Alcohol Abuse: బెల్టు షాపులు బంద్ చేస్తారా..పురుగుల మందు తాగమంటారా..
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:15 AM
సార్.. నా భర్త తప్ప తాగొచ్చి ఇష్టమొచ్చినట్లు కొడుతున్నాడు.. వెంటనే బెల్ట్ షాపులు మూయించి, మద్యపాన నిషేధం అమలు చేయండి..
మావాళ్లు మద్యానికి బానిసలవుతున్నారు
అధికారులపై ధర్మారం మహిళల ఆగ్రహం
పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన
అక్కన్నపేట, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘సార్.. నా భర్త తప్ప తాగొచ్చి ఇష్టమొచ్చినట్లు కొడుతున్నాడు.. వెంటనే బెల్ట్ షాపులు మూయించి, మద్యపాన నిషేధం అమలు చేయండి.. లేకుంటే పురుగులమందు తాగి చస్తాం’.. అంటూ మహిళలంతా ముక్తకంఠంతో అధికారులను హెచ్చరించారు. ఈ ఘటన శనివారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారం పంచాయతీ కార్యాలయం ఎదుట జరిగింది. గ్రామంలో రెండురోజుల క్రితం ఓ పార్టీ నాయకుడు మద్యం తాగి తన భార్యను దుర్భాషలాడుతూ కొట్టడంతో ఆమె గాయపడింది. దీంతో ఆగ్రహించిన మహిళలందరూ శనివారం బెల్ట్‌షాపులను మూసివేయించారు. మరోసారి వీటిని నిర్వహిస్తే మద్యంసీసాలను పగలకొడతామని హెచ్చరించారు. పంచాయతీ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. తమవాళ్లు కూలిచేసి సంపాదించినదంతా తాగుడుకు ఖర్చుచేస్తూ కుటుంబాలను అప్పులపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్‌షాపులను మూయించాలని డిమాండ్ చేశారు.