DG Shivadhar Reddy: తెలంగాణ మావోయిస్టులు ఇంకా అడవుల్లోనే ఎందుకు?
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:38 AM
ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు మన దగ్గరకు వచ్చి లొంగిపోతుంటే.. మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఇంకా అడవుల్లోనే ఎందుకు ఉంటున్నారని డీజీపీ శివధర్‌రెడ్డి ప్రశ్నించారు.
ఇతర రాష్ట్రాల వారొచ్చి ఇక్కడ లొంగిపోతున్నారు
మన రాష్ట్రానికి చెందిన వారికి ఏమైంది?.. లొంగుబాటుకు డెడ్‌లైన్ మార్చి 31
ఆ తర్వాత పరిస్థితులిలా ఉండవు.. మావోయిస్టులకు డీజీపీ శివధర్‌రెడ్డి హెచ్చరిక
ఆయన ఎదుట లొంగిపోయిన 41 మంది.. వారిలో తెలంగాణ వారు ఇద్దరు
హైదరాబాద్, డి సెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు మన దగ్గరకు వచ్చి లొంగిపోతుంటే.. మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఇంకా అడవుల్లోనే ఎందుకు ఉంటున్నారని డీజీపీ శివధర్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస ప్యాకేజీ, లొంగుబాటుకు ఇస్తున్న సురక్షిత బాటను చూసి ఇతర రాష్ట్రాల మావోయిస్టులు ఇక్కడికొచ్చి లొంగిపోతున్నారని చెప్పారు. తెలంగాణకు చెందిన మావోయిస్టులు మాత్రం ఎందుకు జనజీవన స్రవంతిలోకి రావడం లేదని సూటిగా ప్రశ్నించారు. మావోయిస్టుల లొంగుబాటు, అరెస్టులకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాల మధ్య డెడ్‌లైన్లు వేర్వేరుగా ఉండవని డీజీపీ చెప్పారు. ఒకటే డెడ్‌లైన్ అని, అది వచ్చే ఏడాది మార్చి 31 అని స్పష్టం చేశారు. అప్పటి వరకు లొంగుబాటుకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. లేదంటే ఆ తర్వాత పరిస్ధితులు ఇప్పటిలాగా ఉండవని మావోయిస్టులను హెచ్చరించారు. శుక్రవారం 41 మంది మావోయిస్టులు, 24 ఆయుధాలు, మందుగుండు సామగ్రితో డీజీపీ కార్యాలయంలో శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపుమేరకు లొంగిపోవడానికి వస్తున్న మావోయిస్టులకు సురక్షిత మార్గం కల్పిస్తున్నామన్నారు. తమను కలవడానికి భయపడాల్సిన అవసరం లేదని, ఏ మార్గం ద్వారా వచ్చినా ఆహ్వానం పలుకుతామని చెప్పారు. శుక్రవారం లొంగిపోయిన 41 మందిలో ఇద్దరు మాత్రమే తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారున్నారని, ఇంకా 36 మంది అజ్ఞాతంలోనే ఉన్నారని తెలిపారు. వారిలో ఆరుగురే తెలంగాణ వారని, మిగతా 30 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని వివరించారు. మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన వారు ఇంకా 54 మంది పనిచేస్తున్నారని, వీరిలో ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు, నలుగురు ఏరియా కమిటీ కార్యదర్శులే తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఉన్నారని.. మిగిలిన 48 మంది ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్నారని డీజీపీ తెలిపారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన ఏడుగురిలో ఐదుగురు తెలంగాణకు చెందిన వారేనన్నారు. మరోసారి ప్రభుత్వం, పోలీసు శాఖ తరఫున వారిని లొంగిపోవాలని ఆహ్వనిస్తున్నామని చెప్పారు. భద్రతా బలగాలు నిరంతరం చేపడుతున్న కూంబింగ్ వల్ల మావోయిస్టుల నెట్‌వర్క్ దెబ్బతిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అగ్రనాయకత్వం ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న మావోయిస్టు క్యాడర్‌ను వారికి అవగాహన లేని ప్రాంతాలకు పంపిస్తోందని తెలిపారు. అలా వచ్చిన వారు ఆయుధాలతో సహా లొంగిపోవడానికి ఇష్టపడుతున్నారని డీజీపీ వివరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు తెలంగాణలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ముగ్గురు డివిజనల్ కమిటీ కార్యదర్శులు, 17 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 57 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని డీజీపీ తెలిపారు.
మావోయిస్టులు ఇచ్చిన ఆయుధాలివే..
లొంగిపోయిన మావోయిస్టులు 24 ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులకు అప్పగించారు. వీటిలో 21 ఆయుధాలు మిలటరీ, పోలీసుల వద్ద ఉండాల్సినవని, దాడుల్లో వాటిని ఎత్తుకెళ్లి ఉంటారని డీజీపీ తెలిపారు. ఆయుధాల నంబర్లను అన్ని రాష్ట్రాలకు పంపిస్తామన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు వీరే..
కొమరం భీమ్ ఆసిఫాబాద్-మంచిర్యాల డివిజనల్ కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి, పార్టీ సభ్యుడు కనికారపు ప్రభంజన్ తెలంగాణకు చెందినవారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన 11 మంది, రెండో సెంట్రల్ రీజనల్ కమిటీ 5, చెర్ల-శబరి ఏరియా కమిటీ 4, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ 5, సౌత్ బస్తర్ కమిటీ 9, దర్బా డివిజన్ 4, గంగలూరు ఏరియా కమిటీ కార్యదర్శి ఒకరు లొంగిపోయారు. వీరిలో 22 మంది మహిళలు ఉండగా.. అత్యధికులు 21 ఏళ్లలోపు వారే. లొంగిపోయిన మావోయిస్టుల మీద రూ.1.46 కోట్ల రివార్డు ఉందని డీజీపీ తెలిపారు. వారికి తక్షణ సాయం కింద రూ.25 వేలు ఇస్తున్నామని, వారితో బ్యాంకు ఖాతాలు తెరిపించిన తర్వాత రివార్డును ఖాతాల్లో వేస్తామని డీజీపీ తెలిపారు.