Share News

Health Care: రక్తశుద్ధికి వెళితే కొత్త రోగాలు

ABN , Publish Date - Oct 13 , 2025 | 08:14 AM

మూత్రపిండాల వ్యాధి బారిన పడి.. డయాలసిస్‌ కోసం ప్రభుత్వ రక్తశుద్ధి కేంద్రాలకు వెళ్తున్న రోగులు కొత్త రోగాల బారిన పడుతున్నారు.

Health Care: రక్తశుద్ధికి వెళితే కొత్త రోగాలు

  • డెత్‌బెడ్స్‌గా డయాలసిస్‌ కేంద్రాలు?

  • గత నెలలో మణుగూరులో ఓ రోగికి హెచ్‌ఐవీ

  • హాట్‌ డిస్‌ ఇన్ఫెక్షన్‌ చేయని రక్తశుద్ధి కేంద్రాలు

  • 3 నెలలకోసారి జరగని వైరల్‌ మార్క్‌ టెస్టులు

  • కొన్ని చోట్ల రెండుసార్లు డయలైజర్ల వాడకం

  • షిప్టుల కోసం రోగుల నుంచి డబ్బులు వసూలు

  • పర్యవేక్షణ కొరవడినందునే ఈ పరిస్థితి!

హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): మూత్రపిండాల వ్యాధి బారిన పడి.. డయాలసిస్‌ కోసం ప్రభుత్వ రక్తశుద్ధి కేంద్రాలకు వెళ్తున్న రోగులు కొత్త రోగాల బారిన పడుతున్నారు. రక్తశుద్ధి కోసం వెళితే డెత్‌బెడ్‌ ఎక్కాల్సిన పరిస్థితి ఎదురవుతోందని వారు ఆందోళన చెందుతున్నారు. సర్కారీ డయాలసిస్‌ కేంద్రాల్లో సరైన హాట్‌ డిస్‌ఇన్ఫెక్షన్‌ చేయడం లేదని, దాంతో కిడ్నీ రోగులు హెచ్‌ఐవీ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని అంటున్నారు. గత నెలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని డయాలసిస్‌ కేంద్రానికి రక్తశుద్ధి కోసం వెళ్లిన ఓ 60 ఏళ్ల వ్యక్తికి రక్తపరీక్షల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. గతంలో కూడా డయాలసిస్‌ కారణంగా ఇతర జబ్బుల బారిన పడిన బాధితులు ఉన్నట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. రక్తశుద్ధి కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ నుంచి సరైన పర్యవేక్షణ ఉండటం లేదని, అందుకే నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలను 2014-15లో ప్రారంభించారు. నాడు 5,476 మంది కిడ్నీ ఫెయుల్యూర్‌ బాధితులకు రక్తశుద్ధి చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 102 డయాలసిస్‌ కేంద్రాలున్నాయి. వాటిలో 14,156 మంది డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. వీటన్నింటినీ హబ్‌ అండ్‌ స్పోక్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రులు నోడల్‌ సెంటర్లుగా, డయాలసిస్‌ కేంద్రాలు స్పోక్‌ పద్ధతిలో పని చేస్తున్నాయి. గతేడాది డయాలసిస్‌ కేంద్రాల్లో నెలకు సగటున 93,015 సైకిల్స్‌ డయాలసిస్‌ చేశారు. 2014-2025 మధ్య కాలంలో మొత్తం 76లక్షల 25 వేల డయాలసిస్‌ సెషన్స్‌ జరిగాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.1090 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రస్తుతం మూడు ప్రైవేటు కంపెనీలు డయాలసిస్‌ నిర్వహణను పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో చేస్తున్నాయి. సింగిల్‌ డయలైజర్‌ వాడకం పద్ధతిలో ఒక్కో డయాలసి్‌సకు సర్కారు రూ.1950 చొప్పున నిర్వహణ కంపెనీలకు చెల్లిస్తోంది.


హాట్‌ డిస్‌ఇన్ఫెక్షన్‌ చేయని కేంద్రాలు?

డయాలసిస్‌ కేంద్రాల్లో కిడ్నీ రోగులు డయాలసిస్‌ చేయించుకున్న తర్వాత తదుపరి రోగికి రక్తశుద్ది చేయాలంటే కొంత విరామం ఇవ్వాలి. డయాలసిస్‌ చేసిన వెంటనే కనీసం అరగంటపాటు హాట్‌ డిస్‌ఇన్ఫెక్షన్‌ చేయాలి. అంటే ఒక రోగికి వాడిన బ్లడ్‌ ట్యూబ్‌లతోపాటు డయాలసిస్‌ మెషిన్లను శుభ్రం చేయాలి. డయాలసిస్‌ కేంద్రాల్లో 5-10 మెషిన్లు ఉంటున్నాయి. కొన్ని కేంద్రాల్లో విపరీతమైన రద్దీ ఉంటుండడంతో డీప్‌ క్లీనింగ్‌ చేసేంత సమయం ఉండటం లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కొన్ని కేంద్రాల్లో అసలు హాట్‌ డిస్‌ఇన్ఫెక్షనే జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. డిస్‌ఇన్ఫెక్షన్‌ చేస్తే తరువాత వచ్చే రోగికి ఎటువంటి ఇబ్బంది ఉండదని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. మన వద్ద హాట్‌ డిస్‌ఇన్ఫెక్షన్‌ ఎవరు చేస్తున్నారో పర్యవేక్షించే యంత్రాంగం లేదు. దీంతో కొన్నిసార్లు రోగులు ఇతర రోగాల బారిన పడుతున్నారు. అలాగే డయాలసిస్‌ రోగులకు ప్రతి మూడు నెలలకోసారి వైరల్‌ టెస్టులు విధిగా చేయాలి. ఈ వైరల్‌ మార్క్‌ టెస్టుల్లో హెచ్‌ఐవీ, హెచ్‌సీవీ, హెచ్‌బీఎ్‌సఏజీ పరీక్షలుంటాయి. ఈ టెస్టులు కూడా ఎలీసా మెథడ్‌లో చేయాలి. కానీ, చాలా డయాలసిస్‌ కేంద్రాల్లో స్ర్టిప్‌ పద్ధతిలో చేస్తున్నారని, దీంతో రక్తపరీక్షల్లో సరైన కచ్చితత్వం ఉండటం లేదని రోగులు చెబుతున్నారు. అలాగే బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ చేసుకోవాలని, అది కూడా సరిగా చేయడం లేదన్న విమర్శలున్నాయి.


ఒక్కో డయలైజర్‌ రెండు మూడుసార్లు..!

నిబంధనల మేరకు నిర్వాహకులు ప్రతి రోగికీ డయాలసిస్‌ చేసిన ప్రతిసారీ సింగిల్‌ డయలైజర్‌ వాడాలి. కానీ, కొన్ని కేంద్రాల్లో సిబ్బంది ఒక్కసారికి బదులు రెండు మూడుసార్లు డయలైజర్స్‌ను వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. లెక్కల్లో సింగిల్‌ అని చూపిస్తూ, మిగిలిన డయలైజర్స్‌ను ప్రైవేటులో అమ్ముకుంటున్నట్లు చెబుతున్నారు. కొన్ని కేంద్రాల్లో ఈ తతంగం బాహాటంగానే సాగుతున్నా.. ఆరోగ్యశ్రీ నుంచి సరైన పర్యవేక్షణ లేకుండా పోయిందని అంటున్నారు. దీనిని పర్యవేక్షించే అధికారులు నిర్వహణ కంపెనీలతో లాలూచీ పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కార్యాలయ అధికారుల అండదండలతోనే డయాలసిస్‌ నిర్వహణ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో డయాలసిస్‌ సిబ్బంది స్లాట్స్‌ విషయంలో రోగుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కేంద్రానికి ముందుగా వచ్చిన వారికి తొలుత డయాలసిస్‌ చేయకుండా.. కొందరి వద్ద డబ్బులు తీసుకొని ఇష్టారాజ్యంగా చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. అలాగే డయాలసిస్‌ చేయించుకున్న రోగులు ఇటీవలి కాలంలో ఎక్కువ మంది మరణిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కేంద్రాలను తనిఖీ చేసి లోతుగా పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.

Updated Date - Oct 13 , 2025 | 08:15 AM