MLA Dhananjay Nagender: కాంగ్రెస్‌లోనే నేనున్నా..
ABN , Publish Date - Dec 25 , 2025 | 04:54 AM
తాను కాంగ్రె్‌సలోనే ఉన్నానని, భయపడి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు....
భయపడి అబద్ధం చెప్పే అవసరం లేదు
హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కోట్ల రూపాయల నిధులిస్తున్నారు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 220కి పైగా డివిజన్లలో గెలుస్తుంది: దానం
రాజీనామా దిశగా దానం నాగేందర్!
ఆయన ప్రకటన వెనుక మర్మం ఇదేనా?
బంజారాహిల్స్/హైదరాబాద్, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): తాను కాంగ్రె్‌సలోనే ఉన్నానని, భయపడి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నగరాభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారని, వీటిని ప్రచారం చేసేందుకు సమగ్రాభివృద్ధి పేరిట గ్రేటర్ వ్యాప్తంగా తానే స్వయంగా పర్యటనలు చేస్తానని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వస్తే 220కి పైగా డివిజన్‌లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అయన అన్నారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్‌కు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందా? బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన దానం.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానంటూ కుండబద్దలు కొట్టడం వెనుక ఉన్న మర్మం ఇదేనా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో త్వరలోనే మరో ఉప ఎన్నిక రానుందా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తి కర చర్చ ఇది. బీఆర్‌ఎస్ టికెట్‌పైన గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లపైన విచారణ ప్రారంభించిన శాసనసభ స్పీకర్.. ఆ పది మందికి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. వారిలో దానం, కడియం శ్రీహరిలు తప్పించి మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు.. తమకు జారీ అయిన నోటీసులపై స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారలేదని, బీఆర్‌ఎస్ సభ్యులుగానే ఉన్నామని అఫిడవిట్ పూర్వకంగా ఆ వివరణలో పేర్కొన్నారు. ఆ 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపైన విచారణను పూర్తి చేసిన స్పీకర్.. వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతూ తీర్పునూ ఇచ్చారు. మరో ముగ్గురిపైన ఆయన తీర్పు వెలువడాల్సి ఉంది. కాగా.. కడియం శ్రీహరీ ఇటీవల స్పీకర్‌ను కలిసి తాను బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానంటూ అఫిడవిట్ పూర్వకంగా వివరణ ఇచ్చారు. ఆయన కేసునూ స్పీకర్ విచారణకు తీసుకోవాల్సి ఉంది. అయితే దానం నాగేందర్ మాత్రం తనకు జారీ అయిన నోటీసుకు వివరణ ఇచ్చేందుకు గడువు ముగిసినా ఇంతవరకు ఎలాంటి వివరణా ఇవ్వలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫారం తీసుకుని సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ఆయన కాంగ్రెస్ టికెట్‌పైన పోటీ చేయడం ఇప్పుడు బలమైన సాక్ష్యంగా మారింది.
రాజీనామే ఉత్తమమన్న ఆలోచనలో..
మరోవైపు అనర్హత పిటిషన్లపై విచారణకు సుప్రీం కోర్టు పెట్టిన గడువూ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో విచారణను ఎదుర్కొనడం కంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే ఉత్తమమన్న ఆలోచనలో దానం నాగేందర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసిన ఆయన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని, ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రిని చేయాలని, లేదా రాజ్యసభకు పంపాలని ప్రతిపాదించినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఆ ప్రతిపాదనలపైన అధిష్ఠానం స్పందించాల్సి ఉందని చెబుతున్నారు. అయితే తాను కాంగ్రె్‌సలోనే ఉన్నానంటూ తాజాగా దానం ప్రకటనతో.. ఆయన రాజీనామా చేయనున్నట్లుగా ప్రచారం మళ్లీ జోరందుకుంది. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగా ఆయన.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. ఏప్రిల్ లేదా మే నెలలో తమిళనాడు ఎన్నికలతో పాటుగా ఖైరతాబాద్ ఉప ఎన్నికా జరగనుంది. అదే జరిగితే ఖైరతాబాద్ నుంచి దానం మళ్లీ పోటీ చేస్తారా.. లేక ఆయన ప్రతిపాదనల్లో ఒక దాన్ని అధిష్ఠానం ఆమోదించి వేరొకరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.