Share News

Healthcare Corruption: బ్లాక్‌లిస్టు ఏజెన్సీకి డయాలసిస్‌ టెండరు

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:35 AM

రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో డయాలసిస్‌ సేవలందిస్తు న్న ఏజెన్సీల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి...

Healthcare Corruption: బ్లాక్‌లిస్టు ఏజెన్సీకి  డయాలసిస్‌ టెండరు

  • తప్పుడు ధ్రువపత్రంతో దొరికిపోయిన ఏజెన్సీ.. ఐదేళ్ల పాటు నిషేధించిన ఢిల్లీ ప్రభుత్వం

  • సర్కారీ టెండర్లలో పాల్గొనాలంటే నిషేధిత జాబితాలో ఉండొద్దు

  • అయినా రాష్ట్రంలో ఆ ఏజెన్సీకి కాంట్రాక్టు

  • వైద్యశాఖ ఉన్నతాధికారులు కుమ్మక్కు

  • వెలుగులోకి వస్తున్న అక్రమాలు

హైదరాబాద్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో డయాలసిస్‌ సేవలందిస్తు న్న ఏజెన్సీల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మూడు ఏజెన్సీలు కిడ్నీ బాధితులకు రక్తశుద్ధి సేవలందిస్తున్నాయి. ఇందులో ఒక ఏజెన్సీ ఎంపికలో నిబంధనలను ఉల్లంఘించిన ట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాల ద్వారా తెలిసింది. బ్లాక్‌లిస్టులో ఉన్న సదరు ఏజెన్సీకి తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ (టీజీఎంఎ్‌సఐడీసీ) కాంట్రాక్టు కట్టబెట్టింది. 2022లో ఇది జరిగింది. ఈ విషయం నాటి ఆరోగ్యశ్రీ, టీజీఎంఎ్‌సఐడీసీ అధికారులకు తెలిసినా కాసుల కోసం కక్కుర్తిపడి టెండర్ల ప్రక్రియలో సదరు సంస్థ పాల్గొనేలా చూసుకున్నారు. నిబంధనల మేరకు ప్రభుత్వం పిలి చే ఏ టెండర్‌లోనైనా పాల్గొనే ఏజెన్సీలు బ్లాక్‌లిస్టులో ఉండకూడదు. ఏదైనా ఏజెన్సీని బ్లాక్‌లిస్టులో పెడితే నిషేధ కాలం ముగిసేవరకు ఆ ఏజెన్సీ ఏ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనకూడదనే నిబంధన ఉంది. దీన్ని తెలంగాణ వైద్యారోగ్య శాఖ తుంగలోకి తొక్కి సదరు సంస్థకు డయాలసిస్‌ బాధ్యతలను అప్పగించింది.


బ్లాక్‌లిస్టులో ఎందుకు పెట్టారంటే..

ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ సేవలు అందించేందుకు 2022లో పిలిచిన టెండర్‌ ప్రక్రియలో ఆ ఏజెన్సీ పాల్గొంది. టెండర్‌ నిబంధనల ప్రకారం బిడ్డర్లు తప్పనిసరిగా సంబంధిత అధికారు ల సంతకంతో పనితీరు ధ్రువపత్రం సమర్పించాలి. అయితే ఆ ఏజెన్సీ ఫోర్జరీ ధ్రువపత్రం సమర్పించింది. దానిలో ఫైల్‌, డిస్పాచ్‌ నంబర్లు, జారీ చేసిన అధికారి పేరు లేదు. దీనిపై ఢిల్లీ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) అనుమానం వ్యక్తం చేసింది. వెంటనే ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్య శాఖకు లేఖ రాసి, ఆ సర్టిఫికెట్‌ ప్రామాణికతను పరిశీలించింది. యూపీ అధికారుల విచారణలో ఆ ధ్రువపత్రం నకిలీదని తేలింది. అది తమ జాయింట్‌ డైరెక్టర్‌ (మెడికల్‌ కేర్‌) కార్యాలయం నుంచి ఇవ్వలేదని తెలిపింది. దీంతో ఢిల్లీ డీజీహెచ్‌ఎ్‌స ఆ ఏజెన్సీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. దానికి ఆ సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగాను, ఆమోదయోగ్యంగానూ లేదని ఢిల్లీ డీజీహెచ్‌ఎస్‌ పేర్కొంది. దీంతో ఐదేళ్ల పాటు ఆ ఏజెన్సీని బ్లాక్‌ లిస్టులో పెడుతున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని కాపీని దేశంలోని ఇతర రాష్ట్రాలకు పంపింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ వ్యవహారమంతా తెలిసి కూడా సదరు ఏజెన్సీని టెండరులో పాల్గొనేలా చేసి, కాంట్రాక్టు కట్టబెట్టారు.

అంతా పైవాళ్లే చూస్తారు!

రాష్ట్రంలో 98 డయాలసిస్‌ కేంద్రాలు ఉండగా, మూడు ఏజెన్సీలకు వాటి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఒక సంస్థకు 28, మరోదానికి 43, మూడో ఏజెన్సీకి 27 కేంద్రాలను అప్పగించారు. ఈ కేంద్రాలపై సరైన పర్యవేక్షణ ఉండటం లేదు. జిల్లా సమన్వయకర్తలు (డీసీలు), జిల్లా మేనేజర్ల (డీఎం లు) పరిధిలోని టీమ్‌ లీడర్లు ఈ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించి.. నివేదికలు పంపాలి. ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో రాష్ట్రస్థాయి జనరల్‌ మేనేజర్‌ దీన్ని పర్యవేక్షించాలి. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నట్లు క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ కేంద్రాల పరిశీలన, తనిఖీలు జిల్లాస్థాయిలో పనిచేసేవారికి బదులు ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లే చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన కార్యాలయం నుంచే డయాలసిస్‌ కేంద్రాల తనిఖీలకు వెళ్లి నివేదికలు ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. డయాలసిస్‌ సాఫ్ట్‌వేర్‌ అంశాలతో పాటు ఇతర వ్యవహారాలనూ ఆరోగ్యశ్రీలో డిప్యుటేషన్‌పై వచ్చిన ఓ అధికారే పర్యవేక్షిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్లకు పైగా సదరు అధికారి పాతుకుపోయి, అక్కడ మొత్తం వ్యవస్థను శాసిస్తున్నట్లు ఆరోగ్యశ్రీ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఎన్ని తీవ్ర ఆరోపణలు వచ్చినా తన పలుకుబడితో ఆరోగ్యశ్రీ ట్రస్టును ఏలుతున్నారని అంటున్నారు. ఎంతమంది సీఇవోలు మారినా సదరు అధికారిని మాత్రం కదపలేకపోయారని చెబుతున్నారు.

Updated Date - Nov 27 , 2025 | 04:35 AM