DGP Shivadher Reddy: ప్రతి రోడ్డు ప్రమాద మరణంపై విశ్లేషణ
ABN , Publish Date - Oct 10 , 2025 | 03:56 AM
రాష్ట్రంలో ఏటా దాదాపు 900 హత్య కేసులు నమోదవుతుంటే.. అంతకు తొమ్మిది రెట్లు ఎక్కువగా 8,000 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని..
స్టేషన్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లాలి
మరో ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలి: డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏటా దాదాపు 900 హత్య కేసులు నమోదవుతుంటే.. అంతకు తొమ్మిది రెట్లు ఎక్కువగా 8,000 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న రోడ్డు ప్రమాద కేసుల విషయంలో పోలీసులు కొత్త మార్గం అనుసరించాలని చెప్పారు. ఆయా స్టేషన్ల ఉన్నతాధికారులు ఘటన స్థలానికి వెళ్లాలని, ఆ ప్రమాదం ఎలా జరిగింది? మరణం సంభవించడానికి కారణాలేమిటి? ఎలాంటి చర్యల ద్వారా మరో ప్రాణం పోకుండా చూడవచ్చనే విశ్లేషణ చేపట్టాలని సూచించారు. నైట్ పెట్రోలింగ్, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, అవగాహనా కార్యక్రమాల నిర్వహణ, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, ప్రమాద నివారణ చర్యలు చేపట్టడంలో ప్రతి పోలీసు అధికారి నిజాయితీగా కృషి చేయాలని కోరారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గురువారం వివిధ జిల్లాల ఎస్పీలు, రేంజ్ డీఐజీలు, ఐజీలు, కమిషనర్లు, సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించి, పోలీసులకు కీలక సూచనలు చేశారు. న్యాయమైన, దృఢమైన, స్నేహపూర్వక, వృత్తిపరమైన పోలీసింగ్‌ను అనుసరించాలని పేర్కొన్నారు. ‘ప్రతి పౌరుడిని సమానంగా చూసి న్యాయాన్ని పరిరక్షించడం న్యాయపరమైన పోలీసింగ్. భయం, పక్షపాతం లేకుండా చట్టాన్ని అమలు చేసి శాంతిభద్రతలను కాపాడడం దృఢమైన పోలీసింగ్. పౌరుల్లో నమ్మకం, సానుభూతి సంపాదించుకోవడం స్నేహపూర్వక పోలీసింగ్. సమర్థత, జవాబుదారీతనంతో ఉండడం వృత్తిపరమైన పోలీసింగ్’ అని డీజీపీ వివరించారు. ఈ నాలుగు సూత్రాలు ఆధునిక పోలీసింగ్ ఆత్మను నిర్వచిస్తాయని, నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేయాలని, మానవత్వంతో, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని పోలీసులకు సూచించారు. పోలీసింగ్‌లో తెలంగాణ పోలీసులు దేశంలో మొదటి స్థానంలో ఉన్నారని, మరింత జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. వివిధ నేరాల్లో పక్కాగా చార్జిషీట్లు దాఖలు చేసి నేరస్థులకు శిక్షలు వేయించడం ద్వారా ప్రజలకు పోలీసులంటే భరోసా ఉంటుందన్నారు.