DGP Jitender Urge: కఠినమైన ఖాకీలుగానే కాదు..మానవీయ కోణంలోనూ ఆలోచించాలి!
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:18 AM
పోలీసులు కఠినమైన ఖాకీలుగానే ఉండకుండా, కొన్ని సందర్భాల్లో మానవీయ కోణంలోనూ ఆలోచించాలని డీజీపీ జితేందర్ చెప్పారు. పలు సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు..
సమస్యలతో వచ్చే వారికి పోలీసులు అండగా నిలవాలి
శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోకి తెచ్చాం
పదవీ విరమణ కార్యక్రమంలో డీజీపీ జితేందర్
తల్లిని తలుచుకొని కన్నీటి పర్యంతం
ఆయనకు పోలీసుల ఘన వీడ్కోలు
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పోలీసులు కఠినమైన ఖాకీలుగానే ఉండకుండా, కొన్ని సందర్భాల్లో మానవీయ కోణంలోనూ ఆలోచించాలని డీజీపీ జితేందర్ చెప్పారు. పలు సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు అండగా ఉండడానికి కృషి చేయాలన్నారు. 15 నెలల పాటు రాష్ట్ర డీజీపీగా పనిచేసిన జితేందర్ మంగళవారం పదవీ విరమణ చేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను కట్టడి చేశామన్నారు. సైబర్ క్రైం విభాగాన్ని బలోపేతం చేసి, సంబంధిత నేరాలకు చాలా వరకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. సమస్యను చట్టం కోణంలోనే కాకుండా కొన్ని సందర్భాల్లో మానవతా దృక్పథంలోనూ చూడాల్సిన అవసరం ఉందన్నారు. తాను 15 నెలలు డీజీపీగా పనిచేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామన్నారు. జాతీయ స్థాయిలో నేరాల శాతాన్ని తగ్గించినందుకు తెలంగాణ పోలీసులకు మంచి గుర్తింపు వచ్చిందని, ఇండియా జస్టిస్ నివేదికలోనూ మొదటి స్థానం సంపాదించడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా పోలీసులకు కుటుంబానికి దూరంగా ఉండాల్సి ఉంటుందని, తాను తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయానని అన్నారు. ఈ సందర్భంగా తల్లిని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న శివధర్‌రెడ్డి, సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం డీజీపీ కార్యాలయంలో జితేందర్‌ను పూలరథంపై ఉంచి, ఆ వాహనాన్ని పోలీసు అధికారులు లాగుతూ గేటు వరకు తీసుకొచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు.