Dialysis Centers: డయాలసిస్‌లో ప్రమాణాలు పాటిస్తున్నాం
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:44 AM
రాష్ట్రంలోని డయాలసిస్ కేంద్రాల్లో అత్యున్నత స్థాయి ఇన్ఫెక్షన్ నియంత్రణ, రోగి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో...
ఇన్ఫెక్షన్ నియంత్రణ అమలుపరుస్తున్నాం
రోగులకు వైరల్ మార్కర్ టెస్టులు చేస్తున్నాం
మణుగూరులో రోగులందరికీ హెచ్‌ఐవీ నెగెటివే
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఆరోగ్యశ్రీ సీఈవో వివరణ
క్షేత్రస్థాయి పరిస్థితులతో కుదరని పొంతన
డాక్టర్ పర్యవేక్షణ లేదన్నది బహిరంగ రహస్యం
ఎలీసా పద్ధతిలో జరగని వైరల్ మార్కర్ టెస్టులు
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డయాలసిస్ కేంద్రాల్లో అత్యున్నత స్థాయి ఇన్ఫెక్షన్ నియంత్రణ, రోగి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఉదయకుమార్ తెలిపారు. ప్రతి డయాలసిస్ మధ్య స్టెరిలైజేషన్ చేస్తున్నామని, రోగులందరికీ త్రైమాసిక వైరల్ మార్కర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డయాలసిస్ కేంద్రాలు నెఫ్రాలజిస్టులు, మైక్రో బయాలజిస్టుల పర్యవేక్షణలో పనిచేస్తున్నాయని, క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ‘రక్తశుద్ధికి వెళితే కొత్త రోగాలు’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై సీఈవో వివరణ ఇచ్చారు. మణుగూరు డయాలసిస్ కేంద్రంలో రక్తశుద్ధి చేయించుకుంటున్న వారికి హెచ్‌ఐవీ పరీక్షలు చేయిస్తే నెగిటివ్ వచ్చిందన్నారు. ఒక డయలైజర్‌ను ఒక్కరికే ఉపయోగిస్తున్నామని, రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎక్కడా తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఏటా 14 వేల మంది రోగులకు 11 లక్షలకు పైగా డయాలసిస్ సెషన్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆరోగ్యశ్రీ కార్యాలయం చెబుతున్నదానికి, క్షేత్రస్థాయికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. గతంలో రక్తశుద్ధి కేంద్రాల్లో ఒక ఎంబీబీఎస్ వైద్యుడు ఉండి.. రౌండ్స్ వేసేవారు. ఇప్పుడు ఒక్క డాక్టర్ కూడా లేరన్నది బహిరంగ రహస్యం. డయాలసిస్ రోగులను డాక్టరే పర్యవేక్షించాల్సి ఉండగా.. దానిని పాటించడం లేదు. గతంలో ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పర్యవేక్షించగా.. ప్రస్తుతం వారు పట్టించుకోవడం లేదు. ఇక వైరల్ మార్కర్ టెస్టులు చేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు చెబుతున్నప్పటికీ... ఎలీసా టెస్టులు చేయడం లేదు. కేవలం స్ర్టిప్ టెస్టులే చేస్తున్నారు. గతంలో డయాలసిస్ రోగుల రక్త నమూనాలను ప్రైవేటు ల్యాబ్‌లకు పంపి టెస్టులు చేసేవారు. ప్రస్తుతం అదీ జరగడం లేదు. గతంలో ఒక్కో డయాలసి్‌సకు రూ.1250 ఉండగా ప్రస్తుతం దానిని రూ.1850కి పెంచినప్పటికీ... రోగులకు టీ, బిస్కెట్స్ లాంటి సర్వీసులను నిలిపివేశారు.