు ఆత్మహత్యయత్నాలకు ప్రయత్నించే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని, లేదంటే రేపటి తరం మానసిక వ్యాధులతో కునారిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పిల్లల వయసును బట్టి స్ర్కీన్‌ టైం ఉండాలని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్‌ సిఫారసు చేస్తోంది. రెండేళ్లలోపు చిన్నారులకు ఫోన్‌ అస్సలు చూపించొద్దని.. 2-5 ఐదేళ్ల మధ్య వయసు పిల్లలకు విద్యా సంబంధిత విషయాలపై రోజుకు గంట మాత్రమే అనుమతించాలని పేర్కొంది. 5 నుంచి 10ఏళ్లు పైబడిన పిల్లలకు వారి శారీరక శ్రమ, నిద్ర , చదువుకు భంగం కలగకుండా గరిష్ఠంగా 2 గంటలు చూడొచ్చు.

మెటాబాలిక్‌ సిండ్రోమ్‌కు గురయ్యే ప్రమాదం

‘‘రెండేళ్లలోపు పిల్లల్లో మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో ఫోన్‌ ఇవ్వడం వల్ల వారి ఆలోచన శక్తి మందగిస్తుంది. ఇది వర్చువల్‌ ఆటిజానికి దారితీస్త్తోంది. స్పీచ్‌ డీలే, దృష్టి సమస్యలతో పాటు బ్రెయిన్‌ డెవలె్‌పమెంట్‌ ఆగిపోతుంది. డిజిటల్‌ స్ర్కీన్స్‌తో రెండు రకాల ప్రమాదాలను పిల్లలు ఎదుర్కొంటున్నారు. ఒకటి కంటెంట్‌తో ప్రమాదం. కాగా, రెండోది సామాజిక సంబంధాలపై ప్రభావం చూపుతుంది.

- డాక్టర్‌ ఉషారాణి, పీడియాట్రీషియన్‌, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ బోధనాస్పత్రి, నాగర్‌ కర్నూల్‌

Updated Date - Dec 29 , 2025 | 01:25 AM