Share News

Medaram Ahead of Maha Jatara: ఎత్తు బెల్లం.. యాట మొక్కులు!

ABN , Publish Date - Dec 31 , 2025 | 04:36 AM

మహాజాతరకు ముందే మేడారం కిటకిటలాడుతోంది. ఎత్తు బెల్లం, ఎదుర్కోళ్లు, యాట మొక్కులను చెల్లించేందుకు భక్తులు బారులుదీరుతున్నారు.

Medaram Ahead of Maha Jatara: ఎత్తు బెల్లం.. యాట మొక్కులు!

  • మేడారంలో జాతరకు ముందే సందడి.. నిత్యం వేలాదిగా తరలి వస్తున్న భక్తులు

  • వారాంతాలు, సెలవుల్లో లక్ష మందిపైగా రాక

ములుగు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మహాజాతరకు ముందే మేడారం కిటకిటలాడుతోంది. ఎత్తు బెల్లం, ఎదుర్కోళ్లు, యాట మొక్కులను చెల్లించేందుకు భక్తులు బారులుదీరుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే సమ్మక్క, సారాలమ్మ తల్లులను దర్శించుకొనేందుకు పోటెత్తుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వచ్చే నెల 28వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు మహాజాతర జరగనున్న విషయం తెలిసిందే. అయితే, చిన్న పిల్లలు ఉన్నవారు, జాతర సమయంలో జనం రద్దీని తట్టుకోలేని వారు ముందస్తుగా వచ్చి మొక్కలు చెల్లించుకుంటున్నారు. ఎత్తుబెల్లం సమర్పించి యాట మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎప్పుడైతేనేం ఆ తల్లుల దీవెన ఉంటే చాలని తరలివస్తున్నారు.

పసుపు-కుంకుమలే ప్రతిరూపాలు

గిరిజనులు.. తమ ఆరాధ్య దైవాలుగా కొలిచే సమ్మక్క-సారలమ్మ వన దేవతలు కొలువై ఉన్న మేడారంలో ప్రతీది ఒక విశేషమే. పసుపు-కుంకుమలనే అమ్మవార్ల ప్రతిరూపాలుగా భక్తులు భావిస్తారు. మేడారంతో పాటు చుట్టూ 40 కిలోమీటర్ల మేర ప్రతి చెట్టూ ప్రతి పుట్టా సమ్మక్క-సారలమ్మ ప్రతిరూపమేనని నమ్ముతారు. అక్కడ ఉన్న మట్టినే గద్దెలుగా మార్చి పసుపు కుంకుమ చల్లి మొక్కులు చెల్లిస్తారు. ఎత్తుబెల్లం, ఎదుర్కోళ్లతో అమ్మవార్లకు మనసారా మొక్కితే అనుకున్నది కచ్చితంగా నెరవేరుతుందనేది భక్తుల విశ్వాసం. అందుకే.. పేద.. ధనిక, చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా మహాజాతరకు తరలివస్తుంటారు. ఇసుకేస్తే రాలనంత రద్దీ ఉన్నా సరే.. వనదేవతలను దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. జాతర సమయంలో అడవిలోని ఏ వన్యప్రాణి కూడా భక్తులకు హాని చేయదని భక్తులు నమ్ముతారు. ఒకసారి జాతరకు వచ్చిన వారు.. మళ్లీ మళ్లీ వస్తుండడం వల్లే భక్తుల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతోంది. కాగా, ఈ సారి జాతరకు మేడారం కొత్త రూపు సంతరించుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లు ఖర్చుతో గద్దెలను ఆధునికీకరించడంతోపాటు భక్తుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులు చేపట్టింది. విశాలమైన క్యూలైన్లు, రాతి కట్టడాలు, రహదారుల విస్తరణ వంటి అనేక మార్పులు ఈ సారి చోటు చేసుకోనున్నాయి.

పల్లెలన్నీ ఒక్కటై.. పట్టణంగా

మహా జాతర సమయంలో మేడారంతోపాటు ఊరట్టం, కన్నెపల్లి, కాల్వపల్లి, కొత్తూరు, నార్లాపూర్‌, రెడ్డిగూడెం, వెంగళాపూర్‌ తదితర గ్రామాలన్నీ జాతర సమయంలో ఒక పట్టణంగా మారుతాయి. ఆ నాలుగు రోజులు మేడారం జాతరలో అన్ని లభిస్తాయి. కాఫీ నుంచి మొదలుకొని స్కాచ్‌ వరకు.. ఎడ్ల బండి నుంచి హెలీకాప్టర్‌ వరకు.. రంగుల రాట్నం నుంచి వీడియో గేమ్స్‌ వరకు అన్నీ కనవిందు చేస్తాయి. జాతరకు ఇంకా నెల రోజులు ఉండగా.. ఇప్పటికే ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు ప్రారంభమయ్యాయి.

Updated Date - Dec 31 , 2025 | 04:36 AM