kumaram bheem asifabad- అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:19 PM
జిల్లాలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, హౌసింగ్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, హౌసింగ్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలు, ఏకరూప దుస్తుల పంపిణీ ఇతర పనులను త్వరగా చేపట్టాలని ఇంజనీరింగ్, విద్యశాఖ అధికారులను ఆదేశించి పర్యవేక్షించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం సకల సదుపాయాలు కలిపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా శాఖల వారిగా మొక్కలు నాటేందుకు నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు 100 శాతం మొదలు పెట్టాలని సూచించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు మహిళ సంఘాల నుంచి రుణాలు అందించాలని చెప్పారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందిస్తుందని తెలిపారు. గ్రామపంచాయతీలలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని, దోమల వృద్ధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తరావు, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి నదీం, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
యూడైస్ పోర్టల్‌లో నమోదు చేయాలి..
కళాశాల విద్యార్థుల వివరాలను యూడైస్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా అద నపు కలెక్టర్, ఇన్‌చార్జీ డీఈవో దీపక్ తివారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాలో 44 జూనియర్ కళాశాలలున్నాయని కళాశా లల్లో విద్యనభ్యశించే ప్రథమ, ద్వితీయ, ఒకేషనల్ విద్యార్థుల వివరాలను యూడైస్ పోర్టల్ లో నమోదు చేయాలని చెప్పారు. సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రతి కళాశాలలో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టంను 100 శాతం పూర్తి చేయాలన్నారు. విద్యార్థుల హాజరు ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేశామని అన్నారు. సంబందిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి పనులు పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపాళ్లు, సంబందితశాఖల అధికారులు పాల్గొన్నారు.