Saraswati Pushkaralu: సరస్వతి.. భక్తజన నీరాజనం
ABN , Publish Date - May 25 , 2025 | 05:05 AM
సరస్వతి పుష్కరాల్లో భాగంగా శనివారం 2 లక్షల మందికి పైగా భక్తులు కాళేశ్వరం చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించారు. రద్దీ, ట్రాఫిక్ సమస్యలతో పాటు తీర్థప్రసాదాల కొరత భక్తులను ఇబ్బందిపెట్టింది.
ఒక్కరోజే 2 లక్షలకు పైగా భక్తుల పుణ్యస్నానాలు
2 రోజులే ఉండటంతో పెరిగిన రద్దీ
తగినన్ని బస్సులు లేక పడిగాపులు..
నేడు కాళేశ్వరానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
భూపాలపల్లి, మే 24 (ఆంధ్రజ్యోతి): సరస్వతి పుష్కరాల్లో భాగంగా కాళేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పుష్కర ఘాట్లు కిటకిటలాడాయి. పుష్కరాలు మరో రెండురోజులు మాత్రమే ఉండటంతో శనివారం దాదాపు 2 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల సంఖ్య పెరగడంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల రద్దీ బాగా పెరిగిపోయింది. కాగా హన్మకొండ, వరంగల్ నుంచి బస్సులను నాన్‌స్టా్‌పగా నడపడంతో భూపాలపల్లి, పరకాల ప్రాంతాలకు చెందిన భక్తులు కాళేశ్వరం చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపోయినన్ని లేకపోవటంతో పుష్కర స్నానాల కోసం వస్తున్న భక్తులు స్వస్థలాలకు తిరిగి వెళ్లటానికి గంటల కొద్ది వేచి చూసే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి వన్‌వేగా మార్చడంతో రాకపోకలు సజావుగానే జరుగుతున్నాయి. శనివారం పుణ్యస్నానాలు చేసిన భక్తులు కాళేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు ఒక్కసారిగా రావటంతో క్యూలైన్‌లో తోపులాట జరిగింది. అధికారులు అప్రమత్తమై దర్శనాలను వేగవంతం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భక్తుల సంఖ్యకు తగినట్లుగా తీర్థప్రసాదాలను సమకూర్చడంలో దేవాదాయశాఖ విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకల్లా లడ్డు, పులిహోర, ప్రసాదాలు అయిపోవటంతో పలువురు భక్తులు తీర్థప్రసాదాలు తీసుకోకుండానే తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగి వెళ్తున్నారు. మూడు రోజులుగా వర్షం కురియడంతో పార్కింగ్ స్థలాలన్నీ నీటమునిగాయి. పుష్కరఘాట్లు, టెంట్‌సిటీ పరిసరాలు బురదమయంగా మారాయి. కాగా, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ కాళేశ్వరాన్ని ఆదివారం సందర్శించనున్నారు.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..