Teacher Suicide: గురుకులంలో బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:28 AM
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిఽధిలోని ఓ గురుకుల పాఠశాలలో ఘోరం వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలుడిపై ఓ ఉపాధ్యాయుడు ...
మూడేళ్లుగా ఘోరం.. ఖమ్మం జిల్లాలో ఘటన
పోక్సో కేసు నమోదు.. నిందితుడి ఆత్మహత్య
కొణిజర్ల / మధిర రూరల్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిఽధిలోని ఓ గురుకుల పాఠశాలలో ఘోరం వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలుడిపై ఓ ఉపాధ్యాయుడు మూడేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొణిజర్ల ఎస్సై సూరజ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఓ గురుకుల పాఠశాలలో మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన అరిగెల ప్రభాకర్‌రావు(46) ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అక్కడ తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై ప్రభాకర్‌రావు మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. తొలుత ఇంట్లో చెప్పేందుకు భయపడిన ఆ బాలుడు ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లాడు. అనంతరం గురుకులానికి వెళ్లడానికి ఇష్టపడలేదు. తల్లిదండ్రులు అనేకమార్లు అడగగా ఉపాధ్యాయుడు తన పట్ల పాల్పడుతున్న ఘోరాన్ని వివరించాడు. ఈ ఘటనపై బాలుడి తండ్రి ఆదివారం రాత్రి కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ప్రభాకర్‌రావుపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభాకర్‌రావును ప్రిన్సిపల్ మందలించారని, దీంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడని తెలిసింది. కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న ప్రభాకర్‌రావు.. ఆదివారం రాత్రి స్వగ్రామంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద పురుగులమందు తాగాడు. ఇంటికి ఫోన్ చేసి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. కుటుంబసభ్యులు అతడిని మధిరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు.